వింబుల్డన్ లో జోకోవిచ్ సెంచరీ!
గ్రాండ్ స్లామ్ కింగ్ నొవాక్ జోకోవిచ్ వింబుల్డన్లో సెంచరీ సాధించాడు. 14వసారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు.
గ్రాండ్ స్లామ్ కింగ్ నొవాక్ జోకోవిచ్ వింబుల్డన్లో సెంచరీ సాధించాడు. 14వసారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు.
సెర్బియన్ ఎవర్ గ్రీన్ స్టార్ నొవాక్ జోకోవిచ్ గ్రాస్ కోర్టు టెన్నిస్ లో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. వింబుల్డన్ గ్రాస్ కోర్టు టెన్నిస్ లో సెంచరీ పూర్తి చేశాడు. అదేంటి..టెన్నిస్ లో సెంచరీలేంటి అంటూ ఆశ్చర్యపోకండి. ఆల్ -ఇంగ్లండ్ క్లబ్ వేదికగా తన వందో వింబుల్డన్ మ్యాచ్ ఆడటం ద్వారా హేమాహేమీల సరసన నిలిచాడు.
గ్రాండ్ స్లామ్ క్వార్టర్స్ లో 56వసారి...
తన కెరియర్ లో ఇప్పటికే 7 వింబుల్డన్ టైటిల్స్ తో పాటు 23 గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు నెగ్గిన 36 సంవత్సరాల జోకోవిచ్..ప్రస్తుత 2023 టోర్నీలో రెండోసీడ్ గా టైటిల్ వేటకు దిగాడు.
ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ కోసం బరిలోకి దిగడం ద్వారా 100 మ్యాచ్ ల రికార్డును చేరుకోగలిగాడు. పోలెండ్ ఆటగాడు హ్యూబర్ట్ హుర్కాజ్ తో మూడుగంటలపాటు జరిగిన హోరాహోరీ సమరంలో జోకోవిచ్ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి 7-6, 7-6, 5-7, 6-4తో విజేతగా నిలవడం ద్వారా 14వసారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించగలిగాడు. గత దశాబ్దకాలంగా క్వార్టర్స్ చేరుతూ రావడం ద్వారా జోకో అరుదైన ఘనతను సొంతం చేసుకోగలిగాడు.
పోలిష్ థండర్ హుర్కాజ్ 33 ఏస్‌లతో చెలరేగినా 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడం జొకోవిచ్‌కు ఇది 56వసారి కాగా.. పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్ (58) మాత్రమే జొకో కంటే ముందున్నాడు.తన కెరియర్ లో 56వసారి గ్రాండ్ స్లామ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ చేరడం ద్వారా దిగ్గజ ఆటగాడు జిమ్మీ కానర్స్ రికార్డును సమం చేయడం ద్వారా..స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ తర్వాతి స్థానంలో నిలువగలిగాడు.
సెమీఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో రష్యన్ ప్లేయర్ యాండ్రీ రుబులేవ్ తో తలపడాల్సి ఉంది.
పురుషుల సింగిల్స్ ఇతర ప్రీ- క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ల్లో విజయాలతో మెద్వెదెవ్, సిన్నెర్ కూడా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు.
మూడో సీడ్ మెద్వెదెవ్ 6-4, 6-2తో లిచెకాపై గెలుపొందగా.. ఐదో సీడ్ సిట్సిపాస్ 6-3, 6-7 (4/7), 6-3, 4-6, 4-6తో యూబాంక్స్ చేతిలో పరాజయం పాలయ్యాడు. అమెరికా ఆటగాడు యూబాంక్స్ కు ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఇదే అతిపెద్ద గెలుపు.
డబుల్స్ ప్రీ-క్వార్టర్స్ లో బోపన్న జోడీ...
పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్నజోడీ ప్రిక్వార్టర్స్‌కు చేరుకొన్నారు. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బరిలోకి దిగిన బోపన్న రెండో రౌండ్‌లో 7-5, 6-3తో బ్రిటన్ జోడీపై విజయం సాధించారు. తొలి సెట్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో కాస్త తడబడిన బోపన్న జోడీ.. రెండో సెట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. 42 సంవత్సరాల వయసులో రోహన్ బొపన్న వింబుల్డన్ లో ఆడుతున్న ఏకైక భారత క్రీడాకారుడు కావడం విశేషం.
చెమటోడ్చిన మహిళల టాప్ సీడ్ స్టార్...
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ క్వార్టర్స్ చేరటానికి చెమటోడ్చాల్సి వచ్చింది. ప్రిక్వార్టర్స్‌లో స్వియాటెక్ 6-7 (4/7), 7-6 (7/2), 6-3తో బెన్‌కిక్‌పై విజయం సాధించింది. తొలి సెట్‌ను టైబ్రేక్ లో కోల్పోయిన స్వియాటెక్.. రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంది. ఒక దశలో ఓటమి ఖాయమే అనిపించినా.. తుదికంటా పోరాడిన స్వియాటెక్ కీలక సమయాల్లో పాయింట్లు ఖాతాలో వేసుకొని ముందంజ వేసింది. ఇక 16 ఏండ్ల క్వాలిఫయర్ ఆండ్రీవా ప్రిక్వార్టర్స్‌లో 6-3, 6 -7 (4/7), 2-6తో కైస్ చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో రిబాకినా వాకోవర్‌తో ముందంజ వేయగా.. పెగులా 6-1, 6-3తో సురెంకోపై గెలుపొందింది. స్వితోలినా 2-6, 6-4, 7-6 (11/9)తో అజరెంకాపై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.