Telugu Global
Sports

ప్రపంచ నంబర్ వన్ నీరజ్ చోప్రా!

బల్లెం విసురుడులో బాహుబలి, భారత సూపర్ అథ్లెట్ నీరజ్ చోప్రా తన దేశానికి మరో అరుదైన గౌరవం సాధించి పెట్టాడు.

Neeraj Chopra makes history, becomes World No 1 in men
X

ప్రపంచ నంబర్ వన్ నీరజ్ చోప్రా!

బల్లెం విసురుడులో బాహుబలి, భారత సూపర్ అథ్లెట్ నీరజ్ చోప్రా తన దేశానికి మరో అరుదైన గౌరవం సాధించి పెట్టాడు. జావలిన్ త్రోలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సైతం కైవసం చేసుకొన్నాడు....

ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 25 సంవత్సరాల వయసుకే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకొన్నాడు. ఇప్పటికే ఒలింపిక్స్ లో బంగారు పతకం, ప్రపంచ పోటీలలో రజతపతకం సాధించిన నీరజ్..ప్రపంచ ర్యాంకింగ్స్ లో సైతం అగ్రస్థానానికి చేరుకోగలిగాడు.

అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 1455 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ కు చేరాడు. ప్రపంచ చాంపియన్, బహమాస్ స్టార్ అథ్లెట్ యాండర్సన్ పీటర్స్ 1433 పాయింట్లతో రెండు, చెక్ అథ్లెట్, ఒలింపిక్స్ రజత విజేత జాకబ్ వాడ్లెచ్ 1416 పాయింట్లతో మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

10 మాసాలలో టాప్ ర్యాంక్.....

గతేడాది ఆగస్టు 30 నాటికి ప్రపంచ రెండోర్యాంక్ కు చేరుకొన్ననీరజ్ కేవలం 10 మాసాల కాలంలోనే టాప్ ర్యాంక్ ను అందుకోగలిగాడు. జ్యూరిచ్ వేదికగా గతేడాది జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ బంగారు పతకం సాధించడం ద్వారా విలువైన ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించాడు.

దోహా వేదికగా జరిగిన 2023 సీజన్ డైమండ్ లీగ్ తొలి అంచె పోటీలో స్వర్ణపతకం సాధించడం ద్వారా నీరజ్ తన ప్రత్యర్థులపై భారీగా పాయింట్ల ఆధిక్యం సంపాదించగలిగాడు.

నెదర్లాండ్స్ వేదికగా జూన్ 4న జరిగే ఎఫ్ బీకే గేమ్స్ , ఫిన్లాండ్ వేదికగా జూన్ 13న జరిగే పావో నుర్మీ గేమ్స్ లోనూ నీరజ్ చోప్రా పాల్గొనాల్సి ఉంది.

అంటాల్యా కేంద్రంగా సాధన...

నీరజ్ చోప్రా ప్రస్తుతం టర్కీలోని అంటాలియాను కేంద్రంగా చేసుకొని తన శిక్షణ కొనసాగిస్తున్నాడు. 90 మీటర్ల లక్ష్యంగా తాను ప్రాక్టీసు కొనసాగిస్తున్నట్లు ప్రకటించాడు.

గత రెండేళ్లుగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ లో నిలకడగా రాణిస్తున్న నీరజ్ బల్లెంని స్విట్జర్లాండ్ లోని ఒలింపిక్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచారు.

2021 లో టోక్యో వేదికగా ముగిసిన ఒలింపిక్స్ లో స్వర్ణ పతకంతో సరికొత్త చరిత్రకు తెరతీసిన నీరజ్ చోప్రా..అమెరికా వేదికగా గతేడాది ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ లో రజత పతకం, స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ప్రపంచ మీట్ లో బంగారు పతకాలు సాధించడం ద్వారా భారత్ ఖ్యాతిని ఎవరెస్టు ఎత్తుకు చేర్చాడు.

టోక్యో ఒలింపిక్స్ లో 87.58 మీటర్ల రికార్డుతో బంగారు పతకం సాధించిన నీరజ్..తనకు స్వర్ణ పతకం అందించిన జావలిన్ ను లాసానేలోని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం మ్యూజియానికి కానుకగా ఇచ్చాడు.

