Telugu Global
Sports

ఒక్కబంతి..ఒక్క ఓవర్..21 పరుగుల పరాజయం!

న్యూజిలాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ లో టాప్ ర్యాంకర్, ఆతిథ్య భారత్ కు ప్రారంభమ్యాచ్ లోనే గట్టిదెబ్బతగిలింది. డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ అర్షదీప్ చేసిన తప్పుకు భారత్ 21 పరుగుల ఓటమితో మూల్యం చెల్లించింది.

ఒక్కబంతి..ఒక్క ఓవర్..21 పరుగుల పరాజయం!
X

న్యూజిలాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ లో టాప్ ర్యాంకర్, ఆతిథ్య భారత్ కు ప్రారంభమ్యాచ్ లోనే గట్టిదెబ్బతగిలింది. డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ అర్షదీప్ చేసిన తప్పుకు భారత్ 21 పరుగుల ఓటమితో మూల్యం చెల్లించింది....

ఒక్క ఐడియా జీవితాన్ని ఎంతవరకూ మార్చుతుందో తెలియదు కానీ..క్రికెట్లో..ప్రధానంగా ధూమ్ ధామ్ ఫార్మాట్లో ఒక్కబంతే ఓటమికి కారణమవుతుందని, ఒక్కబంతే కొంపముంచుతుందని మరోసారి రుజువయ్యింది.

మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భాగంగా రాంచీలోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి పోరులో భారత్ 21 పరుగుల పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

టాస్ నెగ్గి ఓటమి కొనితెచ్చుకొన్న భారత్...

హార్థిక్ పాండ్యా నాయకత్వంలో ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన భారత్..రాంచీ టీ-20 మ్యాచ్ లో కీలక్ టాస్ నెగ్గినా ఓటమి తప్పలేదు. టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న భారత్ ..పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన న్యూజిలాండ్ ను నియంత్రించడంలో దారుణంగా విఫలమయ్యింది.

డాషింగ్ ఓపెనర్ డేవన్ కాన్వే, టాపార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలు సాధించడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

కాన్వే 35 బాల్స్ లో 52 పరుగులు, మిచెల్ 30 బంతుల్లో 59 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడం ద్వారా తమజట్టుకు మ్యాచ్ విన్నింగ్స్ స్కోరు అందించారు.

20వ ఓవర్లో 27 పరుగులు...

న్యూజిలాండ్ విజయానికి, భారత్ పరాజయానికి ఒక్కబంతి, ఒక్క ఓవర్, కారణమయ్యాయి. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అత్యంత పొదుపుగా బౌల్ చేసిన భారత డెత్ ఓవర్ బౌలింగ్ స్పెషలిస్ట్ అర్షదీప్ సింగ్..ఆట 20వ ఓవర్లో చేసిన పొరపాటు..భారత పాలిట గ్రహపాటుగా మారింది.

ఆఖరి ఓవర్ ప్రారంభంలోనే నోబాల్ వేయటం ద్వారా అర్షదీప్ సింగ్ పెద్దపొరపాటే చేశాడు. దానికి 27 పరుగుల భారీమూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అర్షదీప్ ఓవర్ లో మిచెల్ 3 సిక్సర్లు, ఓ బౌండ్రీ బాదటంతో న్యూజిలాండ్ 27 పరుగులు దండుకోగలిగింది. 160 పరుగులకు పరిమితం కావాల్సిన కివీజట్టు 176 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది.

న్యూజిలాండ్ స్పిన్నర్ల షో...

మ్యాచ్ నెగ్గాలంటే 177 పరుగుల భారీస్కోరు చేయాల్సిన భారత్..పవర్ ప్లే ఓవర్లు పూర్తి కాకుండానే టాపార్డర్లో మూడు కీలక వికెట్లు నష్టపోయి ఎదురీతమొదలు పెట్టింది.

కివీ స్పిన్నర్ల త్రయం సాంట్నర్, బ్రేస్ వెల్, సోథీ ముప్పేటదాడికి భారత టాపార్డర్ ఉక్కిరిబిక్కిరయ్యింది.

భారత ఓపెనర్లు ఇషాన్ కిషన్ 4, శుభ్ మన్ గిల్ 7, రాహుల్ త్రిపాఠీ 0 స్కోర్లకే అవుట్ కావడంతో భారత్ మరి కోలుకోలేకపోయింది.కెప్టెన్ హార్థిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ వికెట్ కు కీలక భాగస్వామ్యం నమోదు చేసినా వెంట వెంటనే వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. లోయర్ మిడిలార్డర్లో వాషింగ్టన్ సుందర్ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించినా ప్రయోజనం లేకపోయింది. మిస్టర్ టీ-20 సూర్యకుమార్ 47 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

కివీ కెప్టెన్ సాంట్నర్ తన కోటా 4 ఓవర్లలో 11 పరుగులకు 2 వికెట్లు, ఆఫ్ స్పిన్నర్ బ్రేస్ వెల్ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 2 వికెట్లు, టఫీ, ఇష్ , లాకీ ,సోథీ తలో వికెట్ పడగొట్టారు.

దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ మొదటి 10 ఓవర్లలో 3 వికెట్లకు 74 పరుగులు చేసిన భారత్..ఆఖరి 10 ఓవర్లలో 81 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. సిరీస్ లోని రెండో టీ-20 మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది.

First Published:  28 Jan 2023 4:09 PM IST
Next Story