Telugu Global
Sports

నిఖత్ జరీన్ లక్ష్యం ఒలింపిక్స్ స్వర్ణం!

ప్రపంచ, భారత బాక్సింగ్ లో తెలుగు రాష్ట్ర్రాల బాక్సర్ నిఖత్ జరీన్ హవా ప్రారంభమయ్యింది. ప్రపంచ పోటీలలో వరుసగా రెండో బంగారు పతకం గెలుచుకోడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ స్వర్ణానికి గురి పెట్టింది.

నిఖత్ జరీన్ లక్ష్యం ఒలింపిక్స్ స్వర్ణం!
X

ప్రపంచ, భారత బాక్సింగ్ లో తెలుగు రాష్ట్ర్రాల బాక్సర్ నిఖత్ జరీన్ హవా ప్రారంభమయ్యింది. ప్రపంచ పోటీలలో వరుసగా రెండో బంగారు పతకం గెలుచుకోడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ స్వర్ణానికి గురి పెట్టింది....

తెలుగు రాష్ట్ర్రాలకే గర్వకారణంగా నిలిచిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ప్రపంచ బాక్సింగ్ టైటిల్ ను వరుసగా రెండోసారి గెలుచుకొన్న భారత రెండో మహిళగా నిలిచింది.

మేరీ కోమ్ కే సవాలు విసిరి....

అంతర్జాతీయ బాక్సింగ్ లో భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్న నిఖత్ జరీన్ ప్రపంచ స్థాయికి చేరటానికి ఎన్నో అవమానాలు భరించడమే కాదు..పడరాని కష్టాలు పడింది. భారత దిగ్గజ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ నే సవాలు చేయటం ద్వారా కలకలం రేపింది.

గతంలో వివాదాలకు చిరునామాగా నిలిచిన నిఖత్ జరీన్ గత కొద్దికాలంగా విజయాలకు మరోపేరుగా నిలుస్తూ వస్తోంది. టోక్యో ఒలింపిక్స్ అర్హత కోసం మేరీకోమ్ నే సవాలు చేసిన నిఖత్ జరీన్..ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొంది.

ఆసియా, ప్రపంచ బాక్సంగ్ పోటీలతో పాటు కామన్వెల్త్ గేమ్స్ లో సైతం నిఖత్ సత్తా చాటుకోడం ద్వారా..మేరీ కోమ్ కు తానే తగిన వారసురాలినని చాటుకొంది.

వరుసగా రెండో ప్రపంచ టైటిల్..

25 సంవత్సరాల వయసులోనే ప్రపంచ బాక్సింగ్ లో బంగారు పతకం నెగ్గిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్ 26వ ఏడాది సైతం వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలవడం ద్వారా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ సరసన నిలిచింది.

టర్కీలోని అంటాలియా నగరంలో ముగిసిన 2022 ప్రపంచ మహిళా బాక్సింగ్ 52 కిలోల విభాగం టైటిల్ సమరంలో నిఖత్ జరీన్ 5-0తో థాయ్ లాండ్ బాక్సర్ జిట్ పాంగ్ జుటామాస్ ను చిత్తు చేయడం ద్వారా విశ్వవిజేతగా బంగారు పతకం అందుకొంది. ప్రస్తుత ప్రపంచ టోర్నీలో భారత్ సాధించిన ఒకేఒక బంగారు పతకం నిఖత్ సాధించినదే కావడం విశేషం. 2018 ప్రపంచ బాక్సింగ్ లో మేరీకోమ్ బంగారు పతకం నెగ్గిన తరువాత భారత్ కు మరో ప్రపంచ బాక్సింగ్ స్వర్ణ పతకం అందించిన ఘనతను నిఖత్ జరీన్ సొంతం చేసుకొంది. అంతేకాదు..బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో సైతం నిఖత్ జరీన్ బంగారు పతకం గెలుచుకొంది.

న్యూఢిల్లీ టోర్నీలోనూ అదేజోరు...

