Telugu Global
Sports

రికార్డులు కాదు, పతకాలే ముఖ్యం-నీరజ్ చోప్రా!

భారత గోల్డెన్ స్టార్ నీరజ్ చోప్రా జీవితలక్ష్యం నెరవేరింది. ఎట్టకేలకు ప్రపంచ టైటిల్ చిక్కింది. 2023 ప్రపంచ అథ్లెటిక్స్ లో బంగారు పతకం దక్కింది.

నీరజ్ చోప్రా
X

నీరజ్ చోప్రా

భారత గోల్డెన్ స్టార్ నీరజ్ చోప్రా జీవితలక్ష్యం నెరవేరింది. ఎట్టకేలకు ప్రపంచ టైటిల్ చిక్కింది. 2023 ప్రపంచ అథ్లెటిక్స్ లో బంగారు పతకం దక్కింది.

అంతర్జాతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల జావలిన్ త్రో లో భారత 'బంగారు కొండ' నీరజ్ చోప్రా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఆసియా, కామన్వెల్త్ గేమ్స్, ఒలంపిక్స్ బంగారు పతకాలు సాధించిన నీరజ్ రెండో ప్రయత్నంలో ప్రపంచ పోటీల స్వర్ణ పతకాన్ని సైతం చేజిక్కించుకోగలిగాడు.

నీరజ్ సరికొత్త చరిత్ర!

హంగెరీ రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరిగిన 2023 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పురుషుల జావలిన్ త్రోలో హాట్ ఫేవరెట్, బల్లెం విసురుడులో 'భారత బాహుబలి' నీరజ్ చోప్రా అలవోకగా బంగారు పతకంతో విశ్వవిజేతగా నిలిచాడు.

క్వాలిఫైయింగ్ రౌండ్లో 88.77 మీటర్ల రికార్డుతో ఫైనల్స్ కు అర్హత సంపాదించిన నీరజ్..గోల్డ్ మెడల్ పోరులో 88.17 మీటర్ల రికార్డుతోనే స్వర్ణపతకం సాధించడం విశేషం.

మొత్తం 12మంది అత్యుత్తమ అథ్లెట్ల నడుమ జరిగిన ఈ మెడల్ రౌండ్ సమరంలో నీరజ్ తన ప్రయత్నంలో ఫౌల్ చేసినా..ఆ తర్వాతి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని బంగారు పతకం సాధించడానికి అవసరమైన రికార్డు సాధించగలిగాడు.

పాకిస్థాన్ కు చెందిన అర్షద్ నదీమ్ 87.82 మీటర్ల రికార్డుతో రజత, చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకబ్ వాడ్లిచ్ 86. 67 మీటర్ల రికార్డుతో కాంస్య పతకాలు దక్కించుకొన్నారు.

ఫైనల్స్ కు అర్హత సాధించిన మరో ఇద్దరు భారత జావలిన్ త్రోయర్లు మొదటి ఆరుస్థానాలలో నిలవడం విశేషం.


25 ఏళ్లకే ప్రపంచ, ఒలింపిక్స్ స్వర్ణాలు..

నీరజ్ చోప్రా కేవలం 25 సంవత్సరాల వయసుకే ప్రపంచ, ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకాలతో పాటు...గోల్డెన్ మీట్ గోల్డ్ మెడల్ విజేతగా నిలవడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

భారత క్రీడాచరిత్రలో వ్యక్తిగత విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన రెండో అథ్లెట్ గా నీరజ్ చోప్రా రికార్డుల్లో చేరాడు.షూటర్ అభినవ్ భింద్రా తొలి అథ్లెట్ కాగా..నీరజ్ చోప్రా ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు. అయితే...అథ్లెటిక్స్ లో ప్రపంచ బంగారు పతకం సాధించిన తొలి, ఏకైక క్రీడాకారుడు నీరజ్ చోప్రా మాత్రమే.

2016 నుంచి 2023 వరకూ...

2016లో దక్షిణాసియా క్రీడల బంగారు పతకంతో బోణీ కొట్టిన నీరజ్ చోప్రా ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. 2017లో ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ స్వర్ణపతకాన్ని, 2018లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, 2020 లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం, 2022లో ప్రపంచ పోటీల రజతం, డైమండ్ లీగ్ బంగారు పతకం సాధించిన

నీరజ్..2023 ప్రపంచ మీట్ స్వర్ణ పతకాన్ని సైతం అందుకోగలిగాడు. అతిచిన్న వయసులోనే జావలిన్ త్రోలో ఉన్న అంతర్జాతీయ టైటిల్స్, బంగారు పతకాలు అన్నీ సాధించిన నీరజ్..రానున్న పోటీలలో 90 మీటర్ల లక్ష్యం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

రికార్డుల కన్నా..పతకాలే మిన్న!

90 మీటర్ల ప్రపంచ రికార్డు తనకు ప్రధానం కాదని, దేశానికి సాధ్యమైనన్ని బంగారు పతకాలు అందించటమే ముఖ్యమని..విశ్వవిజేతగా నిలిచిన అనంతరం నీరజ్ చెప్పాడు.

ఈ ప్రపంచ మీట్ లో భారత్, పాకిస్థాన్ మొదటి రెండుస్థానాలలో నిలవడం తనకు సంతోషం కలిగించింది, రజత పతకం సాధించిన పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ కు అభినందనలు చెబుతున్నట్లు నీరజ్ తెలిపాడు.

పాక్ అథ్లెట్, ప్రపంచ మీట్ రన్నరప్ నదీమ్ సైతం ..నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. వచ్చేనెలలో జరిగే ఆసియాక్రీడల్లో సైతం మొదటి రెండుస్థానాలలో భారత్, పాకిస్థాన్ మాత్రమే నిలవాలని తాను కోరుకొంటున్నట్లు తెలిపాడు.

ప్రస్తుత 2023 ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లో భారత్ సాధించిన ఏకక పతకం నీరజ్ చోప్రా అందించిన బంగారు పతకం మాత్రమే. పురుషుల 400 మీటర్ల రిలే ఫైనల్స్ చేరిన భారతజట్టు 5వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

First Published:  28 Aug 2023 2:00 PM IST
Next Story