Telugu Global
Sports

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ 'శిఖరం' జోకోవిచ్!

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన తొలిఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ శిఖరం జోకోవిచ్!
X

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ 'శిఖరం' జోకోవిచ్!

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 23 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన తొలిఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు..

ఆధునిక టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్, రాఫెల్ నడాల్ సాధించలేని గ్రాండ్ రికార్డును సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ సొంతం చేసుకొన్నాడు. 2023 సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ నెగ్గడం ద్వారా 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. టైటిల్ సమరంలో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ ను మూడుసెట్లలో కంగు తినిపించి తన కెరియర్ లో 3వసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని అందుకోగలిగాడు.

అసలుసిసలు చాంపియన్ జోకోవిచ్...

గ్లోబల్ గేమ్ టెన్నిస్ లో సెర్బియా స్టార్ నొవాక్ జోకోవిచ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. గాయాలు, శారీరక, మానసిక సమస్యలు...చివరకు కరోనా వైరస్ సైతం జోకోవిచ్ సంకల్పం, పట్టుదల, అంకితభావం ముందు చిన్నబోయాయి. క్లేకోర్టు టెన్నిస్ మొనగాడు రాఫెల్ నడాల్ కోటలో పాగా వేయటం ద్వారా జోకోవిచ్ 2023 ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలచి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు.

వింబుల్డన్ వండర్ రోజర్ ఫెదరర్, ఫ్రెంచ్ ఓపెన్ థండర్ రాఫెల్ నడాల్ ల ప్రాభవం అడుగంటడంతో జోకోవిచ్ కు తిరుగేలేకుండా పోయింది.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లోని నాలుగు ( వింబుల్డన్, ఫ్రెంచ్, ఆస్ట్ర్రేలియన్, అమెరికన్ ఓపెన్ ) రకాల టోర్నీలలోనూ నిలకడగా రాణిస్తూ...కెరియర్ ట్రిపుల్ ను సాధించడం ద్వారా జోకోవిచ్ సంచలనం సృష్టించాడు.

54 సంవత్సరాలలో ఒకే ఒక్కడు....

పచ్చిక కోర్టుల్లో జరిగే వింబుల్డన్, ఎర్రమట్టి కోర్టులో జరిగే ఫ్రెంచ్ ఓపెన్, నేర్పు, ఓర్పులకు పరీక్షగా నిలిచే యూఎస్ ఓపెన్, విపరీతమైన బౌన్స్ తో కూడిన ఆస్ట్రేలియన్

ఓపెన్ సింథటిక్ కోర్టుల్లో జరిగే గ్రాండ్ స్లామ్ పోరులో ఒక్కసారి విజేతగా నిలిచినా గొప్పఘనతగానే భావిస్తారు. అంతేకాదు...నాలుగు రకాల ట్రోఫీలను ఒకే ఏడాదిలో సాధిస్తే గ్రాండ్ స్లామ్ గానూ, కెరియర్ లో సాధిస్తే కెరియర్ గ్రాండ్ స్లామ్ గానూ పరిగణిస్తారు.

టెన్నిస్ చరిత్రను ఓసారి తిరగేస్తే పురుషుల విభాగంలో ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన) ఘనతను రెండుసార్లు చొప్పున సాధించిన ఆటగాళ్ళలో ఆస్ట్ర్రేలియా దిగ్గజాలు రాయ్‌ ఎమర్సన్‌( 1967 ), రాడ్‌ లేవర్‌ (1969) మాత్రమే ఉన్నారు.

అయితే...పారిస్ లో ముగిసిన 2023 ఫ్రెంచ్ ఓపెన్ పైనల్లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ ను వరుససెట్లలోనే చిత్తు చేయడం ద్వారా 3వ సీడ్ జోకోవిచ్ తన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సంఖ్యను 23కు పెంచుకొన్నాడు.

ఇప్పటి వరకూ నడాల్ 22, రోజర్ ఫెదరర్ 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ మాత్రమే సాధించగా..ఈ ఇద్దరు మొనగాళ్లను జోకోవిచ్ అధిగమించడం ద్వారా 23 టైటిల్స్ నెగ్గిన తొలి ప్లేయర్ గా తనకుతానే సాటిగా నిలిచాడు.

కెరియర్ గ్రాండ్ స్లామ్ ను మూడోసారి సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఓపెన్‌ శకంలో...అదీ 1968 తర్వాత నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచిన తొలి ఆటగాడిగా జోకోవిచ్ చరిత్ర సృష్టించాడు. తన ప్రధాన ప్రత్యర్థులు రోజర్ ఫెదరర్, రాఫెల్ నడాల్ సాధించలేని ఘనతను జోకో సొంతం చేసుకోగలిగాడు.

2016లో తొలిసారిగా ఫ్రెంచ్ఓపెన్ విజేతగా నిలిచిన జోకోవిచ్ మరో క్లే కోర్టు టైటిల్ కోసం 2021 వరకూ వేచిచూడక తప్పలేదు. కేవలం రెండేళ్ల విరామం లోనే మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు.

జోకో రికార్డుల మోత...

తన కెరియర్ లో 10సార్లు ఆస్ట్ర్రేలియన్, 3 యూఎస్ ఓపెన్, 7 వింబుల్డన్, 3 ఫ్రెంచ్ ఓపెన్ లతో కలుపుకొని జోకోవిచ్ మొత్తం 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకొన్నాడు.

36 సంవత్సరాల వయసుకే 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో సహా మొత్తం 90 టోర్నీలు నెగ్గడంతో పాటు 200 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ఆర్జించాడు. అంతేకాదు...

327 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడం ద్వారా మరోప్రపంచ రికార్డు సాధించాడు.

ఇది జోకోవిచ్ దశాబ్దం...

గత దశాబ్దకాలంగా ప్రపంచ పురుషుల టెన్నిస్ లో జోకోవిచ్ ఆధిపత్యమే కొనసాగుతోంది.2011 నుంచి 2023 మధ్యకాలంలో జోకోవిచ్ 20 గ్రాండ్ స్లామ్, 31 మాస్టర్స్, 4 ఏటీపీ టైటిల్స్ నెగ్గడం ద్వారా నడాల్, ఫెదరర్ లాంటి ప్రత్యర్థులపై పైచేయి సాధించాడు. 2023 గ్రాండ్ స్లామ్ సీజన్ లో ఇప్పటికే రెండు టోర్నీలలో విజేతగా నిలిచిన జోకోవిచ్ మిగిలిన రెండు ( వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ) టైటిల్స్ నెగ్గినా ఆశ్చర్యపోనక్కరలేదు.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో మేరునగధీరుడు నొవాక్ జోకోవిచ్ మాత్రమే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  12 Jun 2023 3:45 AM GMT
Next Story