Telugu Global
Sports

ఐపీఎల్ లో నేడు సహస్ర సమరం!

ఐపీఎల్-16 లీగ్ లో భాగంగా నేడు ఓ అసాధారణ పోరుకు ముంబై వాంఖడే స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ తో తొలివిజేత రాజస్థాన్ రాయల్స్ ఢీ కొనబోతోంది.

MI vs RR, IPL 2023: Mumbai Indians Vs Rajasthan Royals Today Match at 7:30 PM
X

ఐపీఎల్ లో నేడు సహస్ర సమరం!

ఐపీఎల్-16 లీగ్ లో భాగంగా నేడు ఓ అసాధారణ పోరుకు ముంబై వాంఖడే స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ తో తొలివిజేత రాజస్థాన్ రాయల్స్ ఢీ కొనబోతోంది.....

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ గత 16 సంవత్సరాలుగా అంతైఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోతూ వస్తోంది. 2008 లీగ్ తొలిసీజన్ నుంచి ప్రస్తుత 2023 సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ 43వ మ్యాచ్ వరకూ కొత్తపుంతలు తొక్కుతూ వచ్చింది. చూస్తుండగానే 1000 మ్యాచ్ ల మైలురాయిని చేరింది.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి ముంబై ఇండియన్స్- రాజస్థాన్ రాయల్స్ జట్ల నడుమ జరిగే పోరు ఐపీఎల్ చరిత్రలోనే సహస్ర్ర సమరంగా రికార్డుల్లో చేరనుంది.

2008 నుంచి 2023 వరకూ.....

ఐసీఎల్ ( ఇండియన్ క్రికెట్ లీగ్ ) కు పోటీగా 2008లో బీసీసీఐ ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కమ్ ఐపీఎల్ ఆటుపోట్లు ఎదుర్కొంటూ..కాలపరీక్షకు నిలిచింది.

శతకోటి భారత అభిమానులకు ఏకైక వేసవి వినోదంగా విలసిల్లుతోంది. వేలకోట్ల రూపాయల వ్యాపారంగా రూపుదిద్దుకొంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రీడాలీగ్ గా గుర్తింపు సంపాదించింది.

2008లో కేవలం ఎనిమిది ఫ్రాంచైజీలతో మొదలైన ఈ లీగ్ ప్రస్తుత 2023 సీజన్ నాటికి పది ప్రాంచైజీలకు విస్తరించింది. 2021 సీజన్ వరకూ 60 లీగ్ మ్యాచ్ లకే పరిమితమైన ఈ లీగ్ ప్రస్తుతం 70 మ్యాచ్ ల స్థాయికి చేరింది.

ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్...

ఐపీఎల్ అంటే..ముంబై లేదా చెన్నై అన్నపేరు బలపడి పోయింది. ఎందుకంటే గత 15 సీజన్లలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన మొదటి రెండుజట్లలో ముంబై, చెన్నై మాత్రమే నిలుస్తాయి.

రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ కి అత్యధికంగా ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020 ) విజేతగా నిలిచిన అసాధారణ రికార్డు ఉంది.

ఇక..ఎవర్ గ్రీన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు టైటిల్స్ తో రెండో అత్యుత్తమ జట్టుగా నిలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ చార్జర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి విజేత కాగలిగాయి.

విరాట్ కొహ్లీ లాంటి దిగ్గజ బ్యాటర్ నేతృత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ గత 15 సీజన్లలో ఒక్కసారి విజేత కాలేకపోయింది.

చెన్నై తర్వాతే ఏజట్ట్టైనా...!

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ అత్యధికమ్యాచ్ లు ఆడిన జట్టు ఘనత ముంబైదైతే..అత్యధిక మ్యాచ్ లు నెగ్గిన రికార్డు మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కే దక్కుతుంది.

2008 ప్రారంభ లీగ్ నుంచి 2022 15వ సీజన్ లీగ్ వరకూ 209 మ్యాచ్ లు ఆడిన చెన్నై 117 విజయాలు, 86 పరాజయాలతో 58.41 విజయశాతాన్ని నమోదు చేసింది. 2008, 2015, 2018, 2022 సీజన్లలో చెన్నై విజేతగా నిలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ 224 మ్యాచ్ లు ఆడి 100 విజయాలు, 118 పరాజయాలతో 45.94 విజయశాతం సాధించింది. 2022 లో తొలిసారిగా లీగ్ ప్రవేశం చేసి..తొలిప్రయత్నంలోనే విజేతగా నిలిచిన్ గుజరాత్ టైటాన్స్ 16 మ్యాచ్ ల్లో 12 విజయాలు, 4 పరాజయాలతో 75 శాతం విజయాలు సాధించిన జట్టుగా రికార్డుల్లో చేరింది.

2008 నుంచి 2022 సీజన్ వరకూ క్రమం తప్పకుండా లీగ్ లో పాల్గొంటూ వచ్చిన కోల్ కతా నైట్ రైడర్స్ 223 మ్యాచ్ ల్లో 113 గెలుపు, 106 ఓటమితో 51.56 విజయశాతంతో రెండుసార్లు చాంపియన్ గా నిలిచింది.

