Telugu Global
Sports

యూఎస్ ఓపెన్ నాలుగోరౌండ్లోనే నడాల్ ఢమాల్!

గ్రాండ్ స్లామ్ కింగ్, స్పానిష్ బుల్ కు అమెరికన్ ఓపెన్ నాలుగోరౌండ్లోనే చుక్కెదురయ్యింది.

యూఎస్ ఓపెన్ నాలుగోరౌండ్లోనే నడాల్ ఢమాల్!
X

గ్రాండ్ స్లామ్ కింగ్, స్పానిష్ బుల్ కు అమెరికన్ ఓపెన్ నాలుగోరౌండ్లోనే చుక్కెదురయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ డేనిల్లీ మెద్వదేవ్ పరాజయం పొందిన కొద్ది గంటల్లోనే నడాల్ సైతం ఇంటిదారి పట్టాడు.

2022 గ్రాండ్ స్లామ్ సీజన్ ఆఖరిటోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో సంచలనాల పరంపర కొనసాగుతూనే ఉంది. టైటిల్ ఫేవరెట్లు ఒకరి తర్వాత ఒకరుగా అనూహ్య పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్ర్రమిస్తున్నారు.

డిఫెండింగ్ చాంపియన్ డేనిల్ మెద్వదేవ్ పై నాలుగోరౌండ్లో నికీ కిర్గిసో సంచలన విజయం సాధించిన తరువాత జరిగిన మరో నాలుగోరౌండ్ పోరులో..గ్రాండ్ స్లామ్ కింగ్రా ఫెల్ నడాల్ కు సైతం పరాజయం ఎదురయ్యింది.

నాలుగుసెట్ల పోరులో చిత్తు...

ఇప్పటికే తన కెరియర్ లో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో రికార్డు నెలకొల్పిన స్పానిష్ బుల్ 23వ టైటిల్ ఆశలు అమెరికన్ ఓపెన్ ఓటమితో గల్లంతయ్యాయి. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్ టియాఫోయే తో జరిగిన నాలుగోరౌండ్ పోరులో నడాల్ 4-6, 6-4, 4-6, 3-6తో ఓటమి పొందాడు.

3 గంటల 34 నిముషాలపాటు సాగిన పోరులో 24 సంవత్సరాల ఫ్రాన్సెస్ 18 ఏస్ లు సంధించడంతో పాటు 49 విన్నర్లతో వీరవిహారం చేశాడు.

క్వార్టర్ ఫైనల్ పోరులో రష్యా ఆటగాడు, 9వ సీడ్ యాండ్రీ రుబెలేవ్ తో ఫ్రాన్సెస్ తలపడనున్నాడు.

ఈ విజయం ఓ కలలా ఉంది...

గ్రాండ్ స్లామ్ కింగ్ రాఫెల్ నడాల్ పై సాధించిన ఈ విజయం తనకు ఓ కలలా ఉందంటూ విజేత ఫ్రాన్సెస్ పొంగిపోతున్నాడు. ఇంత గొప్పగా ఎలా ఆడానో, ఓ గొప్ప ఆటగాడిపై

గొప్ప విజయం ఎలా సాధించినో తనకు అంతుబట్టడం లేదన్ని విజయానంతరం ఫ్రాన్సెస్ చెప్పుకొచ్చాడు.

సియెరా లియోన్ నుంచి అమెరికాకు వలస వచ్చిన ఓ కుటుంబానికి చెందిన ఫ్రాన్సెస్ గత ఏడుసార్లుగా అమెరికన్ ఓపెన్ లో పాల్గొంటూ వచ్చినా...నాలుగోరౌండ్ దాటడం ఇదే మొదటిసారి.

మరోవైపు..నడాల్ మాత్రం తాను చెత్తగా ఆడానని..అందుకే ఓడానంటూ ముక్తసరిగా సమాధానం చెప్పాడు.

ఈ ఓటమితో 36 సంవత్సరాల నడాల్ 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటకు తెరపడినట్లయ్యింది.

జోకోవిచ్ , ఫెదరర్, నడాల్, మెద్వదేవ్, జ్వెరేవ్ లాంటి మేటి ఆటగాళ్లు రేస్ లో లేకపోడంతో 2022 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో ఓ కొత్త చాంపియన్ తెరమీదకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

చెక్కు చెదరని ఫెదరర్ 17 ఏళ్ళ రికార్డు...

అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ గత రెండుదశాబ్దాల కాలంలో వరుసగా రెండుసార్లు టైటిల్ నెగ్గిన మొనగాడు స్విస్ గ్రేట్ రోజర్ ఫెదరర్ మాత్రమే. 2004లో తొలిసారిగా యూఎస్ టైటిల్ నెగ్గిన ఫెదరర్ ఆ తర్వాత 2005, 2006, 2007, 2008 సీజన్లలో టైటిల్ నిలుపుకొంటూ వచ్చాడు. 2009 తర్వాత నుంచి ఏడాదికి ఓ కొత్త చాంపియన్ వెలుగులోకి రావడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రస్తుత టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో నిలిచిన డేనిల్ మెద్వదేవ్ నాలుగోరౌండ్లోనే ఇంటిదారి పట్టడంతో ఫెదరర్ పేరుతో ఉన్న రికార్డు చెక్కుచెదరకుండా మిగిలిపోయింది.

First Published:  6 Sept 2022 8:30 AM IST
Next Story