అంతటితోనే ఆగిపోకుండా..న్యూఢిల్లీ వేదికగా జరిగిన 2023 మహిళా ప్రపంచ బాక్సింగ్ పోటీలలో సైతం నిఖత్ తన జోరును కొనసాగించింది. గతంలో 52 కిలోల విభాగంలో విశ్వవిజేతగా ఉన్న నిఖత్..ఈసారి మాత్రం 48-50 కిలోల విభాగంలో బంగారు పతకం గెలుచుకొంది.

టైటిల్ సమరంలో వియత్నాంకు చెందిన గుయెన్ తీ టామ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని 3-2 పాయింట్లతో ప్రపంచ చాంపియన్ గా నిలిచింది.

రెండుసార్లు ఆసియా చాంపియన్‌ గుయెన్‌ నుంచి తొలిరౌండ్ నుంచే నిఖత్ కు గట్టి ప్రతిఘటన ఎదురయ్యింది. తనదైన శైలిలో నిఖత్ ఎదురుదాడికి దిగి

రెండు రైట్‌హుక్స్‌కు తోడు స్ట్రెయిట్‌ జాబ్స్‌తో పైచేయి సాధించింది. అయితే రెండో రౌండ్‌లో గుయెన్‌ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. సూపర్‌ పంచ్‌లతో విరుచుకుపడటంతో నిఖత్‌ ఆత్మరక్షణలో పడిపోయింది.. అయితే నిర్ణయాత్మక ఆఖరి రౌండ్‌లో ఇద్దరు బాక్సర్లు దూకుడుగా ఆడారు. చివరకు నిఖత్ ను విజేతగా రింగ్ అంపైర్ ప్రకటించారు.

ఈ విజయంతో వరుసగా రెండుసార్లు ప్రపంచ టైటిల్ సాధించిన భారత రెండో మహిళగా నిఖత్ రికార్డుల్లో చోటు సంపాదించింది.

తెలుగు తొలి మహిళా బాక్సర్ నిఖత్..

ప్రపంచ సీనియర్ బాక్సింగ్ లో స్వర్ణపతకం సాధించిన భారత ఐదవ మహిళగా, తెలుగు రాష్ట్ర్రాల తొలి యువతిగా నిఖత్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ బాక్సింగ్ టోర్నీలలో మేరీకోమ్ మాత్రమే 2002,2005,06, 08, 10, 18) ఆరుసార్లు బంగారు పతకాలు గెలుచుకొంది.

2006 ప్రపంచకప్ లో సరితాదేవి, జెన్నీ ,లేఖ కేసీ బంగారు పతకాలు నెగ్గగా..2022 టోర్నీ ద్వారా నిఖత్ జరీన్ వారి సరసన నిలువగలిగింది.

ఒలింపిక్స్ స్వర్ణానికి నిఖత్ గురి...

ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ టైటిల్స్ తో పాటు ..కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకం సైతం సాధించిన నిఖత్..మరో ఏడాదిలో పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలన్న పట్టుదలతో ఉంది.

పారిస్‌ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని తన వెయిట్‌ క్యాటగీరీని మార్చుకున్న నిఖత్‌ ఆశించిన ఫలితాన్ని సాధించగలిగింది. 2021 అక్టోబర్‌ నుంచి తనకు తిరుగులేదన్న రీతిలో నిఖత్‌ వరుస విజయాలతో తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2021 నుంచి బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ జరీన్‌ అజేయంగా నిలుస్తూ తనకుతానే సాటిగా నిలిచింది. వరుసగా జాతీయ చాంపియన్‌షిప్‌ టైటిళ్లు, ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక టోర్నీలో పసిడి పతకం, బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడి. పతకం ..ఇలా టోర్నీ ఏదైనా నిఖత్‌ మాత్రమే చాంపియన్ గా ఉంటూ వచ్చింది.ఒలింపిక్స్ లో సైతం బంగారు పతకం సాధించగలిగితే ...బాక్సర్ గా నిఖత్ సాధించాల్సింది మరేమీ లేనట్లే అవుతుంది.

