అభిమానులకు మెస్సీ స్వీట్ షాక్.. రిటైర్మెంట్ ఆలోచన ఇప్పట్లో లేదు!
ప్రపంచ కప్ సాధించాలని గతంలో కలలు కని సాధించలేకపోయాను. ఇప్పుడు ఆ లోటు లేదు కాబట్టి.. స్వేచ్ఛగా కొన్నాళ్లు ఆడతానని మెస్సీ అన్నాడు.
లియోనల్ మెస్సీ సుదీర్ఘ కెరీర్ చరమాంకానికి చేరుకున్న తర్వాత వరల్డ్ కప్‌ను గెలుచుకున్నాడు. కెప్టెన్‌గా ముందుండి నడిపించడమే కాకుండా.. తన చిరకాల వాంఛను ఆదివారం ఖతర్ వేదికగా తీర్చుకున్నాడు. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు కప్ అందించి అభిమానుల మనుసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. అయితే, తనకు ఇదే చివరి ప్రపంచకప్ అనీ.. ఆ తర్వాత ఇక వరల్డ్ కప్ ఆడబోనని ప్రకటించాడు. మూడు నెలల క్రిందటే మెస్సీ తన మనసులోని మాటను చెప్పగా.. అభిమానులు కూడా ఉద్వేగానికి గురయ్యారు.
ఖతర్‌లో వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత కూడా తన రిటైర్మంట్‌పై కామెంట్లు చేస్తూనే వచ్చిన మెస్సీ.. ఫైనల్ తర్వాత మాత్రం మాట మార్చాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చాడు. 'తాను ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రిటైర్ అవుదామని అనుకున్నాను. కెరీర్‌లో ఇక వరల్డ్ కప్ వస్తే చాలని భావించాను. ఇప్పటికే కోపా అమెరికా కప్ కూడా సాధించాను. ఇప్పుడు వరల్డ్ కప్ కూడా వచ్చింది. అయితే నేను ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తాను. ప్రపంచ ఛాంపియన్‌గా మరి కొన్ని గేమ్స్ ఆడాలని భావిస్తున్నాను. అలా ఆడుతుంటే వచ్చే మజాను ఆస్వాదించాలని అనుకుంటున్నాను' అని మెస్సీ స్పష్టం చేశాడు.
ప్రపంచ కప్ సాధించాలని గతంలో కలలు కని సాధించలేకపోయాను. ఇప్పుడు ఆ లోటు లేదు కాబట్టి.. స్వేచ్ఛగా కొన్నాళ్లు ఆడతానని అన్నాడు. మెస్సీ మాటలను బట్టి చూస్తే మరో రెండేళ్లు ఫుట్‌బాల్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం అర్జెంటీనా జట్టులో ఉన్న వారంతా కుర్రవాళ్లే. మెస్సీ కనుక రిటైర్ అయితే అదొక సాధారణ జట్టుగా మిగిలిపోతుంది. అందుకే కొన్నాళ్లు జట్టుతోనే ఉండి భవిష్యత్ స్టార్‌లకు దిశానిర్దేశనం చేయాలని భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. రాబోయే ప్రపంచకప్ అమెరికా, మెక్సికో, కెనాడా వేదికగా జరుగనున్నది. అప్పటికి మెస్సీ వయస్సు దాదాపు 40కి చేరుకుంటుంది. ఇప్పటి నుంచి తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటే డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగే అర్జెంటీనా జట్టులో మెస్సీ ఆడవచ్చు.
అయితే అప్పటి వరకు మెస్సీ జట్టుతో కొనసాగడం అంటే చాలా కష్టమే. ఫుట్‌బాల్ వంటి ఆటలో ఫిట్‌నెస్ సరిగా లేకపోతే మనుగడ కష్టం. కుర్రాళ్లతో సమానంగా మైదానంలో దాదాపు 2 గంటల పాటు పరుగులు తీయడం అంటే మామూలు విషయం కాదు. అయితే, మెస్సీ మాటలను బట్టి చూస్తే మరో రెండేళ్లు జట్టుతో ఉండే అవకాశం ఉంది. కానీ వచ్చే వరల్డ్ కప్ వరకు మాత్రం ఆడేందుకు ఛాన్స్ లేనట్లే తెలుస్తున్నది. మొత్తానికి మెస్సీ ఇప్పుడే రిటైర్ అవడం లేదనే వార్త మాత్రం ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ప్రారంభం కానున్నది. పారీస్ సెయింట్ జర్మైన్ జట్టుతో పాటు మెస్సీ బరిలోకి దిగుతాడని తెలుస్తున్నది.