Telugu Global
Sports

టీ-20 క్రికెట్లో ఆఫ్...ఘనులు!

టీ-20 అంతర్జాతీయ క్రికెట్లో 10వ ర్యాంకర్ ఆప్ఘనిస్థాన్ సంచలన విజయాలతో దూసుకుపోతోంది.

టీ-20 క్రికెట్లో ఆఫ్...ఘనులు!
X

టీ-20 అంతర్జాతీయ క్రికెట్లో 10వ ర్యాంకర్ ఆప్ఘనిస్థాన్ సంచలన విజయాలతో దూసుకుపోతోంది. ఆల్ రౌండర్ల పవర్ తో ప్రత్యర్థిజట్లను బెంబేలెత్తిస్తోంది. ఆసియాకప్ గ్రూప్- బీ లీగ్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దిగ్గజజట్లను కంగుతినిపించి గ్రూపు టాపర్ గా సూపర్-4 రౌండ్లో అడుగుపెట్టింది..

ఆఫ్ధనిస్థాన్...ఈ పేరు వినగానే అక్కడి తాలిబన్లపాలన, ఉగ్రవాదం, నిరంతర బాంబుపేలుళ్లు...అస్థిరత్వం, అభద్రతాభావం మాత్రమే కళ్లముందు కదలాడుతాయి. క్రికెట్ లాంటి అవుట్ డోర్ గేమ్ ఆడాలంటే తగిన స్టేడియాలు, క్రికెట్ మైదానాలు అక్కడ మచ్చుకైనా కానరావు. పైగా...ఆప్ఘనిస్థాన్ కు క్రికెట్ నేపథ్యం, చరిత్ర అంటూ ఏవీలేవు. అయినా...

అంతర్జాతీయ టీ-20 క్రికెట్ అత్యంత ప్రతిభావంతమైన జట్లలో ఆప్ఘనిస్థాన్ ఒకటిగా గుర్తింపు సంపాదించింది.

ఆల్ రౌండర్లే బలం......

స్వదేశంలో అంతర్జాతీయ స్థాయి కలిగిన క్రికెట్ స్టేడియాలు కానీ, మౌలికసదుపాయాలు కానీ లేకపోడంతో ఆప్ఘనిస్థాన్ జట్టు భారత్ లోని నోయిడా ను కేంద్రంగా చేసుకొని సాధన చేస్తూ వస్తోంది. పాక్ మాజీ క్రికెటర్లు శిక్షకులుగా ఓనమాలు దిద్దుకొన్న ఆప్ఘనిస్థాన్ జట్టు గత దశాబ్దకాలంలో అంతైఇంతై అన్నట్లుగా ఎదిగిపోయింది.

జాదూ స్పిన్ జోడీ రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ, కరీం జన్నత్, అజంతుల్లా ఉమర్ జాయ్, సమీఉల్లా షేర్వానీ లాంటి టీ-20 స్పెషలిస్ట్ ఆటగాళ్లు ప్రస్తుతం విదేశీ క్రికెట్ లీగ్ ల్లో పాల్గొంటూ ఆప్ఘన్ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.

స్వదేశంలో ఉంటే తాలిబన్ ప్రభుత్వం తమకు అనుమతి ఇస్తుందో లేదో తెలియన్ ఆప్ఘన్ క్రికెటర్లు మొత్తం 24మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెసిడెన్సీ వీసాలతో తమ ప్రస్థానం కొనసాగిస్తూ వస్తున్నారు.

2010 నుంచి 2013 వరకూ షార్జా, 2013 నుంచి 2015 వరకూ లాహోర్, 2016 నుంచి 2018 వరకూ గ్రేటర్ నోయిడా , 2019 నుంచి 2022 వరకూ అరబ్ ఎమిరేట్స్ తన ప్రధాన కేంద్రాలుగా ఆప్ఘనిస్థాన్ జట్టు తన ఉనికిని కాపాడుకొంటూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆప్ఘనిస్థాన్ ను కాందశీక క్రికెట్ జట్టు అన్నా ఆశ్చర్యం లేదు.

విజయాలకు చిరునామా....

ఆప్ఘనిస్థాన్ జట్టు ప్రస్తుత ఆసియాకప్ గ్రూప్- బీ ఆఖరి లీగ్ మ్యాచ్ వరకూ...మొత్తం ఆడిన 101 అంతర్జాతీయ టీ-20 పోటీలలో 68 విజయాలు, 32 పరాజయాలతో 67.82 విజయశాతం నమోదు చేసింది.

అంతేకాదు...ప్రస్తుత ఆసియాకప్ గ్రూప్- బీ ప్రారంభలీగ్ మ్యాచ్ లో 8వ ర్యాంకర్ శ్రీలంకను 8 వికెట్ల తేడాతో, రెండోమ్యాచ్ లో 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ ను 7 వికెట్లతో చిత్తు చేసిన తీరు ఆప్ఘనిస్థాన్ సత్తాకు నిదర్శనంగా కనిపిస్తుంది.

షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన పోరులో స్పిన్ జోడీ ముజీబుర్ 16 పరుగులిచ్చి 3 వికెట్లు, రషీద్ ఖాన్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా

తమజట్టును విజేతగా నిలిపారు. బంగ్లాజట్టు 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఓపెనర్లు నజీబుల్లా 17 బాల్స్ లో 6 భారీసిక్సర్లతో 43 పరుగుల నాటౌట్ స్కోరు, ఇబ్రహీం జడ్రాన్ 42 పరుగులు సాధించడంతో ఆప్ఘన్ జట్టు 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకోగలిగింది.

సిక్సర్ల సునామీ నజీబుల్లా జడ్రాన్....

ఆప్ఘన్ సునామీ ఓపెనర్ నజీబుల్లా జడ్రాన్..అంతర్జాతీయ టీ-20 ఫార్మాట్లో సిక్సర్ల హిట్టర్ గా రికార్డుల మోత మోగిస్తున్నాడు. చేజింగ్ సమయంలో డెత్ ఓవర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన మొనగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నజీబుల్లా ఇప్పటికే 18 సిక్సర్లు బాదడం ద్వారా ఇంగ్లండ్ కెప్టెన్ వోయిన్ మోర్గాన్, శ్రీలంక ఆల్ రౌండర్ తిస్సార పెరెరా ల పేరుతో ఉన్న 17 సిక్సర్ల రికార్డును తెరమరుగు చేశాడు.

టీ-20 మ్యాచ్ ఆట ఆఖరి 5 ఓవర్ల( డెత్ ఓవర్ల )లో 53 సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్ గా ప్రపంచ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచాడు. సఫారీ ఆటగాడు డేవిడ్ మిల్లర్ 47 సిక్సర్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

2010 టీ-20 ప్రపంచకప్ కు అర్హత సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన ఆప్ఘనిస్థాన్ 2017లో టెస్ట్ హోదా సంపాదించగలిగింది. 2016 టీ-20 ప్రపంచకప్ సూపర్ -10 పోరులో అప్పటి చాంపియన్ వెస్టిండీస్ జట్టునే కంగుతినిపించిన ఘనత ఆప్ఘనిస్థాన్ కు ఉంది.

ఐసీసీ టీ-20 వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో బంగ్లాసారథి నబీ ఆల్ రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో నిలిస్తే..బౌలర్ల ర్యాంకింగ్స్ లో రషీద్ ఖాన్ 3, నజీబుల్లా 9 స్థానాలలో కొనసాగుతున్నారు. టీ-20 క్రికెట్లో అత్యధికంగా 278 పరుగుల స్కోరు సాధించిన రెండుజట్లలో ఒకటిగా నిలిచిన ఘనత సైతం ఆప్ఘనిస్థాన్ కే దక్కుతుంది.

ఐదుగురు ఆల్ రౌండర్ల ఏకైకజట్టు...

తమ ఆల్ రౌండ్ ప్రతిభతో ఆట స్వరూపాన్నే మార్చి వేయగల నాణ్యమైన ఆల్ రౌండర్ల కోసం ఆసియా క్రికెట్ దిగ్గజాలు భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఓవైపు నానాపాట్లు పడుతుంటే..ఆప్ఘనిస్థాన్ జట్టుకు మాత్రం ఐదుగురు ఆల్ రౌండర్లు అందుబాటులో ఉన్నారు.

ప్రస్తుత ఆసియాకప్ లో పాల్గొంటున్న 16 మంది సభ్యుల ఆప్ఘనిస్థాన్ జట్టులోమహ్మద్ నబీ, రషీద్ ఖాన్, కరీం జన్నత్, హజమ్ తుల్లా ఒమర్జాయ్, సమీఉుల్లా షెర్వారీ ఆల్ రౌండర్లుగా సేవలు అందిస్తున్నారు.

ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్ లో జరిగే 2022 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఆఫ్ఘనిస్థాన్ ఒకటని క్రికెట్ పండితులు హెచ్చరిస్తున్నారు.

ఆసియాకప్ టోర్నీలో ఇప్పటికే మాజీ చాంపియన్ శ్రీలంక, తనకంటే మెరుగైన ర్యాంక్ లో ఉన్న బంగ్లాజట్లను అలవోకగా ఓిడించిన ఆప్ఘన్ జట్టు సూపర్ -4 రౌండ్లో భారత్, పాక్ జట్లకు సైతం గట్టిపోటీ ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  4 Sept 2022 9:00 AM IST
Next Story