Telugu Global
Sports

ఒలింపిక్ మ్యూజియంలో నీరజ్ బల్లెం!

టోక్యో ఒలింపిక్స్ లో తాను బంగారు పతకం సాధించడానికి ఉపయోగించిన బల్లెం (జావలిన్ )ను ఒలింపిక్ మ్యూజియంలో భద్రపరచడం తనకు గొప్పగౌరవమని నీరజ్ చోప్రా మురిసిపోతున్నాడు.

ఒలింపిక్ మ్యూజియంలో నీరజ్ బల్లెం!
X

భారత సూపర్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. స్విట్జర్లాండ్ లోని ఒలింపిక్ మ్యూజియంలో నీరజ్ బంగారు బల్లెన్నీప్రదర్శనకు ఉంచనున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ పురుషుల జావలిన్ త్రోలో భారత సంచలనం నీరజ్ చోప్రా సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తూ , అరుదైన రికార్డులతో అసాధారణ గౌరవాన్ని అందుకొంటున్నాడు. గత ఏడాది టోక్యో వేదికగా ముగిసిన ఒలింపిక్స్ లో స్వర్ణ పతకంతో సరికొత్త చరిత్రకు తెరతీసిన నీరజ్ చోప్రా.. అమెరికా వేదికగా ఇటీవలే ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ లో రజత పతకం, స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ప్రపంచ మీట్ లో బంగారు పతకాలు సాధించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచాడు.

ఒలింపిక్ మ్యూజియానికి కానుకగా..

టోక్యో ఒలింపిక్స్ లో 87.58 మీటర్ల రికార్డుతో బంగారు పతకం సాధించిన నీరజ్..తనకు స్వర్ణ పతకం అందించిన జావలిన్ ను లాసానేలోని అంతర్జాతీయ ఒలింపిక్ మ్యూజియానికి కానుకగా ఇచ్చాడు.


రెండో భారత అథ్లెట్ నీరజ్..

120 సంవత్సరాల ఒలింపిక్ చరిత్రకు దర్పణం పట్టే ఒలింపిక్ మ్యూజియంలో చోటు దక్కిన భారత రెండో అథ్లెట్ ఘనతను నీరజ్ చోప్రా సొంతం చేసుకొన్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్ లో బంగారు పతకం సాధించిన అభినవ్ బింద్రా పిస్టల్ ను సైతం ఒలింపిక్ మ్యూజియంలో ఉంచారు. ఒలింపిక్ మ్యూజియంలో చోటు సంపాదించిన తొలి భారత అథ్లెట్ అభినవ్ కాగా...రెండో అథ్లెట్ గా నీరజ్ చోప్రా నిలిచాడు. గత 12 దశాబ్దాలుగా జరుగుతున్న ఒలింపిక్స్ లో వివిధ దేశాలకు చెందిన విఖ్యాత అథ్లెట్లు సాధించిన పతకాలు, ఉపయోగించిన క్రీడాపరికరాలు, దుస్తులు, ఒలింపిక్స్ నిర్వహణకు వాడిన పలురకాల వస్తువులను ఒలింపిక్ మ్యూజియంలో భద్రపరచడమే కాదు...పరిరక్షిస్తూ వస్తున్నారు. ఒలింపిక్ చరిత్రను, వైభవాన్ని, పరంపరను భావితరాలకు అందించడమే ఏకైక లక్ష్యంగా స్విట్జర్లాండ్ నగరం లాసానేలో ఏర్పాటు చేశారు. కిలోమీటరున్న దూరం విస్తరించిన మ్యూజియం-1లో 6 లక్షల 50వేల అరుదైన ఫొటోలు, చిత్రపటాలు, 90వేల జ్ఞాపికలు, కళాఖండాలు, 45వేల గంటల నిడివికల పలు అరుదైన వీడియోలను భద్రపరిచారు.

ఇదో గొప్ప గౌరవం-నీరజ్

టోక్యో ఒలింపిక్స్ లో తాను బంగారు పతకం సాధించడానికి ఉపయోగించిన బల్లెం (జావలిన్ )ను ఒలింపిక్ మ్యూజియంలో భద్రపరచడం తనకు గొప్పగౌరవమని నీరజ్ చోప్రా మురిసిపోతున్నాడు. గతంలో తాను ఒలింపిక్ మ్యూజియం సందర్శించినప్పుడు అభినవ్ బింద్రా ఉప‌యోగించిన గోల్డెన్ పిస్టల్ ను చూసి స్ఫూర్తిపొందానని, అభినవ్ పిస్టల్ సరసన తన బల్లెం చేరడం తనకు గర్వకారణమని..మ్యూజియం సిబ్బందికి తన జావెలిన్ ను కానుక ఇస్తూ.. నీరజ్ చోప్రా చెప్పాడు. మరోవైపు.. ఇంతకాలమూ ఒలింపిక్ మ్యూజియంలో తన పిస్టల్ ఒంటరితనాన్ని అనుభవిస్తూ వచ్చిందని...అయితే తన పిస్టల్ కు తోడుగా నీరజ్ చోప్రా బల్లెం రావడం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని అభినవ్ బింద్రా చమత్కరించాడు. 120 సంవత్సరాల ఒలింపిక్స్ చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఒలింపిక్స్ మ్యూజియంలో ఇద్దరంటే ఇద్దరు భారత అథ్లెట్లకు చోటు దక్కడం అరుదైన గౌరవమే మరి.

First Published:  28 Aug 2022 4:25 AM GMT
Next Story