Telugu Global
Sports

బీసీసీఐకి సరికొత్త సెలెక్షన్ కమిటీ!

బీసీసీఐకి సరికొత్త సెలెక్షన్ కమిటీ!
X

గత కొంతకాలంగా పూర్తిస్థాయి సెలెక్షన్ కమిటీ లేక సతమతవుతున్న బీసీసీఐ కొత్త సంవత్సరంలో ఆలోటును పూడ్చుకొంది. చేతన్ శర్మ చైర్మన్ గా ఐదుగురు సభ్యుల కమిటీని ప్రకటించింది....

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ ఎట్టకేలకు పూర్తిస్థాయి సెలెక్షన్ కమిటీని నియమించుకోగలిగింది. గత కొద్దిమాసాలుగా పూర్తిస్థాయి సెలెక్షన్ కమిటీ లేక సతమతమవుతూ వచ్చిన బోర్డు.. కొత్తసంవత్సరం మొదటివారంలోనే ఆలోటును పూడ్చుకోగలిగింది.

చీఫ్ సెలెక్టర్ గా మరోసారి చేతన్ శర్మ...

భారత సరికొత్త సెలెక్షన్ కమిటీ ఏర్పాటు కోసం అర్హులైన వారి నుంచి బీసీసీఐ దరఖాస్తుల్ని ఆహ్వానించింది. మొత్తం 600కు పైగా దరఖాస్తుల నుంచి తుదిజాబితాను

బోర్డు సలహామండలి రూపొందించింది. సులక్షణ్ నాయక్, అశోక్ మల్హోత్రా,జతన్ పరంజపేలు సభ్యులుగా ఉన్న భారత క్రికెట్ సలహామండలి భారీస్థాయిలో కసరత్తులు చేసింది.

నిబంధనలు, అర్హతలకు అనుగుణంగా తయారు చేసిన తుదిజాబితాలోని మాజీలకు ఇంటర్వ్యూలు నిర్వహించింది.

దేశంలోని వివిధ జోన్లకు చెందిన అజయ్‌ రాత్రా, అమయ్‌ ఖుర్సియా, ఎస్‌ శరత్‌ తదితర మాజీ ఆటగాళ్ళను సెలెక్టర్ల పోస్టుల కోసం, చీఫ్ సెలెక్టర్ పదవి కోసం చేతన్‌ శర్మ, హర్విందర్‌ సింగ్‌లను సైతం ఇంటర్వ్యూలు చేసింది.

సెలక్షన్‌ కమిటీకి పోటీపడుతున్న అభ్యర్థుల్లో ఈస్ట్‌జోన్‌కు చెందిన మాజీ భారత ఓపెనర్‌ ఎస్‌ఎస్‌దాస్‌ సైతం ఉన్నారు. సౌత్‌ జోన్‌ నుంచి సునీల్‌ జోషి స్థానంలో తమిళనాడు మాజీ బ్యాట్స్‌మెన్ శరత్ హాజరయ్యాడు.

ఇక ఈస్ట్‌జోన్‌ నుంచి దేబాశిష్‌ మొహంతి స్థానంలో దాస్‌ దరఖాస్తు చేసుకొన్నాడు. దేబాశిష్, శరత్ కలిసి భారత్, ఒడిశా తరఫున క్రికెట్‌ ఆడారు.

వెస్ట్ జోన్ నుంచి సలీల్ అంకోలా...

ఐదుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీలో వెస్ట్ జోన్ నుంచి మాజీ ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోలాకు చోటు దక్కింది. సౌత్ జోన్ నుంచి శరత్, ఈస్ట్ జోన్ నుంచి శివసుందర్ దాస్, మాజీ ఫాస్ట్ బౌలర్ సుబ్రతో బెనర్జీ ఎంపికయ్యారు.

నార్త్ జోన్ కు చేతన్ శర్మ, హర్విందర్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సరికొత్త ఎంపిక సంఘం వచ్చే రెండేళ్లపాటు అంతర్జాతీయ సిరీస్ లు, ఐసీసీ టోర్నీలలో పాల్గొనే భారత సీనియర్ జట్లను ఎంపిక చేయనుంది.

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన అనుభవం లేకున్నా శరత్ సెలెక్టర్ గా ఎంపిక కావడం విశేషం. 2016 వరకూ సెంట్రన్ జోన్ నుంచి సెలెక్టర్ గా పనిచేసిన రాజిందర్ సింగ్ హాన్స్ కు సైతం భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించిన రికార్డు లేదు.

సెలెక్టర్లకు ఏడాదికి 50 లక్షల రూపాయల నుంచి 80 లక్షల రూపాయల వరకూ బోర్డు వేతనంగా చెల్లిస్తూ వస్తోంది. జోన్ల వారీగా జరిగే మ్యాచ్ లకు హాజరు కావడం, ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించడం, భారతజట్టు అవసరాలకు తగ్గట్టుగా జట్లను ఎంపిక చేయడం సెలెక్షన్ కమిటీ విధి.

First Published:  8 Jan 2023 4:05 PM IST
Next Story