Telugu Global
Sports

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో మహ్మద్ సిరాజ్

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో మహ్మద్ సిరాజ్ వన్డేల్లో నంబర్ 1 బౌలర్‌గా ఉన్నాడు. తాజాగా శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత వన్డే చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే బౌలర్ ప్రదర్శన చేశాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో మహ్మద్ సిరాజ్
X

ఆసియా కప్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తన సంచలన బౌలింగ్‌తో అదరగొట్టిన టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. ఇప్పుడు ఐసీసీ ర్యాకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. ఫైనల్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టడమే కాకుండా మొత్తంగా 6 వికెట్లు తీసి శ్రీలంక జట్టు పతనానికి కారణమయ్యాడు. దీంతో ఐసీసీ తాజా ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. వన్డేల్లో నంబర్ 1 ర్యాంకును సాధించడం సిరాజ్‌కు ఇది రెండో సారి.

ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో మహ్మద్ సిరాజ్ వన్డేల్లో నంబర్ 1 బౌలర్‌గా ఉన్నాడు. తాజాగా శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత వన్డే చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి.. ఇప్పటి వరకు ఏ భారత బౌలర్ అందుకోని రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్‌లో కేవలం 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్‌కు ఇది వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

ఇక ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో హేజిల్‌వుడ్, మూడో స్థానంలో ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు. అఫ్గాన్ స్నిన్నర్లు ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ వరుసగా నాలుగైదు స్థానాల్లో నిలిచారు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్‌లో సౌత్ఆఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 20 స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్ సాధించాడు. పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతుండగా.. శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో, డసెన్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.


First Published:  20 Sept 2023 4:26 PM IST
Next Story