Telugu Global
Sports

ఐపీఎల్ -16లో లక్నో రికార్డు స్కోరు!

ఐపీఎల్ -16వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 38 మ్యాచ్ ల్లో అత్యధిక స్కోరు సాధించినజట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ నిలిచింది.

ఐపీఎల్ -16లో లక్నో రికార్డు స్కోరు!
X

ఐపీఎల్ -16లో లక్నో రికార్డు స్కోరు!

ఐపీఎల్ -16వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 38 మ్యాచ్ ల్లో అత్యధిక స్కోరు సాధించినజట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ నిలిచింది. పంజాబ్ కింగ్స్ పై 257 పరుగుల రికార్డు స్కోరుతో పాటు..56 పరుగుల భారీవిజయం సాధించింది...

ఐపీఎల్ 2023 డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో పరుగులు వెల్లువెత్తుతున్నాయి. 10 జట్లు, 70 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 38 మ్యాచ్ లు ముగిసే సమయానికి 257 పరుగుల రికార్డు స్కోరు సాధించిన జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ నిలిచింది.

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో ముగిసిన హైస్కోరింగ్ పోరులో లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బౌండ్రీల హోరు, సిక్సర్ల జోరుతో పాటు పరుగుల సునామీ సృష్టించారు.

బాదుడే బాదుడు...పరుగులే పరుగులు!

బ్యాటింగ్ కు అత్యంత అనువైన పిచ్ గా పేరుపొందిన మొహాలీ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

సమాధానంగా 258 పరుగుల రికార్డు లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఆతిథ్య పంజాబ్ 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండుజట్లు కలసి ఈమ్యాచ్ లో 458 పరుగులు నమోదు చేయడం మరో రికార్డుగా మిగిలిపోతుంది.

మేయర్స్ జోరు, స్టోయినిస్ హోరు...

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్ కైల్ మేయర్స్ సునామీ హాఫ్ సెంచరీతో కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్ 12 పరుగులకే వెనుదిరిగినా..వీరబాదుడు బ్యాటింగ్ తో మేయర్స్ ..పవర్ ప్లే ఓవర్లు ముగియకుండానే మెరుపు అర్థశతకం సాధించాడు.

ల‌క్నోను ప్రారంభ ఓవర్లలోనే ర‌బాడ దెబ్బ‌కొట్టాడు. ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్(12) ఆ త‌ర్వాత కైల్ మేయ‌ర్స్(54)ను ఔట్ చేశాడు. మేయ‌ర్స్ 20 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 54 పరుగుల స్కోరు సాధించాడు.

ఆ త‌ర్వాత క్రీజులోకి దిగిన ఆల్ రౌండర్ స్టోయినిస్ 40 బంతుల్లో 180 స్ట్రయిక్ రేటుతో 72 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టోయినిస్ మొత్తం 6 బౌండ్రీలు, 5 సిక్సర్లు బాదడం ద్వారా పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఆయుష్ బ‌దొని(43) సైతం బ్యాట్ ఝళిపించడంతో ల‌క్నో స్కోర్ 8 ఓవ‌ర్ల‌కే 100 పరుగుల మార్కును దాటిపోయింది. ఆట 16వ ఓవర్ ముగిసే సమయానికే 200 పరుగుల స్కోరును సైతం అధిగమించింది.

సీమర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన ..ఇన్నింగ్స్ ఆఖరి ( 20వ‌) ఓవ‌ర్లో దీప‌క్ హుడా(11) ఫోర్ కొట్టాడు. నాలుగో బంతికి షాట్ ఆడ‌బోయి నికోల‌స్ పూర‌న్(45) ఎల్బీగా ఔట‌య్యాడు. కృనాల్ పాండ్యా(5) బౌండ‌రీ బాదాడు. దాంతో, ల‌క్నో ఐదు వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగులు చేసింది. డెత్ ఓవర్లలో ఆఖ‌ర్లో నికోల‌స్ పూర‌న్(12) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడ‌డంతో లక్నో భారీ స్కోర్ నమోదు చేయగలిగింది.

