నా రిటైర్మెంట్ కు ఎవరూ కారణం కాదు
537 వికెట్లు తీసినందుకు నేను సంతోషంగా ఉన్న : రవిచంద్రన్ అశ్విన్
తన ఆకస్మిక రిటైర్మెంట్ నిర్ణయానికి ఇంకెవరో కారణం కాదని లెజెండ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. డిజిటల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్రికెట్ కెరియర్, రిటైర్మెంట్ గురించి పలు అంశాలను వెల్లడించారు. గబ్బా వేదికగా మూడో టెస్ట్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడం తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. తనకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఘనమైన వీడ్కోలు దక్కలేదనే అసంతృప్తి ఎంతమాత్రమూ లేదన్నారు. అయితే అలాంటి ఘనమైన వీడ్కోలు అనే కాన్సెప్ట్ నకు తాను ఎంతమాత్రం వ్యతిరేకం కాదన్నారు. తన కోసం ఎవరూ కన్నీటి చుక్క కార్చొద్దని కోరారు. గ్రాండ్ సెండ్ ఆఫ్ అనే అంశంలో తాను ఒకరి వెనుక ఎందుకు పరుగెత్తాలని ప్రశ్నించారు. తన కోసమే మ్యాచ్ నిర్వహించాలన్నది తప్పు అన్నారు. తన క్రికెట్ కెరియర్ గురించి ఎలాంటి బాధ లేదని.. 537 వికెట్లు తీసినందుకు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. తాను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి మాత్రమే తప్పుకున్నానని.. క్రికెట్ గురించి మాట్లాడుతానని, కోచింగ్ ఇవ్వడాన్ని ఇష్టపడుతానని తెలిపారు. తనకు ఎవరిపైనా కోపం కూడా లేదన్నారు.