పతకాలే కాదు..నజరానాలు తిరిగి ఇవ్వాలి-బ్రిజ్ భూషణ్!
లైంగిక వేధింపుల విచారణ ఎదుర్కొంటున్న కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరోసారి నిరసన చేపట్టిన వస్తాదులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
లైంగిక వేధింపుల విచారణ ఎదుర్కొంటున్న కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరోసారి నిరసన చేపట్టిన వస్తాదులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు....
తమపై జరిగిన లైంగిక వేధింపులకు నిరసనగా ఏడుగురు భారత మహిళా వస్తాదులు చేపట్టిన నిరసన 28వ రోజుకు చేరింది. జాతీయ కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత విఖ్యాత వస్తాదుల బృందం 28 రోజుల క్రితం రెండోసారి నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే రాష్ట్ర్రపతి, ప్రధానితో సహా దేశంలోని ప్రముఖులందరికీ తమకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ, న్యాయం చేయాలని కోరుతూ వస్తాదుల బృందం లేఖలు అందచేసినా పరిస్థితి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది.
ఓ మైనర్ బాలికతో సహా మొత్తం ఏడుగురు మహిళా వస్తాదులను కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు, ఆయన సహచరులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు..సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి..ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
వస్తాదుల గోడు వినని ప్రధాని...
మరోవైపు ..తమకు న్యాయం జరిగే వరకూ దీక్ష వీడేది లేదంటూ వస్తాదుల బృందం మంకుపట్టు పట్టి నిరసనలను కొనసాగిస్తోంది. తమ గోడును ప్రధాని అస్సలు పట్టించుకోడం లేదని, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో తాము పతకాలు సాధించిన సమయంలో మాత్రం..తమతో ఫోన్లు చేసి మాట్లాడే ప్రధాని..తమను లైంగికంగా వేధించిన వారిపై చర్యలు తీసుకోడానికి వెనుకాడుతున్నారంటూ వస్తాదులు వాపోతున్నారు.
నిరసన దీక్ష చేపట్టిన వస్తాదులకు ప్రతిపక్షపార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్, తృణమూల్, ఆప్, సమాజ్ వాదీతో సహా పలుపార్టీల నాయకులు జంతర్ మంతర్ వద్దకు వచ్చి నిరసనదీక్ష దగ్గర తమ మద్దతు తెలిపి వెళ్లారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై ఓ మర్డర్ కేసుతో సహా మొత్తం 47 ఎఫ్ఐఆర్ లు నమోదై ఉన్నా..బీజెపీ ఎంపీ కావడంతో ప్రభుత్వం కబోదిలా వ్యవహరిస్తోంది.
బ్రిజ్ భూషణ్ తగిన చర్యలు తీసుకోకుంటే తాము సైతం నిరసనకు దిగుతామంటూ ఖాప్ ( కిసాన్ సంయుక్త కమిటీ) సైతం అల్టిమేటం జారీ చేసింది. పతకాలు వెనక్కి ఇచ్చివేస్తాం....
లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేసి..తమకు న్యాయం చేయకుంటే ప్రభుత్వం తమకు ఇచ్చిన పురస్కారాలను, తాము సాధించిన పతకాలను వెనక్కు ఇచ్చివేస్తామని నిరసన దీక్ష చేపట్టిన వస్తాదులు ప్రకటించారు.
అయితే..వస్తాదుల ఒత్తిడితో కుస్తీ సమాఖ్య అధ్యక్షపదవికి దూరంగా ఉంటున్న బ్రిజ్ భూషణ్ మాత్రం..రెచ్చేగొట్టే ప్రకటనలు చేస్తూ తన నైజాన్ని చాటుకొంటున్నారు.
తాము సాధించిన పతకాలను మాత్రమే కాదు..ప్రభుత్వం నుంచి అందుకొన్న కోట్ల రూపాయల నజరానాలను, తమ శిక్షణ కోసం ఖర్చు చేసిన కోట్ల రూపాయలను సైతం వస్తాదులు వెనక్కి ఇవ్వాలంటూ బ్రిజ్ భూషణ్ డిమాండ్ చేశారు.
అయితే..నిరసన చేపట్టిన వస్తాదులు మాత్రం..బ్రిజ్ భూషణ్ ప్రకటనపై మండి పడ్డారు. శిక్షణ కోసం, పతకాల సాధన కోసం తమ కుటుంబసభ్యులు చేసిన త్యాగాలు, తమ విలువైన సమయాన్ని కుస్తీ సమాఖ్య, కేంద్రప్రభుత్వం వెనక్కి తిరిగి ఇవ్వగలవా? అంటూ మండి పడ్డారు.
తప్పు చేసిన వ్యక్తి, మహిళా వస్తాదులపట్ల అనుచితంగా ప్రవర్తించినవారు..రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకొని దర్జాగా తిరుగుతున్నారని, నోటికొచ్చినట్లు వాగుతున్నారని వస్తాదులు ఎదురుదాడికి దిగారు.
జాతీయ మానవహక్కుల సంఘం ఆగ్రహం..
దేశంలోని వివిధ క్రీడాసంఘాలలో..లైంగిక వేధింపుల విచారణకు అంతర్గత వ్యవ్యస్థ, ఏర్పాట్లు లేకపోడం పట్ల జాతీయ మానవహక్కుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నియమావళి ప్రకారం జాతీయ ఒలింపిక్ సంఘానికి అనుబంధంగా ఉన్న క్రీడాసమాఖ్యలు, సంఘాలలో..లైంగిక వేధింపుల పై విచారణకు అంతర్గతంగా ఓ కమిటీ ఉండితీరాలి.
దేశంలోని మొత్తం 30 క్రీడాసమాఖ్యలలో 15 క్రీడాసమాఖ్యలలో అటువంటి వ్యవస్థే లేకపోడం పట్ల జాతీయ మానవహక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
భారత మహిళా వస్తాదులపై జరిగిన లైంగిక వేధింపుల ఫిర్యాదును సువో మోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.