మేయర్స్ 225.00, బదౌనీ 179.17, స్టోయినిస్ 180.00, పూరన్ 236.84 స్ట్ర్రయిక్ రేట్ తో శివమెత్తినట్లు ఆడడంతో పంజాబ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.

మార్కస్‌ స్టొయినిస్‌ (40 బంతుల్లో 72; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), కైల్‌ మయేర్స్‌ (24 బంతుల్లో 54; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (19 బంతుల్లో 45; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌), ఆయుష్‌ బదోని (43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారమే చేశారు.

పంజాబ్ బౌల‌ర్ల‌లో ర‌బాడ రెండు వికెట్లు, సామ్ క‌ర‌న్, లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ సింగ్ త‌లా ఒక వికెట్‌ పడగొట్టారు.

రెండో అత్యధిక టీమ్ స్కోరు....

లక్నో సాధించిన 257 పరుగులే ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరుగా రికార్డుల్లో చేరింది. రెండుజట్లు కలసి 458 పరుగులతో మూడో అత్యధికస్కోరు నమోదు చేయగలిగాయి. 45 బౌండ్రీలు, 22 సిక్సర్లతో భారీషాట్ల వర్షమే కురిసింది.

2010 సీజన్లో చెన్నై- రాజస్థాన్ రాయల్స్ పోరులో 69 ( 39 ఫోర్లు, 30 సిక్సర్లతో) అత్యధిక బౌండ్రీల రికార్డుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో లక్నో- పంజాబ్ జట్ల పోటీ నిలిచింది.

పంజాబ్ పోరాడినా తప్పని ఓటమి...

258 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన పంజాబ్ తొలిఓవర్ లోనే స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ నష్టపోయింది.

శిఖ‌ర్ ధావ‌న్(1) తో పాటు.... ఇంపాక్ట్ ప్లేయ‌ర్ ప్ర‌భుసిమ్రాన్ సింగ్(9) సైతం విఫ‌ల‌మ‌య్యాడు. మరోవైపు..అథ‌ర్వ తైడే(66)తో కలసి సికింద‌ర్ ర‌జా(36) 3వ వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు.

సూపర్ హిట్టర్ లివింగ్‌స్టోన్(23)ను లెగ్ స్పిన్నర్ ర‌వి బిష్ణోయ్ ఎల్బీగా పడగొట్టడంతో పంజాబ్ 152 పరుగుల స్కోరుకే ఐదు టాపార్డర్ వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది. మిడిలార్డర్ బ్యాటర్లలో ఆల్ రౌండర్ సామ్ క‌ర‌న్‌(21), జితేశ్ శ‌ర్మ‌(24), రాహుల్ చాహ‌ర్‌(0), ర‌బాడ ఒకరి తర్వాత ఒకరుగా వెనుదిరిగారు.

దీంతో పంజాబ్ 20 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే 201 పరుగుల స్కోరుకే ఆలౌటై..56 పరుగుల ఓటమి మూటగట్టుకొంది..లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అత్యధికంగా మొత్తం 9మంది బౌలర్లను ఉపయోగించడం కూడా మరో రికార్డుగా మిగిలిపోతుంది.

మొత్తం 8 రౌండ్లలో లక్నో సూపర్ జెయింట్స్ కు ఇది.. ఐదో విజయం కాగా.. పంజాబ్ కు 4వ ఓటమి. లక్నో10 పాయింట్లతో లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలువగలిగింది.

లక్నో భారీవిజయంలో ప్రధానపాత్ర వహించిన స్టోయినిస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

లక్నో బౌలర్లలో యష్‌ ఠాకూర్‌ 4, నవీన్‌ మూడు వికెట్లు పడగొట్టారు. రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ఈరోజు జరిగే డబుల్ హెడ్డర్ పోరులో కోల్‌కతాతో గుజరాత్‌, ఢిల్లీతో హైదరాబాద్‌ తలపడనున్నాయి.

First Published:  29 April 2023 4:13 PM IST
Next Story