Telugu Global
Sports

పదో రోజున భారత్‌కు పతకాల వెల్లువ!

పదో రోజు పోటీలలో భారత అథ్లెట్లు బంగారు మోత మోగించారు. భారత్ 18 స్వర్ణాలతో సహా మొత్తం 55 పతకాలు సాధించడం ద్వారా పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది.

పదో రోజున భారత్‌కు పతకాల వెల్లువ!
X

ప్రపంచ క్రీడాభిమానులను గత పదిరోజులుగా అలరిస్తూ వస్తున్న బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ ముగింపు దశకు చేరుకొన్నాయి. పోటీలు ముగియటానికి మరో 24 గంటలు మిగిలి ఉండగానే.. పదో రోజు పోటీలలో భారత అథ్లెట్లు బంగారు మోత మోగించారు. భారత్ 18 స్వర్ణాలతో సహా మొత్తం 55 పతకాలు సాధించడం ద్వారా పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది.

ట్రిపుల్ జంప్ లో డబుల్ థమాకా..

ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో భాగంగా జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత జోడీ ఎల్దోసీ పాల్, అబ్దుల్ అబుబాకర్ స్వర్ణ, రజత పతకాలతో సంచలనం సృష్టించారు. పాల్ 17.03 మీటర్ల దూరం ట్రిపుల్ జంప్ దూకి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్ గా నిలిచాడు. మరో జంపర్ అబ్దుల్లా 17.02 మీటర్ల రికార్డుతో రజత విజేతగా నిలిచాడు. మహిళల జావలిన్ త్రోలో అన్ను రాణి, పురుషుల 10 కిలోమీటర్ల రేస్ వాక్‌లో సందీప్ కుమార్ కాంస్య పతకాలు సాధించారు.


బాక్సింగ్‌లో మూడు స్వర్ణాలు..

మహిళల బాక్సింగ్ 50 కిలోల విభాగంలో నిఖత్ జరీన్, మినిమమ్ వెయిట్ విభాగంలో నీతు గంగాస్, పురుషుల ఫ్లైవెయిట్ విభాగంలో అమిత్ పంగల్ బంగారు పతకాలతో మెరిశారు. పురుషుల విభాగంలో సూపర్ హెవీవెయిట్ బాక్సర్ సాగర్ అహ్లావత్ రజతంతో సరిపెట్టుకొన్నాడు.


బ్యాడ్మింటన్ ఫైనల్లో సింధు,లక్ష్యసేన్...

బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు పీవీ సింధు చేరుకొంది. గత రెండు క్రీడల్లో కాంస్య, రజత పతకాలు సాధించిన సింధు ప్రస్తుత పోటీలలో బంగారు పతకానికి గురిపెట్టింది. కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు చేరడం సింధుకి ఇది వరుసగా రెండోసారి. పురుషుల సింగిల్స్ సెమీస్ లో విఫలమైన కిడాంబీ శ్రీకాంత్ కాంస్య పతకం దక్కించుకొన్నాడు. మహిళల డబుల్స్ లో ట్రీసా జోలీ- గాయత్రీ గోపీచంద్ జోడీ కాంస్య పతకంతో సరిపెట్టుకొన్నారు. పురుషుల డబుల్స్ ఫైనల్స్ కు భారత జంట సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి చేరుకొన్నారు. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు ఖాయమయ్యాయి. స్క్వాష్ మిక్సిడ్ డబుల్స్ లో భారత జట్టు సౌరవ్ గోశాల్- దీపిక పల్లికల్ కాంస్య పతకం సాధించారు.


టేబుల్ టెన్నిస్ లో..

టేబుల్ టెన్నిస్ మిక్సిడ్ డబుల్స్ లో శరత్ కమల్- ఆకుల శ్రీజ జోడీ బంగారు పతకం సాధించారు. పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు తెలుగు తేజం ఆచంట శరత్ కమల్ అర్హత సంపాదించాడు. అయితే పురుషుల డబుల్స్ లో సత్యన్ తో జంటగా శరత్ రజత పతకం సాధించాడు. ఫైనల్లో ఇంగ్లండ్ జోడీ పాల్ డ్రింక్ హాల్- లైమ్ పిచ్ ఫోర్డ్ ల చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల హాకీలో భారత్ కాంస్య పతకం దక్కించుకుంది. న్యూజిలాండ్ ను పెనాల్టీ షూటౌట్ లో భారత్ 2-1తో అధిగమించింది. ఆట నిర్ణిత సమయంలో రెండు జట్లూ చెరో గోల్ చేసి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. భారత కెప్టెన్ కమ్ గోల్ కీపర్ సవితపూనియా అసాధారణ ప్రతిభతో భారత్ 2016 తర్వాత తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్ పతకం సాధించగలిగింది.

ఆఖరి రోజున హాకీ సమరం..

కామన్వెల్త్ గేమ్స్ ఆఖరి రోజు పోటీలలో పురుషుల హాకీ బంగారు పతకం కోసం ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. బ్యాడ్మింటన్ మహిళల, పురుషుల సింగిల్స్ లో గోల్డ్ మెడల్ రౌండ్లో సింధు, లక్ష్యసేన్ పోటీపడనున్నారు.

First Published:  8 Aug 2022 11:37 AM IST
Next Story