కెప్టెన్స్ ఆఫ్ టీమిండియా.. షిప్ మునక
ఆసియా కప్‌లో టీమిండియా దారుణ వైఫల్యాలకి జట్టులో కెప్టెన్స్ ఎక్కువ కావడమే ప్రధాన కారణం కాగా, విపరీతమైన ప్రయోగాలు మరో కారణం.
ప్రయాణికులదైనా, సరుకు రవాణాది అయినా ఓడకి ఒక కెప్టెన్ మాత్రమే ఉంటాడు. గమ్యం, గమనం, వాతావరణం, ప్రతికూల పరిస్థితులని అంచనా వేస్తూ కెప్టెన్ నేతృత్వంలోనే ఓడ ప్రయాణం సాగుతుంది. దీనినే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. టీమిండియాకి వచ్చేసరికి కెప్టెన్స్ ఆఫ్ ది షిప్‌లా మార్చేశారు. ఆసియా కప్‌లో టీమిండియా దారుణ వైఫల్యాలకి జట్టులో కెప్టెన్స్ ఎక్కువ కావడమే ప్రధాన కారణం కాగా, విపరీతమైన ప్రయోగాలు మరో కారణం. కరోనా వ్యాక్సిన్ కోసం జరిపిన ప్రయోగాలు మాదిరిగానే టీమిండియాపై మేనేజ్‌మెంట్ పెద్దలు ప్రయోగాలు ఆరంభించారు. ఒకేసారి రెండు దేశాల పర్యటనలు ఖరారు చేసి రెండు జట్లను పంపించడం ఇందులో మొదటిది. రెండు జట్లకు ఇద్దరు కెప్టెన్ల నేతృత్వంలో ఇద్దరు వైస్ కెప్టెన్ల సారధ్యం వహించారు. ఇరుదేశాల టూర్లు ముగిసి మళ్లీ ఒక జట్టుగా ఏర్పడేసరికి ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు వైస్ కెప్టెన్లు మిగులుతారు.
ఇక టెస్ట్ జట్టుకి ఒక కెప్టెన్, వన్డేలకి మరో కెప్టెన్, టి20లకి ఇంకో కెప్టెన్ పేరుతో చేసిన ప్రయోగంతో మరో ముగ్గురు కెప్టెన్లు, ముగ్గురు వైస్ కెప్టెన్లు జట్టు పెత్తనానికి సిద్ధమయ్యారు. ఉన్న 11 మంది జట్టులో సగానికి పైగా ప్లేయర్లు కెప్టెన్లుగా చేసినవారు, మాజీ కెప్టెన్లే. ఇదే టీమిండియా దారుణ వైఫల్యానికి ప్రధాన కారణం. మాజీ కెప్టెన్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్‌శర్మ, ఇటీవల ప్రయోగాత్మక సిరీస్‌లకి కెప్టెన్లుగా వ్యవహరించిన కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, జస్‌ప్రీత్‌బుమ్రాలున్నారు. వీరికి తోడు శిఖర్‌ధావన్ కెప్టెన్‌గా వెస్టిండీస్ టూర్‌కి వ్యవహరించాడు. వీరంతా జట్టుకి ఎంపికైతే సగానికి పైగా కెప్టెన్లుగా చేసినవారే ప్లేయర్లు. ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేదు. ఆటగాళ్ల మధ్య సమన్వయం లేదు. ఇగోలతో ఆసియా కప్ నుంచి నిష్క్రమించారు. కెప్టెన్‌గా చేసిన రహానే కూడా టీంలో కొనసాగి ఉంటే మొత్తం జట్టంతా కెప్టెన్లుగా పనిచేసిన ఆటగాళ్లతో నిండిపోయేది. వికటించిన ఈ ప్రయోగాలకి ఆసియా కప్ దారుణ పరాభవంతోనైనా ఫుల్‌స్టాప్ పెడతారో, కొనసాగిస్తారో చూడాలి.