Telugu Global
Sports

ప్రపంచకప్ లో మారడోనాను మించిన మెస్సీ !

ప్రపంచకప్ ఫుట్ బాల్ లో అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దిగ్గజ ఆటగాడు డియాగో మారడోనా రికార్డును మెస్సీ అదిగమించాడు.

లయనల్ మెస్సీ
X

లయనల్ మెస్సీ

ప్రపంచకప్ ఫుట్ బాల్ లో అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దిగ్గజ ఆటగాడు డియాగో మారడోనా రికార్డును మెస్సీ అదిగమించాడు.

ఖతర్ వేదికగా జరుగుతున్న 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లయనల్ మెస్సీ తమ గ్రూపు ప్రారంభమ్యాచ్ లోనే గోలసాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అర్జెంటీనా ఆల్ టైమ్ గ్రేట్ డియాగో మారడోనా రికార్డును తిరగరాయటం ద్వారా..తన ప్రధాన ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డోతో సమఉజ్జీగా నిలువగలిగాడు.

నాలుగు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్...

అర్జెంటీనా తరపున నాలుగు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన తొలి అర్జెంటీనా ప్లేయర్ గా లయనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. గ్రూపు- సీ లీగ్ లో భాగంగా..దోహాలోని లూసెల్ ఐకానిక్ స్టేడియం వేదికగా ఇరాన్ తో జరిగిన తమ ప్రారంభమ్యాచ్ లోనే గోల్ సాధించాడు.

ఆట మొదటి భాగం 10వ నిముషంలో లభించిన పెనాల్టీని మెస్సీ గోలుగా మలచడం ద్వారా..నాలుగు ( 2006, 2014, 2018, 2022 ) ప్రపంచకప్ టోర్నీలలో తన దేశం తరపున గోల్స్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్ గా అవతరించాడు.

ఇప్పటి వరకూ..మూడు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన రికార్డు మారడోనా పేరుతో ఉంది. మారడోనా 1994, 1998, 2002 టోర్నీలలో తన దేశం తరపున గోల్స్ సాధించాడు.

గాబ్రిల్ బాటిస్టుటా సైతం 1994, 1998, 2002 ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ నమోదు చేశాడు.

ఐదో ఆటగాడు లయనల్ మెస్సీ..

ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలోనే నాలుగు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన ఐదవ ప్లేయర్ గా మెస్సీ రికార్డుల్లో చేరాడు. ఇంతకు ముందే ఈ ఘనత సాధించిన దిగ్గజాలలో కింగ్ పీలే, సీలెర్, మిరోస్లావ్ క్లోజ్, క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు.

2006 టోర్నీ ద్వారా ప్రపంచకప్ అరంగేట్రం చేసిన మెస్సీ, రొనాల్డో ఇద్దరూ నాలుగు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో ఏడు గోల్స్ చొప్పున సాధించి సమఉజ్జీలుగా నిలిచారు.

First Published:  22 Nov 2022 5:55 PM IST
Next Story