రెండో భారత అథ్లెట్ నీరజ్....

120 సంవత్సరాల ఒలింపిక్ చరిత్రకు దర్పణం పట్టే ఒలింపిక్ మ్యూజియంలో చోటు దక్కిన భారత రెండో అథ్లెట్ ఘనతను నీరజ్ చోప్రా సొంతం చేసుకొన్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్ లో బంగారు పతకం సాధించిన అభినవ్ భింద్రా పిస్టల్ ను సైతం ఒలింపిక్ మ్యూజియంలో ఉంచారు. ఒలింపిక్ మ్యూజియంలో చోటు సంపాదించిన తొలి భారత అథ్లెట్ అభినవ్ కాగా...రెండో అథ్లెట్ గా నీరజ్ చోప్రా నిలిచాడు.

గత 12 దశాబ్దాలుగా జరుగుతున్న ఒలింపిక్స్ లో వివిధ దేశాలకు చెందిన విఖ్యాత అథ్లెట్లు సాధించిన పతకాలు, ఉపయోగించిన క్రీడాపరికరాలు, దుస్తులు, ఒలింపిక్స్ నిర్వహణకు వాడిన పలురకాల వస్తువులను ఒలింపిక్ మ్యూజియంలో భద్రపరచడమే కాదు...పరిరక్షిస్తూ వస్తున్నారు.

ఒలింపిక్ చరిత్రను, వైభవాన్ని, పరంపరను భావితరాలకు అందించడమే ఏకైక లక్ష్యంగా స్విట్జర్లాండ్ నగరం లాసానేలో ఏర్పాటు చేశారు. కిలోమీటరున్న దూరం విస్తరించిన మ్యూజియం-1లో 6 లక్షల 50వేల అరుదైన ఫోటోలు, చిత్రపటాలు, 90వేల జ్ఞాపికలు, కళాఖండాలు, 45వేల గంటల నిడివికల పలు అరుదైన వీడియోలను భద్రపరిచారు.

ఇదో గొప్ప గౌరవం-నీరజ్

ప్రపంచ అథ్లెటిక్స్ జావలిన్ త్రో విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించడం తనకు గర్వకారణమని నీరజ్ ప్రకటించాడు. ఇక ముందు జరిగే అంతర్జాతీయ పోటీలలో తనకు గట్టి పోటీ ఉంటుందని తెలుసని, దానికి తగ్గట్టుగానే శిక్షణ కొనసాగిస్తున్నట్లు ప్రకటించాడు.

టోక్యో ఒలింపిక్స్ లో తాను బంగారు పతకం సాధించడానికి ఉపయోగించిన బల్లెం (జావలిన్ )ను ఒలింపిక్ మ్యూజియంలో భద్రపరచడం తనకు గొప్పగౌరవమని కూడా తెలిపాడు.

గతంలో తాను ఒలింపిక్ మ్యూజియం సందర్శించినప్పుడు అభినవ్ భింద్రా ఉయోగించిన గోల్డెన్ పిస్టల్ ను చూసి స్ఫూర్తిపొందానని, అభినవ్ పిస్టల్ సరసన తన బల్లెం చేరడం తనకు గర్వకారణమని..మ్యూజియం సిబ్బందికి తన జావెలిన్ ను కానుక ఇస్తూ..నీరజ్ చోప్రా చెప్పాడు.

120 సంవత్సరాల ఒలింపిక్స్ చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఒలింపిక్స్ మ్యూజియంలో ఇద్దరంటే ఇద్దరు భారత అథ్లెట్లు వాడిన క్రీడాపరికరాలను మాత్రమే భద్రపరిచారు. అందులో రెండో భారత అథ్లెట్ గా నీరజ్ చోప్రా నిలిచాడు.

వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ లో సైతం బంగారు పతకం సాధించడంతో పాటు..ప్రపంచ చాంపియన్ గా నిలవాలన్న పట్టుదలతో నీరజ్ తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.

First Published:  23 May 2023 12:28 PM IST
Next Story