Telugu Global
Sports

నేడే నాగపూర్ టీ-20..భారత్‌కు డూ ఆర్ డై!

ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో చావో బతుకో సమరానికి ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్ సిద్ధమైంది. నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ కీలక పోరు ప్రారంభంకానుంది.

నేడే నాగపూర్ టీ-20..భారత్‌కు డూ ఆర్ డై!
X

టీ-20 ప్రపంచకప్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రపంచ నంబర్ వన్ టీమ్ భారత్‌లో టెన్షన్ పెరిగిపోతోంది. పదునైన బ్యాటింగ్, పసలేని బౌలింగ్‌తో ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రపంచకప్‌కు సన్నాహాకంగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్‌లోని కీలక సమరంలో ఆతిథ్య భారత్ అమీతుమీకి సిద్ధమైంది. సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఆరునూరైనా భారత్ ఈ మ్యాచ్‌లో నెగ్గితీరాల్సి ఉంది.

రెండు మార్పులతో భారత్...

మొహాలీ వేదికగ ముగిసిన తొలి టీ-20 సమరంలో 208 పరుగుల భారీస్కోరు సాధించినా 4 వికెట్ల పరాజయంతో కంగుతిన్న భారత్ రెండు మార్పులతో రెండో పోరుకు సిద్ధంకానుంది. ప్రారంభ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ ల స్థానంలో యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా, ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌లను తుది జట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

బ్యాటింగ్ జోరు...బౌలింగ్ బేజారు...

రోహిత్, రాహుల్, విరాట్, సూర్య, పాండ్యా లతో బ్యాటింగ్‌లో జోరుమీదున్న భారత్...బౌలింగ్‌లో మాత్రం పదును తగ్గి బేజారెత్తిపోతోంది. మొహాలీ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు తమ కోటా 12 ఓవర్లలో 150 పరుగులివ్వడాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్రంగా పరిగణించింది. పైగా తురుపుముక్కలాంటి లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ సైతం స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ చేయలేకపోడంతో..ప్రస్తుత ఈ మ్యాచ్ లో పక్కన పెట్టాలని నిర్ణయించింది. గాయంతో గత కొద్దివారాలుగా జట్టుకు దూరంగా ఉండి..పూర్తి ఫిట్ నెస్‌తో తిరిగి అందుబాటులోకి వచ్చిన జస్ ప్రీత్ బుమ్రా రీ-ఎంట్రీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొహాలీ మ్యాచ్ లో 11 పరుగులు సాధించిన రోహిత్, 2 పరుగులు మాత్రమే చేసిన విరాట్ ...నాగపూర్ మ్యాచ్ లో భారీ స్కోర్లు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు.

సిరీస్ వైపు కంగారూల చూపు..

హైస్కోరింగ్ వార్‌లో సాగిన తొలిపోరులో 209 పరుగుల భారీలక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల నష్టానికే అలవోకగా చేదించిన ఆస్ట్రేలియా వరుసగా రెండో మ్యాచ్ లో సైతం నెగ్గడం ద్వారా సిరీస్ ను 2-0తో ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సమతూకంతో ఉన్న కంగారూ జట్టులో అరడజను మంది ఆల్ రౌండర్లు ఉండడం ఆ జట్టుకు అదనపు బలంగా మారింది.

టాసే మరోసారి కీలకం..

నాగపూర్ టీ-20లో సైతం టాస్ కీలకం కానుంది. మొహాలీతో పోల్చుకొంటే..నాగపూర్ పిచ్ బ్యాటర్లకు మాత్రమే కాదు..బౌలర్లకు సైతం అనుకూలించే అవకాశం ఉంది. రెండోసారి బౌలింగ్‌కు దిగే జట్టు పైన మంచు ప్రభావం పడే అవకాశం ఉండడంతో టాస్ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. 180కి పైగా స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. ఆసియాకప్ సూపర్-4 రౌండ్‌లో పాక్, శ్రీలంక జట్ల చేతిలో పరాజయాలు పొందిన భారత్..ప్రస్తుత సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనూ కంగుతినడంతో..ప్రస్తుత నాగపూర్ టీ-20 నెగ్గితీరాల్సిన మ్యాచ్ గా మారింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కంగారూలకు చెలగాటం...ఆతిథ్య భారత్ కు సిరీస్ సంకటంగా మారింది. కెప్టెన్ రోహిత్, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌లకు ఈమ్యాచ్ అసలు సిసలు పరీక్షేకానుంది.

First Published:  23 Sept 2022 11:33 AM IST
Next Story