Telugu Global
Sports

చెన్నై ఓడినా...మహీ సిక్సర్ల రికార్డు!

ఐపీఎల్ కురువృద్ధుడు మహేంద్ర సింగ్ ధోనీ ఓ అరుదైన క్లబ్ లో చోటు సంపాదించాడు.గుజరాత్ టైటాన్స్ పై ఈ ఘనత సాధించాడు..

చెన్నై ఓడినా...మహీ సిక్సర్ల రికార్డు!
X

ఐపీఎల్ కురువృద్ధుడు మహేంద్ర సింగ్ ధోనీ ఓ అరుదైన క్లబ్ లో చోటు సంపాదించాడు.గుజరాత్ టైటాన్స్ పై ఈ ఘనత సాధించాడు..

ఐపీఎల్-17వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ దశ పోటీలు ముగియటానికి మరికొద్ది మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉండడంతో..చివరి దశ మ్యాచ్ లు కీలకంగా మారాయి.

డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభంలో చూపిన జోరు..10వరౌండ్ తరువాత నుంచి చూపలేకపోతోంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన కీలక 12వ రౌండ్ మ్యాచ్ లో సైతం చెన్నై ఓటమి పొందడంతో లీగ్ టేబుల్ 4వ స్థానానికి పడిపోయింది. 12 రౌండ్లలో 6 విజయాలు, 6 పరాజయాలతో..

ప్లే -ఆఫ్ రౌండ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకొంది. ఆఖరి రెండురౌండ్లలోనూ నెగ్గితేనే..ప్లే-ఆఫ్ రౌండ్ చేరే పరిస్థితిని కొని తెచ్చుకొంది.

హైస్కోరింగ్ వార్ లో చెన్నై ఓటమి..

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఈ పోరులో చెన్నై బౌలర్లు 231 పరుగులు సమర్పించుకొన్నారు. ఓపెనింగ్ జోడీ సాయి సుదర్శన్- శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో పాటు..వ్యక్తిగతంగానూ చెరో సెంచరీ బాదడంతో చెన్నై ఓటమి ఊబిలో కూరుకుపోయింది.

232 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన చెన్నై20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనింగ్ జోడీ రహానే, రచిన్ రవీంద్ర చెరో పరుగు మాత్రమే చేయగా..వన్ డౌన్ రుతురాజ్ గయక్వాడ్ డకౌట్ కావడంతో..చెన్నై మరి కోలుకోలేకపోయింది. 2.5 ఓవర్లలో కేవలం 10 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.

ఇన్నింగ్స్ చివర్లో వెటరన్ ధోనీ 11 బంతుల్లో ఓ ఫోరు, 3 సిక్సర్లతో మెరుపులు మెరిపించినా, 26 పరుగుల నాటౌట్ స్కోరు సాధించినా ప్రయోజనం లేకపోయింది.

చివరకు 35 పరుగుల పరాజయం తప్పలేదు.

250 సిక్సర్ల క్లబ్ లో ధోనీ..

ఐపీఎల్ 17 సీజన్ల చరిత్రలో 250 సిక్సర్ల మైలురాయిని చేరిన భారత మూడో బ్యాటర్ గా మహేంద్రసింగ్ ధోనీ రికార్డుల్లో చేరాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన 12వ రౌండ్ మ్యాచ్ లో ధోనీ 3 సిక్సర్లతో..26 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. తన రెండో సిక్సర్ బాదడంతోనే 250 సిక్సర్ల రికార్డును పూర్తి చేయగలిగాడు.

తన ఐపీఎల్ కెరియర్ లో ధోనీ బాదిన సిక్సర్ల సంఖ్య 251కి చేరింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మాజీ బ్యాటర్ ఏబీ డిలివియర్స్ 251 సిక్సర్ల రికార్డును ధోనీ సమం చేయగలిగాడు.

డివిలియర్స్ 170 ఇన్నింగ్స్ లోనే 250 సిక్సర్లు సాధిస్తే...ధోనీ మాత్రం 228 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది.

సిక్సర్ల బాదుడులో టాపర్ రోహిత్ శర్మ...

ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్ల వరుసలో మొదటి రెండుస్థానాలను రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఆక్రమించారు. రోహిత్ 250 ఇన్నింగ్స్ లో 276 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిస్తే..విరాట్ 241 ఇన్నింగ్స్ లో 264 సిక్సర్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ 251 సిక్సర్లతో మూడోస్థానం సాధించాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ రికార్డు మాత్రం క్రిస్ గేల్ పేరుతో ఉంది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మాజీ ఓపెనర్ గేల్ 141 ఇన్నింగ్స్ లో 357 సిక్సర్లు బాదిన మొనగాడిగా నిలిచాడు.

ఐపీఎల్ చరిత్రలోనే సిక్సర్లు బాదిన మొదటి ఐదుగురు బ్యాటర్లలో గేల్, రోహిత్,విరాట్, ధోనీ, డేవిడ్ వార్నర్ ( 236 సిక్సర్లు ) నిలిచారు.

1063కు చేరిన సిక్సర్లు...

ప్రస్తుత సీజన్ లీగ్ మొదటి 59 మ్యాచ్ లు ముగిసే సమయానికే సిక్సర్ల సంఖ్య 1063 చేరింది. 2008 నుంచి 2024 వరకూ జరిగిన ఐపీఎల్ లో ఇదే అత్యుత్తమ రికార్డు కావడం విశేషం.

2023 సీజన్ లీగ్ లో నమోదైన 1124 సిక్సర్ల ఆల్ టైమ్ గ్రేట్ రికార్డు..ప్రస్తుత సీజన్లో తెరమరుగయ్యే అవకాశం ఉంది. అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో రెండుజట్లు కలసి మొత్తం 25 సిక్సర్లు బాదడంతో రెండో అత్యుత్తమ రికార్డు నమోదయ్యింది.

First Published:  11 May 2024 3:25 PM IST
Next Story