ముంబైజోరు...బెంగళూరు బేజారు!
ప్రారంభ మహిళా ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో హోరెత్తిస్తుంటే..బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వరుస పరాజయాలతో బేజారెత్తిపోతోంది.
ప్రారంభ మహిళా ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో హోరెత్తిస్తుంటే..బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వరుస పరాజయాలతో బేజారెత్తిపోతోంది.....
2023 మహిళా ఐపీఎల్ తొలి సీజన్ పోటీలు ఏకపక్షంగా సాగిపోతున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిస్తే..బెంగళూరు రాయల్ చాలెంజర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు మాత్రం వరుస పరాజయాలతో లీగ్ టేబుల్ ఆఖరి రెండుస్థానాలకు పడిపోయాయి.
యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాలతో లీగ్ టేబుల్ రెండు, మూడుస్థానాలలో నిలిచాయి.
హేలీ హోరులో బెంగళూరు గల్లంతు..
ఐదుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ తొలిరౌండ్ లో గుజరాత్ జెయింట్స్ ను 143 పరుగుల భారీతేడాతో చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..రెండోరౌండ్ పోటీలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పై 9 వికెట్ల విజయంతో రెండుకు రెండురౌండ్లు నెగ్గి లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది.
ముంబై డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన రెండోరౌండ్ పోరులో స్మృతి మందన నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ..ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ కు ఏమాత్రం సరిజోడి కాలేకపోయింది.
బెంగళూరుకు హేలీ మాథ్యూస్ బ్రేక్...
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ఓపెనింగ్ జోడీ స్మృతి మందన- సోఫియా డివైన్ చక్కటి ఆరంభాన్ని ఇచ్చినా భారీస్కోరు సాధించలేకపోయింది.
కెప్టెన్ స్మృతి మందనతో పాటు సహ ఓపెనర్ సోఫియా డివైన్ 16 పరుగులతో ధాటిగా ఆడటంతో ఆరంభంలో స్కోరు బోర్దు చకచకా సాగిపోయింది. అయితే..కీలక తరుణంలో ముంబై బౌలర్లు కేవలం నాలుగు పరుగుల తేడాలో నాలుగు వికెట్లు పడగొట్టి బెంగళూరు జోరుకు బ్రేక్ వేయగలిగారు.
దిశ (0), ఎల్సీ పెర్రీ (13), హీతర్ నైట్ (0) తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో బెంగళూరు మరి తేరుకోలేకపోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు రిచా, కనిక, శ్రెయాంక, షుట్ తుదివరకూ పోరాడటంతో బెంగళూరు 20 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటయ్యింది. స్మృతి మందన (23), రిచా ఘోష్ (28), కనిక అహూజ (22), శ్రెయాంక పాటిల్ (23), మేగన్ షుట్ (20) రెండంకెల స్కోర్లు సాధించినా ప్రయోజనం లేకపోయింది.
ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3, సైకా ఇషాఖ్, అమేలియా కెర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
టాప్ గేర్ లో ముంబై టాపార్డర్...
సమాధానంగా 156 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబై 14.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 9 వికెట్లతో విజేతగా నిలిచింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ 38 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ తో 77 పరుగుల నాటౌట్ స్కోరు సాధించింది. స్కీవర్ బ్రంట్ (29 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్ తో చెలరేగిపోయారు. విండీస్ స్టార్ హీలీ మాథ్యూస్‌తో పాటు మరో ఓపెనర్ యస్తిక భాటియా (23; 4 ఫోర్లు) ఎడాపెడా బౌండ్రీలు కొట్టడంతో చేజింగ్‌లో ముంబైకి శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించిన అనంతరం యస్తిక ఔట్ కాగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్కీవర్ బ్రంట్.. బెంగళూరు బౌలర్ల పై ఎదురుదాడికి దిగింది. ఓ వైపు హేలీ మాథ్యూస్, మరో వైపు బ్రంట్ ఎడాపెడా షాట్లతో చెలరేగిపోయారు.
ఎనిమిదో ఓవర్‌లో బ్రంట్ వరుసగా మూడు బౌండ్రీలతో హ్యాట్రిక్ సాధించింది. ఆ తర్వాతి ఓవర్‌లో మాథ్యూస్ రెండు బౌండ్రీలు బాదటంతో ఆట పదకొండో ఓవర్‌లో వీరిద్దరి ధాటికి 15 పరుగులు వచ్చి చేరాయి. మరుసటి ఓవర్లో సైతం మరో 15 పరుగులు దండుకోడంతో స్కోరు మరింతగా పెరిగిపోయింది. ఆట. 13వ ఓవర్‌లో స్కీవర్ బౌండ్రీ, సిక్సర్ తో దూకుడును మరింతగా పెంచింది. హేలీ మాథ్యూస్ బ్యాక్ టు బ్యాక్ బౌండ్రీలతో ముంబై విజయం పూర్తి చేసింది.
బౌలర్ గా 3 వికెట్లు, బ్యాటర్ గా 77 పరుగుల నాటౌట్ స్కోరుతో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన హేలీ మాథ్యూస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈరోజు జరిగే రౌండ్ రాబిన్ లీగ్ పోరులో..ఢిల్లీ క్యాపిటల్స్ తో యూపీ వారియర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7-30కి ప్రారంభంకానుంది.