షమీ.. దిగ్గజాల రికార్డులనూ దున్నేస్తున్నాడు సుమీ
పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదన్న మాటకు తను ఫర్పెక్ట్ ఉదాహరణ. ఓ ఆల్‌రౌండర్ గాయపడితే ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చి మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లతో ప్రత్యర్థుల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాడు.
మహ్మద్ షమీ.. భారత క్రికెట్‌లో మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్. ఎంత అండర్ రేటెడ్ అంటే నాలుగు మ్యాచ్‌లాడి రెండు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్ కోసం తనను పక్కన పెట్టేంత. గత రెండు ప్రపంచకప్‌ల్లో కలిపి 31 వికెట్లు తీసిన అనుభవమున్నా నాలుగు మ్యాచ్‌లు బెంచ్‌పైనే కూర్చోబెట్టేంత అండర్ రేటెడ్ బౌలర్. కానీ, పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదన్న మాటకు తను ఫర్పెక్ట్ ఉదాహరణ. ఓ ఆల్‌రౌండర్ గాయపడితే ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చి మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లతో ప్రత్యర్థుల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాడు.
జహీర్, శ్రీనాథ్‌లను దాటేశాడు
సూపర్ ఫామ్‌లో ఉన్న మహ్మద్ షమీ తన బుల్లెట్ల లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కకావికలం చేసేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటింగ్ పీక్స్‌లో ఉన్నప్పుడు 5 వికెట్లు నేలకూల్చి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. మొన్న ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్లు, నిన్న శ్రీలంకపై 5 వికెట్లతో మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు సాధించాడు. ఈక్రమంలో భారత్ తరఫున ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మన లెజండరీ పేస్ బౌలర్లు జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్ 44 వికెట్లతో ఈ రికార్డు నెలకొల్పగా దాన్ని బ్రేక్ చేసి 45 వికెట్లతో కొత్త రికార్డు సృష్టించాడు.
వాళ్లాడిన మ్యాచ్‌ల్లో మూడో వంతే
జహీర్ ఖాన్ 24 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు నేలకూల్చగా, శ్రీనాథ్ 34 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీశాడు. కానీ, షమీ 14 మ్యాచ్‌ల్లోనే వాళ్లను దాటేశాడు. ఈ లెక్క చాలు షమీ ఎంత అద్భుతమైన బౌలరో చెప్పడానికి. ఇదే ఊపులో షమీ సెమీఫైనల్, ఫైనల్‌లో కూడా చెలరేగిపోతే అతని పేరు చరిత్రలో నిలిచిపోతుంది. కపిల్‌దేవ్, జహీర్‌ఖాన్ లాంటి లెజండ్ల సరసన షమీ కూడా మరో దిగ్గజంగా నిలుస్తాడు.