జీవితంలో ఏదీ శాశ్వతం కాదు-రవిశాస్త్రి
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ ఎన్నికకావడం ఖాయమవడంతో భారత మాజీ కోచ్, విఖ్యాత కామెంటీటర్ రవి శాస్త్రి సంతోషం వ్యక్తం చేశారు
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ ఎన్నికకావడం ఖాయమవడంతో భారత మాజీ కోచ్, విఖ్యాత కామెంటీటర్ రవి శాస్త్రి సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదంటూ సౌరవ్ గంగూలీకి ఊరట కలిగించారు...
భారత క్రికెట్ బోర్డుకు కష్టమైన, క్లిష్టమైన కాలంలో అధ్యక్షుడిగా మూడేళ్లపాటు వ్యవహరించిన సౌరవ్ గంగూలీ నిష్క్ర్రమణ ఖాయం కావడం, మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ సరికొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మార్గం సుగమం కావడం పట్ల మాజీ కోచ్, విఖ్యాత కామెంటీటర్ రవిశాస్త్రి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
రోజర్ బిన్నీకి రవిశాస్త్రి హ్యాట్సాఫ్..
భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడుగా Roger Binnyఎన్నికైతే అంతకుమించిన ఆనందం మరొకటిలేదని, బిన్నీతో కలసి 1983 ప్రపంచకప్ లో తాను పాల్గొన్నానని రవిశాస్త్రి గుర్తు చేసుకొన్నాడు.
సౌరవ్ గంగూలీ స్థానంలో ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ బోర్డు అధ్యక్షుడు కావటాన్ని తాను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని, రోజర్ వివాదరహితుడు, గొప్పవ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ ప్రశంసించాడు.
కర్ణాటక క్రికెట్ సంఘానికి అధ్యక్షుడుగా సేవలు అందిస్తున్న రోజర్ బిన్నీ ఇప్పుడు బీసీసీఐకి అధ్యక్షుడు కావడంలో ఆశ్చర్యంలేదని, భారత్ కు ప్రపంచకప్ సాధించిపెట్టిన జట్టులోని ఓ సభ్యుడు బీసీసీఐ చైర్మన్ కావడాన్ని మించిన గౌరవం మరొకటి ఉండదని చెప్పాడు.
రెండోసారి.. సాంప్రదాయం లేదు...!
భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఇప్పటి వరకూ ఏవ్యక్తీ వరుసగా రెండుసార్లు లేరనీ, అది సాంప్రదాయం కానేకాదంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. జీవితంలో ఏదీ శాశ్వతంకాదంటూ గతంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన సౌరవ్ గంగూలీకి హితవు పలికారు.
పదవులు, బాధ్యతలు ఒక్కరే అనుభవించాలంటే కుదరదని, వేరేవారికీ అవకాశం ఇవ్వాలని, మనం తప్పుకొంటేనే వేరొకరికి అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈరోజు నేను చేసింది రేపు చేస్తానన్న గ్యారెంటీ ఏదీలేదని..అలాగే ఒకే పదవిలో సుదీర్ఘకాలం కొనసాగాలనుకోవడంలో అర్థంలేదని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.
మరోవైపు..బిన్నీకి స్థిరమైన అభిప్రాయాలున్నాయనీ, ఎవ్వరూ ప్రభావితం చేయలేరని, జాతీయ క్రికెట్, ప్రధానంగా దేశవాళీ క్రికెట్ ప్రయోజనాలే ప్రధానంగా పని చేయడం ఖాయమని తాను భావిస్తున్నానని చెప్పారు.
దేశంలోని క్రికెట్ స్టేడియాలలో వసతులు అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగుపర్చాల్సి ఉందని, అత్యుత్తమ ప్రమాణాలు సాధించాలంటే అత్యుత్తమ సదుపాయాలు ఉండితీరాలని రవిశాస్త్రి చెప్పారు.
రోజర్ బిన్నీ చైర్మన్ గా భారత క్రికెట్ మరింతగా అభివృద్ధి సాధించాలని తాను కోరుకొంటున్నట్లు రవిశాస్త్రి తెలిపారు.