Telugu Global
Sports

జైలు నుంచి ప్రపంచకప్ జట్టులోకి నేపాలీ క్రికెటర్!

నేపాలీ యువ క్రికెటర్ సందీప్ లాంచానే చరిత్ర సృష్టించాడు. జైలు శిక్ష అనుభవిస్తూ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే నేపాల్ జట్టులో చోటు సంపాదించాడు.

జైలు నుంచి ప్రపంచకప్ జట్టులోకి నేపాలీ క్రికెటర్!
X

నేపాలీ యువ క్రికెటర్ సందీప్ లాంచానే చరిత్ర సృష్టించాడు. జైలు శిక్ష అనుభవిస్తూ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే నేపాల్ జట్టులో చోటు సంపాదించాడు.

వివిధ నేరాల ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటూ, జైలు శిక్ష అనుభవిస్తూ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి గురించి అందరికీ తెలుసు. అయితే..అతిచిన్న వయసులోనే అత్యాచారం ఆరోపణలో దోషిగా తేలి..8 సంవత్సరాల కారాగారశిక్ష అనుభవిస్తున్న నేపాలీ క్రికెటర్, 23 సంవత్సరాల సందీప్ లాంచానే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల నేపాల్ జట్టులో చోటు సంపాదించడం ద్వారా చరిత్ర సృష్టించాడు.

రేప్ కేసులో శిక్షతో జైలుపాలు...

నేపాల్ క్రికెట్లో సంచలన ఆటగాడిగా సందీప్ లాంచానేకి పేరుంది. లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ గా నేపాల్ క్రికెట్ కు వెన్నెముక లాంటి సందీప్ 22 సంవత్సరాల వయసులోనే..ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో జరిగే టీ-20 క్రికెట్ లీగ్ ల్లో పాల్గొంటూ..రెండు చేతులా ఆర్జిస్తున్న సమయంలో సందీప్ పై అత్యాచారం కేసు నమోదయ్యింది.

2021 మే నెలలో తిల్ గంగాలోని ఓ హోటెల్ లో తనకంటే వయసులో ఎనిమిదేళ్లు పెద్దదైన ఓ యువతిపై సందీప్ అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదు కావడం, విచారణలో దోషిగా తేలడం జరిగిపోయాయి.

ఖాట్మండూ జిల్లా కోర్టు నిర్వహించిన విచారణలో సందీప్ పై ఆరోపణ నిజమని తేలడంతో ఎనిమిదేళ్ల జైలు శిక్షతో పాటు..బాధితురాలికి 5 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు.

2022సెప్టెంబర్లో కేసు నమోదు ...

గతంలో ఐపీఎల్, ఆ తరువాత బిగ్ బాష్ లీగ్, కరీబియన్ లీగ్ టోర్నీలలో పాల్గొంటూ వస్తున్న సందీప్ ను స్వదేశానికి రప్పించి మరీ నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

18 సంవత్సరాల వయసులో పాల్పడిన ఈ నేరానికి బాలనేరస్తుడి చట్టం కింద బయట పడటానికి సందీప్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కొద్దివారాలపాటు జైలుశిక్ష అనుభవించిన అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిలు ఇవ్వడంతో తిరిగి తన క్రికెట్ కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చాడు. నేపాల్ తరపున అంతర్జాతీయక్రికెట్ మ్యాచ్ ల్లో పాల్గొంటూ వచ్చాడు.

బాధితురాలికి పరిహారం..

మరోవైపు ..సందీప్ పై విచారణను నేపాల్ కోర్టు 2023 డిసెంబర్ 29న పూర్తి చేసి..అత్యాచారం కేసులో దోషిగా తేల్చి చెప్పింది. అయితే శిక్షను 2024 జనవరి 10 వరకూ రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

సందీప్ ఓ యువతి పై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావడంతో 8 సంవత్సరాల కారాగారవాసం, 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు, బాధితురాలికి 2 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలంటూ ఖాట్మండూ జిల్లా కోర్టు న్యాయమూర్తి శిశీర్ రాజ్ ధకాల్ తీర్పు చెప్పారు.

గత రెండేళ్లుగా కొనసాగిన ఈ కేసు విచారణ ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పు పుణ్యమా అంటూ 2023 సీజన్ వరకూ విదేశీ క్రికెట్ లీగ్ ల్లో సందీప్ పాల్గొనగలిగాడు.

ఆ తరువాత కొద్దివారాలపాటు... సుందర సెంట్రల్ జైలులో గడిపి వచ్చిన సందీప్ లాంచానే తన 8 సంవత్సరాల కారాగారవాసం శిక్షను ఖాట్మండూ జైలులో అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

సందీప్ కు ఖాట్మండూ జిల్లా కోర్టు శిక్ష విధించడంతో..నేపాల్ క్రికెట్ సంఘం సైతం నిషేధం విధించడంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది. 20 కోట్ల నేపాలీ రూపాయల పూచీకత్తుపై బెయిలు తీసుకొని మరీ సందీప్ తన క్రికెట్ సాధన కొనసాగించాడు.

హైకోర్టు విచారణతో కేసు నుంచి విముక్తి..

ఆ తరువాత తనకు విధించిన శిక్ష, విచారణపై తగిన న్యాయం చేయాలంటూ పటాన్ హైకోర్టును సందీప్ ఆశ్రయించాడు. హైకోర్టులో సందీప్ ను నిర్ధోషిగా తేల్చుతూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కేసు నుంచి విముక్తి కల్పించారు. దీంతో నేపాల్ తరపున ప్రపంచకప్ లో పాల్గొనే అరుదైన అవకాశం సందీప్ కు దక్కింది.

అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జూన్ 2 నుంచి నెలరోజులపాటు జరుగనున్న 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 20 జట్లలో ఒకజట్టుగా నేపాల్ నిలవడంతో...నేపాల్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును మే నెల 2వ తేదీనే ప్రకటించింది. అయితే..సందీప్ కేసులో హైకోర్టు తన తీర్పును మే 15న వెలువరించడంతో..ప్రపంచకప్ జట్టులో చేర్చుకోవాలని నిర్ణయించారు.

వంద వికెట్ల మొనగాడు సందీప్...

సందీప్ లాంచానేకు నేపాల్ తరపున 51 వన్డేలు ఆడి 112 వికెట్లు, 52 టీ-20 మ్యాచ్ ల్లో 98 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. నేపాలీ క్రికెట్ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన సందీప్ 2018 నుంచి 2020 సీజన్ల వరకూ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ లో 9 మ్యాచ్ లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.

లెగ్ బ్రేక్- గుగ్లీ బంతులతో నేపాల్ జట్టుకు గతంలో ఎన్నో కీలక విజయాలు అందించిన సందీప్ తొలిసారిగా టీ-20 ప్రపంచకప్ లో పాల్గొంటూ..రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సత్తా చాటుకోడానికి ఎదురుచూస్తున్నాడు.

First Published:  17 May 2024 1:30 PM GMT
Next Story