షమీ సరికొత్త ప్రపంచకప్ రికార్డు
ప్రపంచకప్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో భారత ఆటగాళ్ళే అగ్రస్థానాలలో నిలిచారు. బ్యాటింగ్ లో విరాట్, బౌలింగ్ లో షమీ టాపర్లుగా ఉన్నారు.
ప్రపంచకప్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో భారత ఆటగాళ్ళే అగ్రస్థానాలలో నిలిచారు. బ్యాటింగ్ లో విరాట్, బౌలింగ్ లో షమీ టాపర్లుగా ఉన్నారు....
వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ దశ పోటీలు ముగిసే వరకూ జరిగిన మ్యాచ్ ల్లో ఆతిథ్య భారతజట్టు ఆధిపత్యమే కొనసాగుతోంది. మొత్తం 48 మ్యాచ్ ల ఈ టోర్నీ మొదటి 47 మ్యాచ్ లు ముగిసే సమయానికి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో భారత ఆటగాళ్ళే అగ్రస్థానాలలో కొనసాగుతున్నారు.
711 పరుగులతో విరాట్ అగ్రస్థానం...
బ్యాటింగ్ విభాగంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లీగ్ దశ 9 రౌండ్లు, సెమీఫైనల్ నాకౌట్ పోరు వరకూ మొత్తం 10 మ్యాచ్ ల్లో విరాట్ 711 పరుగులు సాధించడం ద్వారా ప్రపంచకప్ రికార్డు నెలకొల్పాడు.
ఓ సింగిల్ ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన తొలిసెమీఫైనల్లో భారత్ 70 పరుగుల విజయం సాధించడంలో విరాట్ కొహ్లీ ప్రపంచ రికార్డు సెంచరీతో తనవంతు పాత్ర నిర్వర్తించాడు.
విరాట్ మొత్తం 3 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో 711 పరుగులు సాధించడం ద్వారా మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న 673 పరుగుల ప్రపంచకప్ రికార్డును విరాట్ అధిగమించగలిగాడు. 2003 ప్రపంచకప్ టోర్నీలో మాస్టర్ సచిన్ 673 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.
అంతేకాదు..ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ మ్యాచ్ లో శతకం బాదిన భారత మూడో క్రికెటర్ ఘనతను సైతం విరాట్ సొంతం చేసుకోగలిగాడు. గతంలో సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మలకు మాత్రమే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ ల్లో సెంచరీలు సాధించిన రికార్డు ఉంది.
ప్రస్తుత ప్రపంచకప్ లో విరాట్ 90.68 స్ట్ర్రయిక్ రేట్ తో 101.57 సగటుతో టాపర్ గా కొనసాగుతున్నాడు. 35 సంవత్సరాల విరాట్ ప్రస్తుత ప్రపంచకప్ లోనే అత్యంత వేగంగా 13వేల పరుగుల మైలురాయిని చేరిన బ్యాటర్ గా, వన్డే చరిత్రలో అత్యధికంగా 50 శతకాలు బాదిన మొనగాడిగా జంట ప్రపంచ రికార్డులు సాధించాడు.
సిక్సర్ల బాదుడులో రోహిత్ ప్రపంచకప్ రికార్డు...
భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొత్తం 10 మ్యాచ్ ల్లో 23 సిక్సర్లు బాదడం ద్వారా సరికొత్త ప్రపంచకప్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో సహా 550 పరుగులతో 5వ అత్యుత్తమ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో రోహిత్ 124.15 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు.
భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రెండు వరుస సెంచరీలతో సహా 526 పరుగులతో 75.14 సగటు సాధించాడు.
యువఓపెనర్ శుభ్ మన్ గిల్ 350, వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ఫాస్టెస్ట్ సెంచరీతో సహా 386 పరుగులతో టాప్ -10 బ్యాటర్లలో నిలిచారు.
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఒక్కడే సెమీస్ వరకూ నాలుగు సెంచరీలు బాదడం ద్వారా అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్ గా ఉన్నాడు.
ప్రస్తుత ప్రపంచకప్ లో 350కి పైగా స్కోర్లు నాలుగుసార్లు సాధించినజట్టు భారత్ మాత్రమే కావడం మరో రికార్డు.
23 వికెట్లతో మహ్మద్ షమీ జోరు.....
బౌలర్ల విభాగంలో సైతం భారత సీమర్ మహ్మద్ షమీ 23 వికెట్లు పడగొట్టడం ద్వారా నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. షమీ కేవలం 6 మ్యాచ్ ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడుసార్లు 5 వికెట్ల ఘనత సాధించడం ద్వారా సరికొత్త ప్రపంచకప్ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్ తో ముగిసిన సెమీస్ లో షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు సాధించడం ద్వారా బౌలర్ల లిస్ట్ లో టాపర్ గా నిలిచాడు. 9.13 సగటుతో 5.01 ఎకానమీ నమోదు చేశాడు.
ప్రపంచకప్ చరిత్రలో 7 వికెట్లు సాధించిన 7వ బౌలర్ గా షమీ రికార్డుల్లో చేరాడు. ప్రపంచకప్ టోర్నీలలో 50కి పైగా వికెట్లు పడగొట్టిన భారత తొలిబౌలర్ షమీ మాత్రమే.
భారత ఇతర బౌలర్లలో బుమ్రా 18 వికెట్లు, రవీంద్ర జడేజా 16 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 15 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 13 వికెట్లతో అత్యంత విజయవంతమైన బౌలర్లుగా నిలిచారు.
నవంబర్ 19న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ సమరంలో 5సార్లు విన్నర్ ఆస్ట్ర్రేలియాతో రెండుసార్లు విజేత భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.