రెండుసార్లు ప్రపంచ చాంపియన్ హోదాలో ..మరో ఏడాదిలో పారిస్ వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా నిఖత్ జరీన్..50 కేజీలు లేదా 54 కేజీల విభాగాలలో..ఏదో ఒక తరగతిలో తలపడాల్సి ఉంది.

నిఖత్ పైన కానుకల వర్షం.....

నిరంతరసాధన, పట్టుదల, అంకితభావంతో పోరాడుతుంటే..అవార్డులు, రివార్డులు, కానుకలు, నజరానాలు వాటంతట అవే వస్తాయనటానికి నిఖత్ జరీన్ ను మించిన నిదర్శనం మరొకటి లేదు.

నిజామాబాద్ లోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నిఖత్ జరీన్ 25 సంవత్సరాల వయసుకే కోటీశ్వరురాలిగా మారిపోయింది.

కేంద్ర, రాష్ట్ర్రప్రభుత్వాలు ఇచ్చిన నజరానాలు, ప్రోత్సాహక బహుమతులతో నిఖత్ జరీన్ జీవితమే మారిపోయింది.

2018 నుంచి విశ్వవిఖ్యాత క్రీడాపరికరాల సంస్థ ‘అడిడాస్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నిఖత్ జరీన్ కు రెండు ప్రపంచ బంగారు పతకాలు, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణపతకాలు సాధించినందుకు కేంద్రప్రభుత్వ ప్రోత్సాహంగా 2 కోట్ల రూపాయలకు పైగా ప్రైజ్ మనీ దక్కింది.

తెలంగాణా ప్రభుత్వం నజరానాలు...

మరోవైపు..తెలంగాణా రాష్ట్ర్రానికే అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తున్న నిఖత్ జరీన్ ను ముఖ్యమంత్రి కెసీఆర్ అక్కున చేర్చుకొని పలు రకాలుగా ఆదరిస్తున్నారు. కొద్దిమాసాల క్రితమే నిఖత్ కు 2కోట్ల రూపాయలు నజరానాగా ఇచ్చిన రాష్ట్ర్రప్రభుత్వం..ఇటీవలే..అత్యంత ఖరీదైన జూబ్లీ హిల్స్ లో 600 గజాల ఇంటిస్థలం కేటాయించింది.

త్వరలోనే డీఎస్పీ ఉద్యోగం...

గతంలో నిఖత్ జరీన్ కు ముఖ్యమంత్రి కెసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రెండు కోట్ల నగదు బహుమతి, 600 గజాల ఇంటిస్థలం పత్రాలు అందచేసిన తెలంగాణా ప్రభుత్వం..త్వరలోనే గ్రూపు-1 పోస్ట్‌ అయిన డీఎస్పీ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాన్ని ఇవ్వనుంది.

‘నిఖత్‌ ప్రతిభను గుర్తిస్తూ సీఎం కేసీఆర్‌ తన నివాసానికి పిలిచి మరీ భోజనం పెట్టి ఆదరించడం తాము జీవితాంతం గుర్తుంచుకొంటామని, 2 కోట్ల రూపాయల చెక్కు, 600 గజాల ఇంటిస్థలం పత్రాలు ఇవ్వటం, డీఎస్పీ ఉద్యోగపత్రాలు త్వరలో ఇస్తామనటం తమ అదృష్టమని నిఖత్ తండ్రి పొంగిపోతూ చెప్పారు.

2024 పారిస్ ఒలింపిక్స్ లో నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించగలిగితే అది సరికొత్త చరిత్రే అవుతుంది.

న్యూఢిల్లీ ప్రపంచ బాక్సింగ్ పోటీలలో నిఖత్ తో పాటు మరో ముగ్గురు మహిళా బాక్సర్లు ప్రపంచ టైటిల్స్ సాధించినా..మీడియా మాత్రం నిఖత్ కే అత్యధిక ప్రచారం ఇవ్వటం విశేషం.