2022 సీజన్ లీగ్ ద్వారా అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 15 మ్యాచ్ ల్లో 9 విజయాలు, 6 పరాజయాలతో 60 శాతం విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది.

56.7 విజయశాతంతో ముంబై..

గత 15 సీజన్లలో మొత్తం 231 మ్యాచ్ లు ఆడిన ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ 129 విజయాలు, 98 పరాజయాలతో 56.7 విజయశాతాన్ని నమోదు చేయడం ద్వారా అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది.

మొహాలీ ఫ్రాంచైజీకి చెందిన పంజాబ్ కింగ్స్ 218 మ్యాచ్ ల్లో 98 గెలుపు, 116 ఓటమితో 45.87 విజయశాతం సాధిస్తే..తొలివిజేత రాజస్థాన్ రాయల్స్ 192 మ్యాచ్ ల్లో 94 గెలుపు, 93 ఓటమితో 50.26 విజయశాతం సాధించింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొత్తం 227 మ్యాచ్ లు ఆడి 107 మ్యాచ్ ల్లో నెగ్గి 113 మ్యాచ్ ల్లో ఓటమితో 48. 65 విజయశాతం నమోదు చేసింది. కనీసం ఒక్కసారీ ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేకపోయింది.

ఐపీఎల్ రెండో ( 2009 ) సీజన్లో డెక్కన్ చార్జర్స్ పేరుతో విజేతగా నిలిచిన హైదరాబాద్ ప్రాంచైజీ..ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ పేరుతో బరిలో నిలవడం తో పాటు 2013 సీజన్లో విజేతగా నిలిచింది. మొత్తం 152 మ్యాచ్ లు ఆడి 74 గెలుపు, 74 ఓటమి రికార్డుతో 50 విజయశాతం నమోదు చేసింది.

ప్లే-ఆఫ్ రౌండ్లో 11సార్లు చెన్నై రికార్డు..

ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్ కు 11సార్లు చేరడంతో పాటు..తొమ్మిదిసార్లు ఫైనల్స్ ఆడి..నాలుగుసార్లు విజేతగా నిలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. ఐపీఎల్ చరిత్రలో 100 విజయాలు సాధించిన మూడుజట్లలో ముంబై, చెన్నై, కోల్ కతా మాత్రమే ఉన్నాయి.

2012, 2014 సీజన్లలో గౌతం గంభీర్ నాయకత్వంలో రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ఘనత కోల్ కతా నైట్ రైడర్స్ కు ఉంది.

ఢిల్లీ ఫ్రాంచైజీ చెత్త రికార్డు..

ఐపీఎల్ గత 15 సీజన్ల చరిత్రలో వరుసగా 11 మ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూసిన చెత్త రికార్డును ఢిల్లీ డేర్ డెవిల్స్ మూటకట్టుకొన్నా..2019 సీజన్ నుంచి వరుసగా ప్లే- ఆఫ్ రౌండ్ కు అర్హత సాధిస్తూ వస్తోంది.

ఐపీఎల్ ఫైనల్స్ లో ఆరుసార్లు పోటీపడిన ముంబైజట్టు..2010 టైటిల్ సమరంలో మాత్రమే చెన్నై చేతిలో ఓటమి చవిచూసింది. మిగిలిన ఐదుసార్లు ( 2013, 2015, 2017, 2019, 2020 ) సీజన్లలో విజేతగా నిలవడం తో పాటు..మూడుసార్లు ఫైనల్లో చెన్నైని చిత్తు చేయగలిగింది.

అత్యధిక వరుస విజయాల కోల్ కతా..

ఐపీఎల్ గత 15 సీజన్ల చరిత్రలో వరుసగా తొమ్మిదిమ్యాచ్ లు నెగ్గిన ఏకైక, తొలిజట్టు కోల్ కతా మాత్రమే. 2014 సీజన్లో ఈ అరుదైన రికార్డును కోల్ కతా సొంతం చేసుకోగలిగింది.

సీజన్ తొలిరౌండ్ మ్యాచ్ ను ఓటమితో అత్యధికసార్లు ప్రారంభించిన ఏకైకజట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.

2023 సీజన్లో రికార్డుల సునామీ...

ఐపీఎల్ -16 సీజన్ మొదటి 30 రోజుల్లో జరిగిన 35 మ్యాచ్ ల్లో 20 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు కావడం విశేషం. గత 16 సీజన్ల టోర్నీ చరిత్రలో ఇలాంటి రికార్డు నమోదు కావడం ఇదే మొదటిసారి.

భారీలక్ష్యచేధనకు దిగిన జట్లు సైతం ఆరుసార్లు 200కు పైగా పరుగులు సాధించడం మరో రికార్డు.

మొహాలీ వేదికగా పంజాబ్ తో ముగిసిన ప్రస్తుత సీజన్ 8వ రౌండ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ సాధించిన 257 పరుగుల స్కోరే ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరుగా ఉంది.

ఇదే మ్యాచ్ లో రెండుజట్లూ కలసి 458 పరుగులు సాధించడం మరో రికార్డుగా నమోదయ్యింది. మొదటి 26 మ్యాచ్ ల్లో ఐదింట సగటున 400కు పైగా స్కోర్లు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి.

