Telugu Global
Sports

మన అశ్విన్..ఇక ప్రపంచ నంబర్ వన్!

భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు

మన అశ్విన్..ఇక ప్రపంచ నంబర్ వన్!
X

భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. ఇప్పటి వరకూ టాప్ ర్యాంక్ లో కొనసాగిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ యాండర్సన్ ను అధిగమించాడు....

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన భారత తొలి స్పిన్ బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ ఘనత సాధించాడు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం బౌలర్ నంబర్ వన్ గా నిలిచాడు.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆస్ట్ర్రేలియాతో ముగిసిన రెండోటెస్టులో 6 వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్ అరుదైన ఈ రికార్డును చేరుకోగలిగాడు.

ఇప్పటి వరకూ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న ఇంగ్లండ్ వెటరన్ పేస్ బౌలర్ జిమ్మీ యాండర్సన్ టాప్ ర్యాంక్ వారం రోజుల ముచ్చటగా ముగిసిపోయింది.

2023 సీజన్లో ఆడిన తొలి సిరీస్ మొదటి రెండుటెస్టుల్లోనే అశ్విన్ 14 వికెట్లతో 16.79 సగటు తో అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు.

గత రెండేళ్లలో 62 వికెట్ల అశ్విన్..

గత రెండు సంవత్సరాల కాలంలో 14 టెస్టులు ఆడిన అశ్విన్ మొత్తం 62 వికెట్లు సాధించాడు.అంతర్జాతీయ క్రికెట్లో గత రెండేళ్ల కాలంలో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన బౌలర్ గా అశ్విన్ నిలిచాడు.

అశ్విన్ తాను పడగొట్టిన ఒక్కో వికెట్ కు 18 పరుగులు మాత్రమే ఇస్తే..యాండర్సన్ వికెట్ కు 21 పరుగులు, నేథన్ లయన్ 28 పరుగుల చొప్పున ఇచ్చారు.

యాండర్సన్ 20 టెస్టుల్లో 74 వికెట్లు, నేథన్ లయన్ 18 టెస్టుల్లో 72 వికెట్లు, కిగీసో రబడ 14 టెస్టుల్లో 67 వికెట్లు, ఓలీ రాబిన్సన్ 16 టెస్టుల్లో 66 వికెట్లు సాధిస్తే అశ్విన్ మాత్రం 45 స్ట్ర్రయిక్ రేటు, 18.41 సగటుతో 14 టెస్టుల్లో 62 వికెట్లు పడగొట్టడం ద్వారా బౌలర్ నంబర్ వన్ గా అవతరించాడు.

కంగారూలపై అశ్విన్ వికెట్ల శతకం..

ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నాగపూర్, ఢిల్లీ వేదికలుగా ముగిసిన మొదటి రెండుటెస్టుల్లో నిలకడగా రాణించడం ద్వారా అశ్విన్ ..

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా 100 వికెట్లు సాధించిన భారత రెండో బౌలర్ గా అనీల్ కుంబ్లే తర్వాతిస్థానంలో నిలిచాడు. అంతేకాదు..స్వదేశీ సిరీస్ ల్లో 25సార్లు ఐదుకు పైగా వికెట్లు పడగొట్టడం ద్వారా కుంబ్లే రికార్డును సమం చేయగలిగాడు.

టెస్టు చరిత్రలో సొంతగడ్డపై అత్యధికంగా ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్ల చొప్పున 45 సార్లు సాధించిన ప్రపంచ రికార్డు శ్రీలంక స్పిన్ గ్రేట్ ముత్తయ్య మురళీధరన్ పేరుతో ఉంది.

ఆ తర్వాత 26సార్లు 5 వికెట్ల ఘనతతో రంగన్ హెరాత్ నిలిచాడు.

స్వదేశీ సిరీస్ ల్లో 320 వికెట్ల అశ్విన్...

స్వదేశీ టెస్టు సిరీస్ ల్లో 319 వికెట్లు సాధించిన షేన్ వార్న్ రికార్డును 320 వికెట్లతో అశ్విన్ అధిగమించాడు. సొంతగడ్డపై అత్యధిక వికెట్లు సాధించిన మొనగాళ్లలో ముత్తయ్య మురళీధరన్ ( 493 ), జేమ్స్ యాండర్సన్ ( 429 ), స్టువర్ట్ బ్రాడ్ ( 370 ), అనీల్ కుంబ్లే ( 350 ) మొదటి నాలుగు స్థానాలలో నిలిచారు.

ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్ ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా వంద వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు. 20 టెస్టుల్లో వికెట్ల శతకాన్ని పూర్తి చేయగలిగాడు. హర్భజన్ సింగ్ 18 టెస్టుల్లో 95 వికెట్లు, కుంబ్లే 20 టెస్టుల్లో 111 వికెట్లు సాధించారు.

31సార్లు 5 వికెట్ల అశ్విన్...

టెస్టుమ్యాచ్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్ల చొప్పున 31సార్లు పడగొట్టిన బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. టెస్టు చరిత్రలో జిమ్మీ యాండర్సన్ 32సార్లు సాధిస్తే , మురళీధరన్ 45సార్లు, హెరాత్ 26సార్లు పడగొట్టారు.

ఆస్ట్ర్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్సీ కేరీని క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో తన 450 వికెట్ సాధించగలిగాడు. కంగారూ టాపార్డర్ బ్యాటర్ మార్నుస్ లబుషేన్ ను అవుట్ చేయడం ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 700వ వికెట్ ను సైతం అశ్విన్ సొంతం చేసుకోగలిగాడు.

రవీంద్ర జడేజా డబుల్ ధమాకా...

ఇండోర్ టెస్టు తొలిరోజు ఆటలో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు, 5వేల పరుగులు సాధించిన 11వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. భారత ఆల్ టైమ్ గ్రేట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సరసన చోటు సంపాదించాడు.

ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కంగారూ టాపార్డర్ ఆటగాళ్లు ట్రావిడ్ హెడ్, ఉస్మాన్ క్వాజా, మార్నుస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ లను జడేజా పడగొట్టాడు.

34 సంవత్సరాల జడేజా క్రికెట్ మూడు ఫార్మాట్లలో కలిపి 298 ఇన్నింగ్స్ లో 500 వికెట్లు పడగొట్టడమే కాదు..5000కు పైగా పరుగులు సైతం సాధించగలిగాడు.

పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ 356 ఇన్నింగ్స్ లో 687 వికెట్లు, 9031 పరుగులు నమోదు చేశాడు.

గతంలోనే అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు, 5వేల పరుగుల రికార్డు సాధించిన దిగ్గజ ఆల్ రౌండర్లలో వాసిం అక్రం, జాక్ కలిస్, ఇమ్రాన్ ఖాన్, షకీబుల్ హసన్, షాహీద్ అఫ్రిదీ, డేనియల్ వెట్టోరీ, చమిందా వాస్, షాన్ పోలాక్, ఇయన్ బోథమ్, కపిల్ దేవ్ ఉన్నారు. ప్రస్తుత 2023 సీజన్ లో రవీంద్ర జడేజా అదే డబుల్ ఘనతను సొంతం చేసుకోగలిగాడు.

ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో 8వ స్థానంలో కొనసాగుతున్న జడేజా..ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో మాత్రం అగ్రస్థానంలో నిలవడం విశేషం.

First Published:  2 March 2023 9:26 AM IST
Next Story