Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ తొలివిజేత ముంబై ఇండియన్స్!

ప్రారంభ మహిళా ఐపీఎల్ ట్రోఫీని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకొంది. టైటిల్ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను 7 వికెట్లతో చిత్తు చేసింది...

మహిళా ఐపీఎల్ తొలివిజేత ముంబై ఇండియన్స్!
X

ప్రారంభ మహిళా ఐపీఎల్ ట్రోఫీని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకొంది. టైటిల్ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను 7 వికెట్లతో చిత్తు చేసింది...

ఐపీఎల్ కు చిరునామాగా నిలిచిన ముంబై ఫ్రాంచైజీ మహిళల విభాగంలోనూ సత్తా చాటుకొంది. బీసీసీఐ మహిళల కోసం తొలిసారిగా నిర్వహించిన 2023 ఐపీఎల్ టైటిల్ ను హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ గెలుచుకొంది.

ఏకపక్షంగా టైటిల్ సమరం...

హోరాహోరీగా సాగుతుందనుకొన్న టైటిల్ సమరం ఏకపక్షంగా ముగిసింది. హైస్కోరింగ్ మ్యాచ్ కోసం..బౌండ్రీలైన్ నిడివిని 55 మీటర్ల నుంచి 50 మీటర్లకు కుదించినా ప్రయోజనం లేకపోయింది.

గత మూడువారాలుగా ముంబైలోని రెండు వేదికల్లో నిర్వహించిన ఐదుజట్ల ఈ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ సమరంలో అత్యంత నిలకడగా రాణించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఆధిపత్యం చాటుకోగలిగింది.

బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన టైటిల్ పోరులో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఢిల్లీ 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా ముంబై మరో 3 బంతులు మిగిలిఉండగానే 7 వికెట్లతో విజయలక్ష్యాన్ని చేరుకోగలిగింది.

ముంబై స్పిన్ ఆల్ రౌండర్ హేలీ మాథ్యూస్, పేసర్ ఇసాబెల్లా వాంగ్ బౌలింగ్ లోనూ, స్కీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్ బ్యాటింగ్ లోనూ రాణించడంతో ముంబై విజేతగా నిలువగలిగింది.

లానింగ్ టాప్ స్కోరర్...

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్‌ లానింగ్‌ 5 బౌండ్రీలతో 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇన్నింగ్స్ చివరి భాగంలో టెయిల్ ఎండర్ల జోడీ కీలక భాగస్వామ్యం నమోదు చేయడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. శిఖ పాండే (17 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), రాధ యాదవ్‌ (12 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.

ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్‌ నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్లు వేసి ఐదు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. ఇస్సీ వాంగ్‌ 3, అమెలియా కెర్‌ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.

అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. స్కీవర్‌ బ్రంట్‌ (55 బంతుల్లో 60 నాటౌట్‌; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో రాణించగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 5 బౌండ్రీలతో 37 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడింది.

విజేతగా నిలిచిన ముంబైజట్టుకు ట్రోఫీతో పాటు 6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ 3 కోట్ల రూపాయల నజరానాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ హేలీ మాథ్యూస్..

ముంబై స్పిన్ ఆల్ రౌండర్ హేలీ మాథ్యూస్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది. అత్యధికంగా 16 వికెట్లు పడగొట్టిన హేలీకి పర్పుల్ క్యాప్ తో పాటు 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ సొంతమయ్యింది.

అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ అందుకొంది. లానింగ్ మొత్తం 345 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.

బీసీసీఐ టీ-20 వ్యాపారవిస్తరణలో భాగంగా మహిళల కోసం తొలిసారిగా నిర్వహించిన ఐపీఎల్ ను అభిమానులకు చేరువ చేయటానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి.

మ్యాచ్ కు 5వేల మంది మాత్రమే హాజరైన మహిళా ఐపీఎల్ ను ఉచితమంటూ ఊదరగొట్టినా టీవీ రేటింగ్స్ సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. పురుషుల ఐపీఎల్ తో పోల్చితే..మహిళల ఐపీఎల్ అంత ఆకర్షణీయం కాదని తొలిసీజన్ లోనే తేలిపోయింది.

First Published:  27 March 2023 10:56 AM IST
Next Story