మారడోనాను మించిన మెస్సీ!
అర్జెంటీనా కెప్టెన్, సాకర్ సంచలనం లయనల్ మెస్సీ అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
అర్జెంటీనా కెప్టెన్, సాకర్ సంచలనం లయనల్ మెస్సీ అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆల్ టైమ్ గ్రేట్ డియాగో మారడోనా రికార్డును అధిగమించాడు...
2022 ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ కు రెండుసార్లు విజేత, ప్రపంచ మేటి జట్లలో ఒకటైన అర్జెంటీనా చేరుకొంది. గ్రూప్- సీ లీగ్ తొలిమ్యాచ్ ను ఓటమితో మొదలు పెట్టిన అర్జెంటీనా..ఆఖరి రెండురౌండ్ల పోటీలలో విజయాలు సాధించడం ద్వారా టాపర్ గా ప్రీ-క్వార్టర్ ఫైనల్ రౌండ్ కు అర్హత సంపాదించింది.
పోలెండ్ తో జరిగిన కీలక ఆఖరిరౌండ్ పోరులో అర్జెంటీనా విజయం సాధించడం ద్వారా నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకొంది. ఈ మ్యాచ్ బరిలో నిలవడం ద్వారా కెప్టెన్ లయనల్ మెస్సీ అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడిన అర్జెంటీనా ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.
మారడోనా 21- మెస్సీ 22
అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడిన అర్జెంటీనా ఆటగాడి రికార్డు ఇప్పటి వరకూ డియాగో మారడోనా పేరుతో ఉంది. మారడోనా తన కెరియర్ లో నాలుగు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొనడం ద్వారా మొత్తం 21 మ్యాచ్ లు ఆడగలిగాడు. అంతేకాదు..తనజట్టును విశ్వవిజేతగా నిలపడం తో పాటు ప్రపంచకప్ టోర్నీలలో ఎనిమిది గోల్సు సాధించిన ఘనత మారడోనా పేరుతో ఉంది.
అయితే..35 సంవత్సరాల లయనల్ మెస్సీ ప్రస్తుతం తన కెరియర్ లో 5వ ప్రపంచకప్ ఆడుతూ మ్యాచ్ ల సంఖ్యను 22కు పెంచుకోడం ద్వారా మారడోనా పేరుతో
ఉన్న 21 మ్యాచ్ ల రికార్డును అధిగమించాడు. పోలెండ్ తో ముగిసిన గ్రూప్- సీ లీగ్ ఆఖరి మ్యాచ్ వరకూ మెస్సీ 8 గోల్స్ మాత్రమే సాధించగలిగాడు.
మారడోనా, మెస్సీ చెరో ఎనిమిది గోల్స్ సాధించడం ద్వారా సమఉజ్జీలుగా ఉన్నారు. అత్యధిక మ్యాచ్ ల రికార్డులో మాత్రం మారడోనాను మెస్సీ అధిగమించగలిగాడు.
పోలెండ్, మెక్సికో, సౌదీ అరేబియాజట్లతో కూడిన గ్రూప్- సీ లీగ్ నుంచి అర్జెంటీనా రెండు విజయాలు, ఓ ఓటమితో 6 పాయింట్లు సాధించడం ద్వారా టాపర్ గా ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.
పోలెండ్ జట్టు పూల్ రన్నరప్ గా నాకౌట్ రౌండ్ చేరుకోగా..మెక్సికో, సౌదీ అరేబియాజట్లు మాత్రం లీగ్ దశ నుంచే నిష్క్ర్రమించక తప్పలేదు.