Telugu Global
Sports

నీరజ్- మను బాకర్ 'బ్రాండ్ బాజా'!

పారిస్ ఒలింపిక్స్ లో భారత పతకవిజేతల జోడీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది.

నీరజ్- మను బాకర్ బ్రాండ్ బాజా!
X

పారిస్ ఒలింపిక్స్ లో భారత పతకవిజేతల జోడీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది. ప్రముఖ క్రికెట్ స్టార్లకే రెండు ఒలింపిక్స్ పతకాల విజేత సవాలు విసురుతున్నాడు.

క్రికెట్ పిచ్చితో ఊగిపోయే భారత్ లో బ్రాండ్లు, ఎండార్స్ మెంట్లన్నీ విరాట్ కొహ్లీ, హార్థిక్ పాండ్యా, రోహిత్ శర్మలకు మాత్రమే సొంతమనుకొనే రోజులు పోయాయి.

అథ్లెట్లు, షూటర్లు సైతం బహుళజాతి వ్యాపారసంస్థల ప్రచారకర్తలుగా తమ బ్రాండ్ విలువను సృష్టించుకోగలరని హర్యానా జోడీ, పారిస్ ఒలింపిక్స్ పతక విజేతలు నీరజ్ చోప్రా, మను బాకర్ చాటి చెప్పారు.

పారిస్ పతకాలతో అమాంతం పెరిగిన బ్రాండ్ వాల్యూ....

పారిస్ వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన 2024 ఒలింపిక్స్ పురుషుల జావలిన్ త్రోలో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా, మహిళల పిస్టల్ షూటింగ్ లో రెండు కాంస్యాలు సాధించిన మను బాకర్ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది.

2020 టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ, 2024 పారిస్ ఒలింపిక్స్ లో రజత పతకాలు నెగ్గిన నీరజ్ చోప్రా బ్రాండ్ విలువ 246 కోట్ల రూపాయల నుంచి 330 కోట్ల రూపాయలకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

బ్రాండ్ మార్కెట్ లో బల్లెంవీరుడు నీరజ్ చోప్రా ప్రస్తుత విలువ 40 మిలియన్ డాలర్లు ( 330 కోట్ల రూపాయలకు ) పెరిగింది. నీరజ్ చోప్రాకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉండటం, 2021 నుంచి జరుగుతున్న పలు అంతర్జాతీయ టోర్నీలలో నిలకడగా రాణిస్తూ మొదటి రెండుస్థానాలలో నిలవడం, ఇప్పటికే రెండు ఒలింపిక్స్ పతకాలు, ఓ ప్రపంచ టైటిల్ సాధించడం 26 సంవత్సరాల నీరజ్ బ్రాండ్ కు అదనపు విలువను చేకూర్చినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

140 కోట్ల జనాభా కలిగిన భారత్ లో అత్యంత జనాదరణ పొందుతున్న క్రీడాకారుడిగా నీరజ్ చోప్రాకు గుర్తింపు ఉందని, నీరజ్ ను దేశంలోనే ప్రతిఒక్కరూ గర్తు పట్టగలరని భావిస్తున్నారు.

యాడ్ కు కోటీ 50 లక్షల మను బాకర్...

పారిస్ ఒలింపిక్స్ మహిళల 10 మీటర్ల ఏర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్సిడ్ టీమ్ విభాగాలలో కాంస్య పతకాలు నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించిన 22 ఏళ్ల మను బాకర్ బ్రాండ్ విలువ ఒక్కసారిగా చుక్కలనంటింది.

థమ్స్ అప్ బ్రాండ్ కు ప్రచారకర్తగా మనుబాకర్ కోటీ 50 లక్షల రూపాయల కాంట్రాక్టు కుదుర్చుకొంది.

25 లక్షల నుంచి కోటికి చేరిన వినేశ్ బ్రాండ్ విలువ..

పారిస్ ఒలింపిక్స్ మహిళల కుస్తీ 50 కిలోల విభాగం ఫైనల్స్ చేరినా..100 గ్రాముల అదనపు బరువుతో అనర్హతకు గురైన వినేశ్ పోగట్ బ్రాండ్ విలువ సైతం అనూహ్యంగా పెరిగింది.

ఒలింపిక్స్ లో పతకం సాధించలేకపోయినా తన వీరోచిత పోరాటంతో దేశంలోని కోట్లాదిమంది హృదయాలను వినేశ్ కొల్లగొట్టింది. వినేశ్ కు జరిగిన అన్యాయం తమకే జరిగినట్లుగా దేశవాసులు, క్రీడాభిమానులు తల్లడిల్లిపోయారు.

ఇప్పటి వరకూ ఒక్కో బ్రాండ్ ప్రచారానికి 25లక్షల రూపాయలు ఫీజుగా వసాలు చేసిన వినేశ్ బ్రాండ్ విలువ కోటిరూపాయలకు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు.

పారిస్ ఒలింపిక్స్ పతకాల వేటకు 117 మంది అథ్లెట్ల బృందంతో 16 రకాల క్రీడల బరిలో నిలిచిన భారత్ కేవలం 6 పతకాలతో పతకాల పట్టిక 71వ స్థానంలో నిలిచింది.

భారత అథ్లెట్లలో మను బాకర్ 2 కాంస్య పతకాలు, నీరజ్ చోప్రా రజతం సాధించడం ద్వారా భారత పరువు దక్కించారు. వినేశ్ పోగట్ ను బంగారు పతకం పోరుకు అనుమతించి ఉంటే కనీసం రజత పతకంతో స్వదేశానికి తిరిగి వచ్చేది.

కేవలం ఈ ముగ్గురు క్రీడాకారులు మాత్రమే పారిస్ ఒలింపిక్స్ లో కనబరచిన ప్రతిభప్రాతిపదికన తమ బ్రాండ్ విలువను అనూహ్యంగా ఎన్నో రెట్లు పెంచుకోడం సంచలనంగా మారింది.

First Published:  24 Aug 2024 5:01 AM GMT
Next Story