2018 సీజన్ లీగ్ లో 15సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు కాగా..2022 సీజన్లో 18సార్లు, ప్రస్తుత 2023 సీజన్లో ఇప్పటికే 22సార్లు 200 కు పైగా స్కోర్లు నమోదు కావడం మరో అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.

ఒక్క మ్యాచ్ లో 33 సిక్సర్లు...

బెంగళూరు రాయల్ చాలెంజర్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల నడుమ జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో 33 సిక్సర్లు నమోదయ్యాయి. చెన్నై 17 సిక్సర్లు బాదితే..బెంగళూరు 16 సిక్సర్లు సాధించింది.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు నమోదైన మూడోమ్యాచ్ గా ఈపోరు రికార్డుల్లో చోటు చేసుకొంది. 2020లో షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ - చెన్నై సూపర్ కింగ్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్- బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల నడుమ జరిగిన మ్యాచ్ ల్లో సైతం 33 సిక్సర్లు నమోదయ్యాయి.

మొదటి ఐదురౌండ్ల మ్యాచ్ ల్లో బెంగళూరు కెప్టెన్ డూప్లెసీ 19, ఆల్ రౌండర్ మాక్స్ వెల్ 16 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన మొదటి ఇద్దరు బ్యాటర్లుగా కొనసాగుతున్నారు.

ఇక..అత్యధిక సిక్సర్లు బాదించుకున్న బౌలర్ గా ముంబై లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా ఓ చెత్త రికార్డును మూటకట్టుకొన్నాడు. పియూష్ ఏకంగా 185 సిక్సర్లు సమర్పించుకొన్నాడు.

6వేల పరుగుల హీరోలు...

ఐపీఎల్ లో 6వేల పరుగుల మైలురాయిని చేరిన బ్యాటర్లు నలుగురు మాత్రమే ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఓపెనర్ కమ్ కెప్టెన్ రోహిత్ శర్మ 4వ బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో జరిగిన పోటీలో ముంబై తరపున ముందుగా బ్యాటింగ్ కు దిగిన రోహిత్ 14 పరుగుల స్కోరు చేయడం ద్వారా 6వేల పరుగులు సాధించిన మరో ముగ్గురు మొనగాళ్ల సరసన నిలువగలిగాడు.

2008 నుంచి క్రమం తప్పకుండా ఐపీఎల్ లో పాల్గొంటూ వస్తున్న రోహిత్ 28 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. దీంతో 6వేల 14 పరుగులు సాధించినట్లయ్యింది.

రోహిత్ ప్రస్తుత సీజన్ 5వ రౌండ్ వరకూ 231 మ్యాచ్ లు ఆడి ఓ సెంచరీ, 41 హాఫ్ సెంచరీలతో ఈ ఘనతను సాధించాడు.

రోహిత్ కంటే ముందుగా 6వేల పరుగుల రికార్డును అందుకొన్న దిగ్గజ బ్యాటర్లలో విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్ , డేవిడ్ వార్నర్ ఉన్నారు. అత్యధిక శతకాలు బాదిన ఐపీఎల్ హీరోలలో క్రిస్ గేల్, విరాట్ కొహ్లీ మొదటి రెండుస్థానాలలో నిలిచారు.

కీపర్ గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు...

బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ తో ముగిసిన పోరులో చెన్నై కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రెండుక్యాచ్ లు పట్టడం ద్వారా 175 మందిని అవుట్ చేసిన ఏకైక వికెట్ కీపర్ గా రికార్డు నెలకొల్పాడు. 232 మ్యాచ్ ల్లో 136 క్యాచ్ లు, 39 స్టంపింగ్స్ తో మహీ ఈ ఘనత సాధించాడు.

26 మ్యాచ్ లు..26 మందికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు.

ప్రస్తుత సీజన్ మొదటి 20 రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ జట్ల ప్రారంభమ్యాచ్ నుంచి జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్- లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ముగిసిన 26వ మ్యాచ్ వరకూ..26మంది వేర్వేరు ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోడం మరో అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

16 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో 26 మంది వేర్వేరు క్రికెటర్లు 26 వేర్వేరు మ్యాచ్ ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు నిలవడం ఇదే మొదటిసారి.

వాంఖడేలో 1000మ్యాచ్ ల వేడుక..

భారత క్రికెట్ అడ్డా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7-30కి ముంబై- రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగే పోరు ఐపీఎల్ చరిత్రలోనే 1000వ మ్యాచ్ కావడంతో..ప్రత్యేక వేడుకల నిర్వహించబోతున్నారు.

ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ వేడుకను నిర్వహిస్తారు. ప్రస్తుత సీజన్ లీగ్ మొదటి 8 రౌండ్ మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ రెండోస్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ పై ..7 రౌండ్లలో 3 గెలుపు, 4 ఓటమితో లీగ్ టేబుల్ 9వ స్థానానికి పడిపోయిన ముంబై నెగ్గుకు రాగలదా...వేచిచూడాల్సిందే.

First Published:  30 April 2023 6:45 AM IST
Next Story