Telugu Global
Sports

పూరన్ ఫటాఫట్, భారత్ కు దెబ్బ మీద దెబ్బ!

వెస్టిండీస్ తో టీ-20 సిరీస్ లో భారత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో ఓటమితో 5మ్యాచ్ ల సిరీస్ లో 0-2తో వెనుకబడిపోయింది.

పూరన్ ఫటాఫట్, భారత్ కు దెబ్బ మీద దెబ్బ!
X

వెస్టిండీస్ తో టీ-20 సిరీస్ లో భారత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో ఓటమితో 5మ్యాచ్ ల సిరీస్ లో 0-2తో వెనుకబడిపోయింది.

2023 కరీబియన్ టూర్ టెస్టు, వన్డే సిరీస్ లను విజయాలతో ప్రారంభించి, విజయాలతో ముగించిన భారత్ కు ధూమ్ ధామ్ టీ-20 సిరీస్ లో మాత్రం వైఫల్యాలు తప్పడం లేదు.

పాంచ్ పటాకా టీ-20 సిరీస్ తొలిపోరులో 4 పరుగుల ఓటమి చవిచూసిన టాప్ ర్యాంకర్ భారత్...గయానా ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో 2 వికెట్ల పరాజయం చవిచూసింది. వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సునామీ హాఫ్ సెంచరీ సాధించాడు.

ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికి 0-2తో వెనుకబడిపోయింది. సిరీస్ విజేతగా నిలవాలంటే చివరి మూడుమ్యాచ్ లు నెగ్గితీరాల్సిన పరిస్థితి కొని తెచ్చుకొంది.

భారత్ ను ఆదుకొన్న తిలక్ వర్మ...

టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న భారత టాపార్డర్ ..గయానా ప్రావిడెన్స్ స్టేడియం స్లో వికెట్ పై దారుణంగా విఫలమయ్యింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ధూమ్ ధామ్ బ్యాటర్ సంజు శాంసన్ దారుణంగా విఫలమయ్యారు. హైదరాబాదీ యువబ్యాటర్ తిలక్ వర్మ, కెప్టెన్ హార్థిక్ పాండ్యా బాధ్యతాయుతంగా బ్యాట్ చేయడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు152 పరుగుల స్కోరు సాధించగలిగింది.

తన కెరియర్ లో రెండో అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ మాత్రమే ఆడుతున్న తిలక్ వర్మ తనదైన శైలిలో దూకుడుగా ఆడి తొలి హాఫ్ సెంచరీతో భారత పరువు దక్కించాడు. తిలక్ మొత్తం 41 బంతుల్లో ఓ సిక్సర్, 5 ఫోర్లతో 51 పరుగులు సాధించాడు.

స్ట్ర్రోక్ ప్లేయర్లకు అంతగా అనువులేని స్లో పిచ్ పైన పరుగులు సాధించడానికి మిగిలిన భారత బ్యాటర్లు నానాపాట్లు పడితే...తిలక్ వర్మ మాత్రం స్వేచ్ఛగా షాట్లు కొట్టి కీలక హాఫ్ సెంచరీ నమోదు చేయగలిగాడు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా 24, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 14, యువఆటగాడు రవి బిష్నోయ్ 8 పరుగుల స్కోర్లతో భారత్ 152 పరుగుల స్కోరును అందుకోగలిగింది.

దీనికితోడు కరీబియన్ బౌలర్లు, ఫీల్డర్లు అత్యుత్తమంగా రాణించడం ద్వారా భారత్ ను 152 పరుగుల స్కోరుకే కట్టడి చేయగలిగారు.

మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ రనౌట్ కావడం, ఎడాపెడా షాట్లు బాదే సంజు శాంసన్ స్టంపౌట్ కావటం భారత్ ను దారుణంగా దెబ్బతీసింది.

నికోలస్ పూరన్ టాప్ గేర్...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 153 పరుగులు చేయాల్సిన వెస్టిండీస్ ప్రారంభ ఓవర్లలో తడబడినా..స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ మెరుపు హాఫ్ సెంచరీ, కెప్టెన్ రోవమన్ పావెల్ ఉపయుక్తమైన బ్యాటింగ్ తో 8 వికెట్ల నష్టానికే లక్ష్యాన్ని చేరుకోగలిగింది.

గయానా వేదికగా ఇటీవల ఆడిన వన్డే మ్యాచ్ లో 73 పరుగులు, టీ-20 మ్యాచ్ లో 74 నాటౌట్ స్కోర్లు సాధించిన నికోలస్ పూరన్..భారత్ తో పోరులో సైతం స్థాయికితగ్గట్టుగా రాణించాడు. బౌండ్రీలు, సిక్సర్ షాట్లతో భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. పూరన్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీ ( 67) తో చెలరేగిపోయాడు.

కెప్టెన్ పావెల్ 21, హెట్ మేయర్ 22 పరుగులతో తమవంతు పాత్ర నిర్వర్తించారు. కరీబియన్ జట్టు 19.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులతో వరుసగా రెండో విజయంతో సిరీస్ లో 2-0తో పైచేయి సాధించింది. భారత బౌలర్లలో కెప్టెన్ పాండ్యా 3, చహాల్ 2, అర్షదీప్ , ముకేశ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.

వెస్టిండీస్ విజయంలో ప్రధానపాత్ర వహించిన కరీబియన్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సిరీస్ కే కీలకమైన మూడో టీ-20 పోరు గయానా వేదికగానే ఆగస్టు 8న జరుగనుంది.

First Published:  7 Aug 2023 6:20 AM GMT
Next Story