Telugu Global
Sports

బల్లెం విసురుడులో బాహుబలి నీరజ్ చోప్రా!

జావలిన్ త్రోలో భారత సంచలనం నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనతను సాధించాడు. డైమండ్ లీగ్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

బల్లెం విసురుడులో బాహుబలి నీరజ్ చోప్రా!
X

బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రా...ప్రపంచ స్థాయి ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ జావలిన్ త్రోలో భారత్‌కు రజత పతకం అందించిన నీరజ్ గాయంతో కామన్వెల్త్ గేమ్స్ కు దూరమయ్యాడు. అయితే ..గాయం నుంచి పూర్తిగా కోలుకొని లుసానే వేదికగా ముగిసిన డైమండ్ లీగ్ తొలి అంచె బరిలో నిలిచాడు. తొలి ప్రయత్నంలోనే 89.08 మీటర్ల రికార్డుతో బంగారు పతకం ఖాయం చేసుకున్నాడు. తన కెరియర్‌లో మూడో అత్యుత్తమ త్రో రికార్డును నీరజ్ సాధించాడు. ప్రత్యర్థుల్లో ఏ ఒక్కరూ నీరజ్ రికార్డుకు చేరువగా రాలేకపోయడం విశేషం.

చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకోబ్ వాడ్లిచ్ 85.88 మీటర్ల‌తో రజత, అమెరికన్ అథ్లెట్ కుర్టిస్ థాంప్సన్ కాంస్య పతకాలకు పరిమితమయ్యారు. తొలి రౌండ్లోనే జావలిన్‌ను 89.08 మీటర్ల దూరం విసిరిన నీరజ్...రెండో రౌండ్లో 85.18 మీటర్లకు పరిమితమయ్యాడు. మూడో రౌండ్‌లో ఎలాంటి ప్రయత్నమూ చేయని నీరజ్..నాలుగో రౌండ్ లో ఫౌల్ త్రో చేశాడు. తన ఆఖరి రౌండ్ త్రోలో నీరజ్ 80.04 మీటర్ల దూరం మాత్రమే త్రో చేయగలిగాడు. స్టాక్ హోమ్ వేదికగా ముగిసిన డైమండ్ లీగ్ తొలి అంచెలో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా.. లుసానేలో జరిగిన రెండో అంచెలో ఏకంగా అగ్రస్థానంలో నిలవడం ద్వారా ఫైనల్ రౌండ్‌కు అర్హత సంపాదించాడు.

గత ఏడాది కాలంలో భారత జాతీయ రికార్డును నీరజ్ చోప్రా మూడు సార్లు తిరగరాస్తూ వచ్చాడు. టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..ప్రస్తుతం ప్రపంచ జావెలిన్ త్రో ఇద్దరు అత్యుత్తమ క్రీడాకారులలో ఒకడిగా నిలిచాడు.

First Published:  27 Aug 2022 11:05 AM IST
Next Story