మహిళా ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్లో ముంబై ఇండియన్స్!
ప్రారంభ మహిళా ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టుగా హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ నిలిచింది. ఐదుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా ఐదోవిజయంతో లీగ్ టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది.
ప్రారంభ మహిళా ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టుగా హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ నిలిచింది. ఐదుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా ఐదోవిజయంతో లీగ్ టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది.....
2023 మహిళా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఐదుజట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఐదు రౌండ్లలో ఐదుకు ఐదు విజయాలు సాధించడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టుగా నిలిచింది.
ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఐదోరౌండ్ పోరులో ముంబై 55 పరుగులతో గుజరాత్ జెయింట్స్ ను చిత్తు చేసి..వరుసగా ఐదో గెలుపుతో 10 పాయింట్లు సాధించిన తొలిజట్టుగా రికార్డుల్లో చేరింది.
ముంబై టాప్ గేర్....
ఈ రౌండ్ రాబిన్ లీగ్ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగుల స్కోరు సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కేవలం 30 బంతుల్లోనే 51 పరుగులతో తన ఖాతాలో మరో హాఫ్ సెంచరీని చేర్చుకొంది.
ముంబై విధ్వంసక ఓపెనర్ హీలీ మాథ్యూస్ ఖాతా తెరవకుండానే డకౌట్ గా వెనుదిరిగింది. మరో ఓపెనర్ యస్తికతో కలసి వన్ డౌన్ బ్రంట్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. ఈ జోడీ ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులెత్తించారు. రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం బ్రంట్ ఔట్ కాగా.. కాసేపటికే యస్తిక రనౌట్ గా వెనుదిరిగింది. ఈ దశలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో కట్టడి చేయడంతో పరుగుల రాక కష్టమైంది.
14 ఓవర్లు ముగిసేసరికి ముంబై 101/3తో నిలిచింది. ఇక భారీ స్కోరు చేయడం కష్టమే అనుకుంటున్న తరుణంలో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. గార్డ్‌నర్, సదర్‌లాండ్ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదిన హర్మన్ చివరి ఓవర్‌లో ఔటయ్యేంత వరకు అదే దూకుడు కొనసాగించింది. సదర్‌లాండ్ వేసిన 19వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన హర్మన్.. ఆఖరి ఓవర్‌లో బౌండ్రీతో 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది.
హర్మన్ ప్రీత్ ధూమ్ ధామ్ బ్యాటింగ్..
హర్మన్ అర్థశతకంలో 7 బౌండ్రీలు, 2 సిక్సర్లున్నాయి. మరో బ్యాటర్ యస్తిక భాటియా ( 5 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 44 పరుగులు, స్కీవర్ బ్రంట్ (36; 5 ఫోర్లు, ఒక సిక్సర్) సత్తాచాటారు. గుజరాత్ బౌలర్లలో స్పిన్నర్ ఆష్లే గార్డ్‌నర్ 3 వికెట్లు సాధించింది.
అనంతరం 163 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ స్నేహ్ రాణా (20), హర్లీన్ డియోల్ (22), సుష్మ వర్మ (18 నాటౌట్), సబ్బినేని మేఘన (16) పరుగులు సాధించినా ప్రయోజనం లేకపోయింది.
ముంబై బౌలర్లు కీలక సమయాలలో వరుసగా వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను తేరుకోనివ్వకుండా చేశారు.
బ్రంట్, మాథ్యూస్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. హర్మన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా ఈరోజు జరిగే పోరులో యూపీ వారియర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
గత ఐదురౌండ్ల మ్యాచ్ ల్లోనూ బెంగళూరు వరుస పరాజయాలతో లీగ్ టేబుల్ అట్టడుగున కొట్టిమిట్టాడుతోంది.