ఈ క్రమంలో ప్రత్యర్థులకు కనీసం ఒక బౌట్‌ కూడా చేజార్చుకోకపోవడం గమనార్హం. తన అద్భుత ప్రతిభతో మేరీకోమ్‌కు సవాలు విసిరి తెలంగాణ తెగువ చూపించిన నిఖత్‌.. భారత బాక్సింగ్‌ క్వీన్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నది. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. దీని వెనుక ఆమె కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, వారి త్యాగం, కోచ్‌ల శిక్షణ నిఖత్‌ను ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌గా మలిచాయి.

టార్గెట్‌ పారిస్‌ ఒలింపిక్స్‌

ప్రతిష్ఠాత్మక పారిస్‌(2024) ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా నిఖత్‌ ముందుకెళుతున్నది. తన చిరకాల కలను సాకారం చేసుకునే క్రమంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నది. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52కిలోల విభాగంలో విజేతగా నిలిచిన జరీన్‌ ఈసారి 50 కిలోల కేటగిరీకి మారింది. పారిస్‌ ఒలింపిక్స్‌ వెయిట్‌ కేటగిరీలను దృష్టిలో పెట్టుకుని తన విభాగాన్ని మార్చుకున్న నిఖత్‌ మరింత మెరుగైన ప్రదర్శన కోసం తన శరీర బరువును 3 నుంచి 4 కిలోల వరకు తగ్గించుకోవాల్సి వచ్చింది.

అలుపెరుగకుండా..

ఈసారి మెగాటోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన నిఖత్‌ జరీన్‌ లక్ష్యసాధన కోసం అలుపెరుగకుండా పోరాడింది. బౌట్‌ బౌట్‌కు తన పంచ్‌లో వాడివేడిని చూపిస్తూ ముందంజ వేసింది. సహచర బాక్సర్లకు బై లభించిన చోట నిఖత్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకంగా ఆరు బౌట్లలో తలపడింది. ఇందులో వరుసగా మూడు రోజుల్లో తన కంటే మెరుగైన సీడ్‌లో ఉన్న బాక్సర్లను మట్టికరిపించి మెండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. ఓవైపు ప్రత్యర్థులపై పదునైన పంచ్‌లు విసురుతూ వారు విసిరే పంచ్‌లను కాచుకుంటూ ఒంటిపై గాయాలు బాధిస్తున్నా..పంటిబిగువున భరిస్తూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది.

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక బాక్సింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు కొత్త చరిత్ర లిఖించారు. ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్లకు సవాలు విసురుతూ యువ బాక్సర్లు నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బొర్గోహై పసిడి పతకాలతో మెరిశారు. ఆదివారం జరిగిన వేర్వేరు బౌట్లలో అద్భుత విజయాలు సాధించిన నిఖత్‌, లవ్లీనా తమ సత్తాచాటారు. తొలుత జరిగిన 50కిలోల తుది పోరులో తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ 5-0తో న్యుయెన్‌ తీ తమ్‌(వియత్నాం)పై అద్భుత విజయం సాధించింది. దీని ద్వారా వరుసగా రెండో ఏడాది జరీన్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది.

మరోవైపు గతంలో రెండుసార్లు కాంస్య పతకానికే పరిమితమైన లవ్లీనా బొర్గోహై ఈసారి తన పసిడి కలను సాకారం చేసుకుంది. 5-2 తేడాతో కైట్లిన్‌ పార్కర్‌(ఆస్ట్రేలియా)పై లవ్లీనా విజయం సాధించింది. ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరిగిన మెగాటోర్నీలో భారత్‌ తరఫున నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బొర్గోహై, స్వీటీ బూర, నీతు గంగాస్‌ పసిడి పతకాలు సాధించారు. దీని ద్వారా 2006 తర్వాత భారత్‌ మరోమారు నాలుగు స్వర్ణాలు దక్కించుకుంది. పసిడి పతక విజేతలకు ప్రైజ్‌మనీ కింద ప్రపంచ బాక్సింగ్‌ సమాఖ్య(ఐబీఏ) నుంచి రూ.82 లక్షల నగదు ప్రోత్సాహంతో పాటు ఈసారి కొత్తగా చాంపియన్‌షిప్‌ బెల్ట్‌ అందించారు.

First Published:  28 March 2023 11:22 AM IST
Next Story