Telugu Global
Sports

ప్రపంచకప్ లో చిరుజట్ల పెనువిజయాలు!

భారత్ వేదికగా జరుగుతున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో చిన్నజట్లు పెద్దజట్లపై విజయాలతో సంచలనాల పరంపర కొనసాగిస్తున్నాయి. మాజీ చాంపియన్ శ్రీలంకకు సైతం అప్ఘనిస్థాన్ 6వ రౌండ్లో ఝలక్ ఇచ్చింది.

ప్రపంచకప్ లో చిరుజట్ల పెనువిజయాలు!
X

భారత్ వేదికగా జరుగుతున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో చిన్నజట్లు పెద్దజట్లపై విజయాలతో సంచలనాల పరంపర కొనసాగిస్తున్నాయి. మాజీ చాంపియన్ శ్రీలంకకు సైతం అప్ఘనిస్థాన్ 6వ రౌండ్లో ఝలక్ ఇచ్చింది.

అంతర్జాతీయ క్రికెట్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వెస్టిండీస్, జింబాబ్వే, బంగ్లాదేశ్ లాంటి జట్లకు కాలం చెల్లినట్లుగా కనిపిస్తోంది. వైట్ బాల్ క్రికెట్లో రెండుసార్లు విశ్వవిజేత వెస్టిండీస్ గత 48 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా అర్హత సంపాదించలేకపోయింది. జింబాబ్వే సైతం నెదర్లాండ్స్, స్కాట్లాండ్ లాంటి జట్ల ముందు వెలవెలబోయింది.

వెస్టిండీస్ లేకుండా ఇదే మొదటిసారి....

వన్డే ప్రపంచకప్ అంటే గతంలో అరివీర భయంకర వెస్టిండీస్ జట్టు పేరే వినిపించేది. అయితే.. భారత్ వేదికగా జరుగుతున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ మాత్రం వెస్టిండీస్ లాంటి రెండుసార్లు విజేతగా నిలిచిన జట్టు లేకుండానే సాగిపోతోంది.

జింబాబ్వే వేదికగా ముగిసిన ప్రపంచకప్ అర్హత టోర్నీలో వెస్టిండీస్ విఫలమయ్యింది. కరీబియన్ జట్టును కంగు తినిపించడం ద్వారా నెదర్లాండ్స్ ప్రపంచకప్ ఫైనల్ రౌండ్లో పాల్గొనటానికి అర్హత సంపాదించింది.

దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ దెబ్బ....

ప్రపంచకప్ ఫైనల్ రౌండ్లో..పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ దశలో నెదర్లాండ్స్, అప్ఘనిస్థాన్ లాంటి చిరుజట్లు పెనువిజయాలతో కలకలం రేపాయి. లీగ్ టేబుల్ రెండోస్థానంలో కొనసాగుతున్న పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాను పసికూన నెదర్లాండ్స్ కంగు తినిపించింది. అంతేకాదు బంగ్లాదేశ్ లాంటి చిన్నజట్లలో పెద్దజట్టుకు సైతం డచ్ జట్టు షాకిచ్చింది.

రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఆరురౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి నెదర్లాండ్స్ 2 విజయాలతో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్ లాంటి పెద్దజట్లకంటే నెదర్లాండ్స్ మెరుగైన స్థితిలో ఉంది.

అప్ఘనిస్థాన్ రికార్డు విజయాలు...

భారత మాజీ కెప్టెన్ అజయ్ జడేజా మెంటార్ గా పసికూన అప్ఘనిస్థాన్ ప్రస్తుత ప్రపంచకప్ లో ఏకంగా మూడు విజయాలు సాధించడంతో పాటు 10 జట్ల లీగ్ టేబుల్ 5వ స్థానంలో కొనసాగుతోంది.

భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ జట్ల తరువాతి స్థానంలో నిలిచింది. ప్రపంచ మాజీ చాంపియన్లు పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ లాంటి జట్లు అప్ఘనిస్థాన్ కంటే దిగువనే ఉన్నాయి.

రౌండ్ రాబిన్ లీగ్ ప్రారంభ రౌండ్లలో ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లపై సంచలన విజయాలు సాధించిన అప్ఘనిస్థాన్ 6వ రౌండ్ పోరులో ప్రపంచ మాజీ చాంపియన్ శ్రీలంకను సైతం కంగు తినిపించింది.

అప్ఘన్ ఆల్ రౌండ్ షో........

పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన 6వరౌండ్ పోరులో అప్ఘనిస్థాన్ 7 వికెట్లతో శ్రీలంకపై మరో సంచలన విజయం నమోదు చేసింది.

242 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి సాధించింది.

రహ్మత్ షా 62, ఇబ్రహీం జడ్రాన్ 39 పరుగుల స్కోర్లతో తమజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు. అజంతుల్లా ఓమార్ జియా 73 పరుగుల నాటౌట్ స్కోరుతో టాప్ స్కోరర్ గా మిగిలాడు.

శ్రీలంక టాపార్డర్ వికెట్లు పడగొట్టిన మీడియం పేసర్ ఫజల్ హక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ప్రపంచకప్ చరిత్రలో నాలుగో విజయం...

ఐసీసీ వన్డే ప్రపంచకప్ చరిత్రలో మూడోసారి పాల్గొంటున్నఅప్ఘనిస్థాన్ కు ఇది నాలుగో విజయం. 2015 ప్రపంచకప్ లో స్కాట్లాండ్ పై వికెట్ తేడాతో నెగ్గిన అప్ఘనిస్థాన్ ప్రస్తుత 2023 ప్రపంచకప్ లో వరుసగా మూడో విజయాలు సాధించడం విశేషం.

రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఢిల్లీ వేదికగా ఇంగ్లండ్ పై 69 పరుగులు, చెన్నై వేదికగా పాకిస్థాన్ పై 8 వికెట్ల విజయాలు సాధించిన అప్ఘనిస్థాన్ పూణే వేదికగా శ్రీలంకను 7 వికెట్లతో అధిగమించగిలిగింది.

2015 ప్రపంచకప్ లో అప్ఘనిస్థాన్ ను 4 వికెట్లతోనూ, 2019 ప్రపంచకప్ లో 34 పరుగులతోనూ ఓడించిన శ్రీలంక..2023 ప్రపంచకప్ లో మాత్రం 7 వికెట్ల పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

అత్యధిక పరాజయాల శ్రీలంక...

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరాజయాలు పొందినజట్టుగా శ్రీలంక నిలిచింది. అప్ఘనిస్థాన్ చేతిలో ఎదురైన 7 వికెట్ల ఓటమితో శ్రీలంక ప్రస్తుత 6వ రౌండ్ మ్యాచ్ వరకూ 43 పరాజయాలు చవిచూసినట్లయ్యింది.

ఆ తర్వాత జింబాబ్వే 42, ఇంగ్లండ్ 37, పాకిస్థాన్ 36, న్యూజిలాండ్ 35, వెస్టిండీస్ 35 పరాజయాలతో ఉన్నాయి.

ప్రపంచకప్ లో అప్ఘనిస్థాన్ తన మొదటి 17 మ్యాచ్ ల్లో ఒకే ఒక్క గెలుపు సాధిస్తే...గత నాలుగుమ్యాచ్ ల్లోనే మూడు విజయాలు సాధించడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మిగిలిన 3 రౌండ్ల మ్యాచ్ ల్లోనూ అప్ఘనిస్థాన్ ఇదే జోరు కొనసాగించగలిగితే సెమీఫైనల్స్ చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.

First Published:  31 Oct 2023 5:37 AM GMT
Next Story