నంబర్ వన్ గా 378 వారాలు...జోకోవిచ్ ప్రపంచ రికార్డు!
ప్రపంచ టెన్నిస్ లో 378 వారాలపాటు నంబర్ వన్ ర్యాంకర్ గా ఉండగలనని తాను కలనైనా అనుకోలేదని, ప్రస్తుతం తాను అత్యుత్తమ ఫిట్ నెస్ తో ఉన్నానని, శారీరకంగా,మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉన్నట్లు జోకోవిచ్ ప్రకటించాడు.
సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ ప్రపంచ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడిగా తన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును తానే తిరగరాసుకుంటూ దూసుకుపోతున్నాడు.
సెర్బియన్ వండర్ నొవాక్ జోకోవిచ్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన రికార్డులను తానే అధిగమించుకొంటూ దూసుకుపోతున్నాడు. టెన్నిస్ ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక (378 ) వారాలపాటు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఏటీపీ విడుదల చేసిన తాజార్యాంకింగ్స్ ప్రకారం జొకోవిచ్ అత్యధిక పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌ను నిలబెట్టు కున్నాడు. 377 వారాల రికార్డుతో గత వారం ఆల్ టైమ్ గ్రేట్ స్టెఫీ గ్రాఫ్ సరసన నిలిచిన జోకోవిచ్..ఆ తదుపరి వారంలో సైతం ర్యాంక్ నిలుపుకోడం ద్వారా 378 వారాల రికార్డు నెలకొల్పిన తొలి ప్లేయర్ గా నిలిచాడు.
22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ తో....
మెల్బోర్న్ వేదికగా గత నెలలో ముగిసిన 2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ ను రికార్డు స్థాయిలో 10వసారి గెలుచుకోడం ద్వారా జోకోవిచ్ తిరిగి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకోగలిగాడు. ఆ తర్వాత నుంచి జోకో మరి వెనుదిరిగి చూసింది లేదు. ఆడిన 12కు 12మ్యాచ్ ల్లోనూ అజేయంగా నిలవడం ద్వారా తన టాప్ ర్యాంక్ ను నిలబెట్టుకోగలిగాడు.
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 22 టైటిల్స్ నెగ్గిన రాఫెల్ నడాల్ రికార్డును తన పదో ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ విజయంతో సమం చేసిన జోకోవిచ్..23వ గ్రాండ్ స్లామ్ టైటిలో తో సరికొత్త రికార్డుకు ఉరకలేస్తున్నాడు.
కలనైనా అనుకోలేదు....
ప్రపంచ టెన్నిస్ లో 378 వారాలపాటు నంబర్ వన్ ర్యాంకర్ గా ఉండగలనని తాను కలనైనా అనుకోలేదని, ప్రస్తుతం తాను అత్యుత్తమ ఫిట్ నెస్ తో ఉన్నానని, శారీరకంగా,మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉన్నట్లు జోకోవిచ్ ప్రకటించాడు.
విజయాలు, టైటిల్స్ కోసం అంకితభావంతో శ్రమిస్తూ ఉంటే ర్యాంకింగ్ దానంతట అదే వస్తుందని, తాను లక్ష్యాలను ఎంచుకొని..వాటి కోసం పాటుపడుతూ తన ప్రస్థానం కొనసాగిస్తున్నట్లు తెలిపాడు.
ఫెదరర్ ను మించిన జోకోవిచ్..
పురుషుల సింగిల్స్ చరిత్రలో ..గతంలో 310 వారాలపాటు టాప్ ర్యాంకర్ గా కొనసాగిన స్విస్ గ్రేట్ రోజర్ ఫెదరర్ రికార్డును జోకోవిచ్ 78 వారాల మేర అధిగమించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచాడు.
తన కెరియర్ లో ఆరోసారి ఇటాలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన జోకోవిచ్ టాప్ సీడ్ హోదాలో 2023 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ వేటకు సమాయత్తమవుతున్నాడు.
స్పానిష్ యంగ్ గన్ అలకరాజ్, రష్యన్ స్టార్ డేనిల్ మెద్వదేవ్, గ్రీకువీరుడు సిటిస్ పాస్ లు జోకోవిచ్ కు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ వయసు మీద పడటం, ఫిట్ నెస్ సమస్యలతో వెనుకబడిపోయాడు.