Telugu Global
Sports

ధోనీ మోకాలి శస్త్రచికిత్స విజయవంతం!

భారత మాజీ కెప్టెన్, ఐపీఎల్ ఎవర్ గ్రీన్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది.

MS Dhoni Knee Surgery: ధోనీ మోకాలి శస్త్రచికిత్స విజయవంతం!
X

ధోనీ మోకాలి శస్త్రచికిత్స విజయవంతం!

భారత మాజీ కెప్టెన్, ఐపీఎల్ ఎవర్ గ్రీన్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది. కాలిగాయంతోనే తనజట్టును ఐదోసారి ఐపీఎల్ విజేతగా నిలిపిన ఘనతను ధోనీ కొద్దిరోజుల క్రితమే సాధించాడు.....

భారత క్రికెట్ కు, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అసమాన విజయాలు అందించిన కూల్ కూల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎడమ మోకాలి శస్త్రచికిత్స విజయవంత మైనట్లు ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

2008 నుంచి ఐపీఎల్ లో చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తూ వస్తున్న ధోనీ..రికార్డు స్థాయిలో తన జట్టును ఐదోసారి విజేతగా నిలిపాడు. 42 సంవత్సరాల వయసులో ఎడమమోకాలి గాయంతోనే ధోనీ ఐపీఎల్ 16వ సీజన్ లో పాల్గొన్నాడు.

కాలిగాయంతోనే 17 మ్యాచ్ లు...

ఎడమమోకాలి గాయంతోనే ధోనీ ఐపీఎల్ -16వ సీజన్ లోని మొత్తం 17 మ్యాచ్ ల్లో పాల్గొన్నాడు. లీగ్ దశలో 14 మ్యాచ్ లతో పాటు..క్వాలిఫైయర్స్-1, ఫైనల్స్ మ్యాచ్ ల్లో తన జట్టుకు సంచలన విజయాలు అందించాడు.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముగిసిన హోరాహోరీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల విజయంతో ఐదోసారి విజేతగా నిలిచింది.

ఐపీఎల్ ట్రోఫీని చెన్నై ఐదోసారి గెలుచుకోడంలో ధోనీ ..వికెట్ కీపర్ గా, కెప్టెన్ గా తనవంతు పాత్ర నిర్వర్తించాడు. ఫైనల్లో గుజరాత్ ఓపెనర్, సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్ ను వెంట్రుక వాసిలో స్టంపౌట్ చేయడం ద్వారా ధోనీ మ్యాజిక్ చేశాడు.

ఎడమ మోకాలి నరం దెబ్బతినడంతో ధోనీ బ్యాండేజ్ వేసుకొని, ఫిజియో సలహాలు , సూచనలూ పాటిస్తూ ఆడుతూ వచ్చాడు. బ్యాటింగ్ లో స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమైనా..కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా మాత్రం నూటికి నూరుశాతం రాణించాడు.

ముంబై ఆస్పత్రిలోనే ఆపరేషన్...

ఐపీఎల్ రిటైర్మెంట్ ఊహాగానాలను పటాపంచలుచేసిన ధోనీ..అభిమానుల కోసం మరో ఏడాది తన కెరియర్ ను కొనసాగించనున్నట్లు ప్రకటించిన కొద్దిరోజుల వ్యవధిలోనే మోకాలి శస్త్రచికిత్స చేయించుకొన్నాడు.

ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి చెందిన విఖ్యాత ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్ షా పర్దీవాలాకు..క్రీడాకారుల గాయాలు, ఎముకల శస్త్ర్రచికిత్సలు నిర్వహించడంలో ఎంతో పేరుంది.

కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కు సైతం పలుమార్లు డాక్టర్ దిన్ షా శస్త్రచికిత్సలు నిర్వహించారు. భారత క్రికెట్ బోర్డు వైద్యనిపుణుల బృందంలో కీలక సభ్యుడిగా ఉన్న డాక్టర్ దిన్ షానే..ధోనీకి సైతం ఈ ఉదయం మోకాలి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ విషయాన్ని

అధికారికంగా ప్రకటించారు.

ధోనీ మోకాలి ఆపరేషన్ విజయవంతమైనట్లు..చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. ఒకటి లేదా రెండురోజుల్లో ధోనీని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని, రాంచీలో ధోనీ విశ్రాంతి తీసుకొని..ఆ తర్వాత రిహేబిలేషన్ కార్యక్రమం కొనసాగిస్తాడని తెలిపారు.

పూర్తి ఫిట్ నెస్ తో ధోనీ ఐపీఎల్ 17వ సీజన్ కు సిద్ధం కాగలడని అభిమానులు సైతం ఆశిస్తున్నారు.

ఇటీవలే 250వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన ధోనీ కెరియర్ లో ఇదే తొలి శస్త్రచికిత్స కావడం విశేషం.

First Published:  2 Jun 2023 11:45 AM IST
Next Story