Telugu Global
Sports

ఆసియాక్రీడల క్రికెట్లో నేపాల్ ప్రపంచ రికార్డుల మోత!

19వ ఆసియాక్రీడల క్రికెట్ పురుషుల ప్రారంభమ్యాచ్ లోనే పసికూన నేపాల్ ప్రపంచ రికార్డుల మోత మోగించింది. నేపాల్ దెబ్బతో ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లోకి మూడు సరికొత్త రికార్డులు వచ్చి చేరాయి.

ఆసియాక్రీడల క్రికెట్లో నేపాల్ ప్రపంచ రికార్డుల మోత!
X

ఆసియాక్రీడల క్రికెట్లో నేపాల్ ప్రపంచ రికార్డుల మోత!

19వ ఆసియాక్రీడల క్రికెట్ పురుషుల ప్రారంభమ్యాచ్ లోనే పసికూన నేపాల్ ప్రపంచ రికార్డుల మోత మోగించింది. నేపాల్ దెబ్బతో ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లోకి మూడు సరికొత్త రికార్డులు వచ్చి చేరాయి.

ఆసియాక్రీడల్లో తొమ్మిదిసంవత్సరాల విరామం తర్వాత ప్రవేశపెట్టిన క్రికెట్లో రికార్డులు వెల్లువెత్తాయి. పురుషుల గ్రూప్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో మంగోలియాపై నేపాల్ రికార్డుల వెల్లువెత్తించింది.

క్రికెట్ నేపథ్యం కానీ, క్రికెట్ తో ఏమాత్రం పరిచయం కానీ లేని మంగోలియా ను పసికూన నేపాలీజట్టు ఊచకోత కోసింది. హాంగ్జులోని పింగ్ ఫెంగ్ కాంపస్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా జరిగిన లీగ్ తొలిపోరులో నేపాల్ మూడు ప్రపంచ రికార్డులు నమోదు చేసింది.

34 బంతుల్లోనే మల్లా సెంచరీ....

టీ-20 ఫార్మాట్లో ఇప్పటి వరకూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరుతో ఉంటూ వచ్చిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నేపాల్ ఆటగాడు, 19 సంవత్సరాల కుశాల్ మల్లా తెరమరుగు చేశాడు.

వన్ డౌన్లో బ్యాటింగ్ కు దిగిన కుశాల్ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 50 బంతులు ఎదుర్కొని 137 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. 2017లో శ్రీలంకపై ఇండోర్ వేదికగా రోహిత్ శర్మ సాధించిన 35 బంతుల శతకం, 2017లోనే బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సాధించిన 35 బంతుల శతకాలను 34 బంతుల సెంచరీతో మల్లా తిరగరాశాడు. మల్లా మెరుపు శతకంలో 12 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి.

9 బంతుల్లోనే దీపేంద్ర సింగ్ హాఫ్ సెంచరీ..

అంతేకాదు..5వ నంబర్ బ్యాటర్ గా క్రీజులోకి దిగిన దీపేందర్ సింగ్ అయిరీ సైతం తనపేరుతో ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అతితక్కువ బంతులో టీ-20 హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్ గా నిలిచాడు.

దీపేందర్ కేవలం 9 బంతుల్లోనే 50 పరుగులు సాధించడం విశేషం. 16 ఏళ్ల క్రితం యువరాజ్ సింగ్ నెలకొల్పిన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ ప్రపంచ రికార్డును దీపేంద్ర అధిగమించాడు. దీపేందర్ 8 సిక్సర్ల షాట్లతో హాఫ్ సెంచరీ సాధించాడు.

అంతేకాదు..టీ-20 ఫార్మాట్లో 300కు పైగా స్కోరు సాధించిన తొలిజట్టుగా నేపాల్ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగోలియాపై 20 ఓవర్లలో 4 వికెట్లకు 314పరుగులు నమోదు చేసింది.

2019లో ఐర్లాండ్ ప్రత్యర్థిగా అప్ఘనిస్థాన్ సాధించిన 3 వికెట్లకు 278 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరును నేపాల్ తెరమరుగు చేయగలిగింది. టీ-20 ఫార్మాట్లో 300కు పైగా పరుగుల తేడాతో నెగ్గిన తొలిజట్టుగానూ నేపాల్ మరో ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

First Published:  28 Sept 2023 8:30 AM IST
Next Story