Telugu Global
Sports

జ‌కోవిచ్‌పై కరోనా వ్యాక్సిన్ నిషేధం!

జ‌కోవిచ్‌పై కరోనా వ్యాక్సిన్ నిషేధం!
X

ప్రపంచ టెన్నిస్ పురుషుల నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జ‌కోవిచ్‌ను కరోనా వ్యాక్సిన్ దుమారం వెంటాడుతూనే ఉంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అమెరికన్ ఓపెన్లో పాల్గొనకుండా జ‌కోవిచ్‌పై నిషేధం పిడుగు పడింది. సెర్బియన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ టాప్ ర్యాంక్ ఆటగాడు, 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత నొవాక్ జ‌కోవిచ్‌కు మరోసారి కరోనా వ్యాక్సిన్ దెబ్బ తగిలింది. వ్యాక్సిన్ తీసుకోడానికి తాను వ్యతిరేకమంటూ మొండికేసిన జకోవిచ్ ప్రస్తుత సీజన్లో భారీ మూల్యమే చెల్లించాడు.

యూఎస్ ఓపెన్ నిషేధం

న్యూయార్క్ వేదికగా ఆగస్టు 29 నుంచి ప్రారంభంకానున్న ప్రస్తుత 2022 సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ అమెరికన్ ఓపెన్లో పాల్గొనకుండా నిర్వాహక సంఘం నిషేధం విధించింది. కరోనా వ్యాక్సిన్ ఓ బూటకమని, తాను దానిని నమ్మనని గతంలోనే ప్రకటించిన జకోవిచ్..వ్యాక్సిన్ వేయించుకోకుండానే ప్రపంచ వ్యాప్తంగా జరిగే పలు టెన్నిస్ టోర్నీలలో పాల్గొంటూ వస్తున్నాడు. అయితే..మెల్బోర్న్ వేదికగా జనవరిలో జరిగిన గ్రాండ్ స్లామ్ ప్రస్తుత సీజన్ తొలి టోర్నీ ఆస్ట్రేలియ‌న్‌ ఓపెన్‌కు సైతం జోకోవిచ్ దూరమయ్యాడు. వ్యాక్సిన్ తీసుకోకుండా టోర్నీలో పాల్గొనడాన్ని అనుమతించేది లేదని గతంలోనే ఆస్ట్రేలియ‌న్‌ ఓపెన్ నిర్వాహక సంఘం ప్రకటించడంతో టోర్నీకి దూర‌మ‌య్యాడు.

యూఎస్ ఓపెన్లోనూ అదే సీన్...

ఆ తర్వాత పారిస్ వేదికగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్, లండన్ వేదికగా ముగిసిన వింబుల్డన్ టోర్నీలలో వ్యాక్సిన్ తీసుకోక‌పోయినా జకోవిచ్‌ను ఆయా నిర్వాహక సంఘాలు అనుమతించాయి. అయితే..యూఎస్ ఓపెన్ నిర్వాహక సంఘం మాత్రం తమ టోర్నీలో జకోవిచ్ పాల్గొనాలని భావిస్తే వ్యాక్సిన్ తీసుకోక తప్పదని స్పష్టం చేసింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక్కో రాష్ట్రం ఒక్కో రకమైన నిబంధనలు పాటిస్తోంది.తమ దేశానికి వివిధ దేశాల నుంచి వచ్చే విదేశీయులు కరోనా వ్యాక్సిన్ తీసుకోడం తప్పనిసరని, సర్టిఫికెట్ ను సమర్పిస్తేనే అనుమతిస్తామంటూ యూఎస్ ఓపెన్ నిర్వాహక సంఘం స్పష్టం చేసింది. జకోవిచ్ ఎంతగొప్ప ఆటగాడైనా తమ షరతులను గౌరవించి తీరాల్సిందేనని..లేదంటే టోర్నీలో పాల్గొనటానికి అనుమతించేది లేదంటూ ప్రకటించింది.

నిషేధం ఓ పెద్దజోక్- మెకెన్రో

ప్రపంచ మేటి ఆటగాడు, మూడు సార్లు అమెరికన్ ఓపెన్ విన్నర్ నొవాక్ జకోవిచ్‌ను వ్యాక్సిన్ తీసుకోలేదన్న కారణంగా ఈ ఏడాది టోర్నీలో పాల్గొనకుండా నిషేధం విధించడాన్ని మించిన జోక్ మరొకటి లేదని అమెరికన్ టెన్నిస్ దిగ్గజం జాన్ మెకెన్రో మండిపడ్డాడు. కరోనా విలయతాండవం చేసిన సమయంలో నిర్వహించిన యూఎస్ ఓపెన్ టోర్నీలలో జకోవిచ్‌ను అనుమతించిన విషయాన్ని మెకెన్రో గుర్తు చేశాడు. కరోనా ప్రభలంగా ఉన్న సమయంలో జకోవిచ్‌ను అనుమతించిన నిర్వాహక సంఘం..కరోనా అంతగా లేని ప్రస్తుత తరుణంలో ఎందుకు అనుమతించడం లేదంటూ ప్రశ్నించాడు.మరోవైపు..ప్రస్తుత సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీకి దూరం కావడం బాధాకరమని, తనపై నిషేధం విధించినంత మాత్రాన వచ్చిన నష్టం ఏమీలేదని, టోర్నీలో పాల్గొంటున్న తన సహ క్రీడాకారులకు బెస్టాఫ్ లక్ అంటూ జకోవిచ్ ట్విట్టర్ ద్వారా ప్రతిస్పందించాడు.

కళతప్పనున్న యూఎస్ ఓపెన్...

ఆధునిక టెన్నిస్ అసాధారణ ఆటగాళ్లలో ఒకరిగా పేరుపొందిన 35 సంవత్సరాల నొవాక్ జకోవిచ్ కు మూడు (2011, 2015, 2018) అమెరికన్ ఓపెన్లతో సహా మొత్తం 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన అరుదైన రికార్డు ఉంది. గత నెలలో జరిగిన వింబుల్డన్ టోర్నీలో ఏడోసారి విజేతగా నిలవడం ద్వారా 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడం ద్వారా...22 టైటిల్స్ హీరో నాద‌ల్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. గత ఏడాది జరిగిన అమెరికన్ ఓపెన్ టైటిల్ సమరంలో డేనిల్ మెద్వదేవ్ చేతిలో పరాజయం పొందడం ద్వారా రన్నరప్‌గా నిలిచాడు. టోర్నీకి జకోవిచ్ దూరం కావడంతో డిఫెండింగ్ చాంపియన్ మెద్వదేవ్, మాజీ చాంపియన్ నాద‌ల్‌ పురుషుల సింగిల్స్ లో హాట్ ఫేవరెట్లుగా నిలిచారు.

First Published:  26 Aug 2022 6:11 AM GMT
Next Story