లక్నో పిచ్ క్యూరేటర్ పై వేటు!
భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ లోని రెండో మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం క్యురేటర్ పై వేటు పడింది.
భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ లోని రెండో మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం క్యురేటర్ పై వేటు పడింది. చెత్త పిచ్ అంటు విమర్శలు రావడంతో ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం..క్యురేటర్ ను బలిపశువును చేసింది....
భారత్- న్యూజిలాండ్ జట్ల రెండో టీ-20 మ్యాచ్ కు వేదికగా నిలిచిన లక్నోలోని అటర్ బిహారీ వాజ్ పేయి స్టేడియం పిచ్ చర్చనీయాంశంగా మారింది. పరుగులు వెల్లువెత్తాల్సిన పిచ్ పైన స్పిన్నర్లు చెలరేగిపోటం, వికెట్లు టపటపారాలిపోడం, రెండు జట్లు కలసి 200 పరుగుల స్కోరు సాధించలేకపోడం విమర్శలకు తావిచ్చింది.
నాసిరకం పిచ్ తో విమర్శలు..
ధూమ్ ధామ్ టీ-20 మ్యాచ్ అంటే..బౌండ్రీలు, సిక్సర్ల హోరు, పరుగుల హోరుతో ఉండాలి. రెండుజట్లూ కలసి 350 నుంచి 400 వరకూ పరుగులు సాధించాలి. అయితే..ప్రస్తుత మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదికగా జరిగిన రెండోపోరులో..
బౌలర్ల హవా..ప్రధానంగా స్పిన్ బౌలర్ల జోరు కొనసాగింది.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో8 వికెట్లకు 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. కనీసం వంద పరుగుల స్కోరైనా నాసాధించలేకపోయింది. సమాధానంగా భారత్ మరో బంతి మిగిలి ఉండగా 4 వికెట్లు నష్టానికి లక్ష్యం చేరి 6 వికెట్ల విజయం సాధించింది.
భారత కెప్టెన్ ఘాటు విమర్శలు..
లక్నో స్టేడియం పిచ్ తనను షాక్ కు గురిచేసిందని మ్యాచ్ ముగిసిన అనంతరం భారత కెప్టెన్ హార్థిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు. టీ-20 మ్యాచ్ కోసం ఇంత నాసిరకం పిచ్ తయారు చేస్తారని తాను ఊహించలేదని వాపోయాడు.
దీంతో..ఆతిథ్య ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం నష్టనివారణ చర్యల్లో భాగంగా వికెట్ ను తయారు చేసిన క్యూరేటర్ ను ఉద్యోగం నుంచి తొలగించి..అపారఅనుభవం కలిగిన మరో క్యూరేటర్ సంజీవ్ కుమార్ అగర్వాల్ ను నియమించింది.
మితిమీరిన మ్యాచ్ లతోనే నాసికరం పిచ్..
లక్నో స్టేడియం వేదికగా గతంలో ఎన్నడూలేనన్నిక్రికెట్ టోర్నీలు, మ్యాచ్ లు జరిగాయని, వికెట్ నాసిరకంగా తయారు కావటానికి అదే కారణమంటూ ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం సమర్థించుకొంది. టీ-20 మ్యాచ్ కు తగ్గట్టుగా వికెట్ సిద్ధం చేయాలంటే ఎండవేడి, పొడివాతావరణం ఉండి తీరాలని..అయితే..ఆ రెండురకాల పరిస్థితులు లక్నోలో ప్రస్తుతం లేకుండాపోయాయని యూపీ క్రికెట్ సంఘం వివరణ ఇచ్చింది.
లక్నో వేదికగా గతంలో భారత్- దక్షిణాఫ్రికాజట్ల నడుమ నిర్వహించిన మ్యాచ్ లో పరుగుల మోత మోగిందని, భారీస్కోర్లు నమోదయ్యాయని..అదే పిచ్ పైన ప్రస్తుత సిరీస్ లోని టీ-20మ్యాచ్ ను నిర్వహించామని గుర్తు చేసింది.
పలు రకాల దేశవాళీ క్రికెట్ పురుషుల, మహిళల మ్యాచ్ లు నిర్వహించడంతోనే పిచ్ నాసిరకంగా మారిందని, ఈ పరిస్థితిని సరిదిద్దటానికి బీసీసీఐ చీఫ్ క్యురేటర్ తాపస్ చటర్జీతో నిరంతరం చర్చిస్తూ మెరుగైన పిచ్ కోసం సలహాలు, సూచనలు తీసుకొంటున్నట్లు ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం తెలిపింది.
మూడుమ్యాచ్ ల ప్రస్తుత టీ-20 సిరీస్ లోని తొలిపోరులో న్యూజిలాండ్ 21 పరుగులతో విజేతగా నిలిస్తే..రెండోమ్యాచ్ లో భారత్ 6 వికెట్ల విజయంతో సమఉజ్జీగా నిలిచింది.
సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి టీ-20 మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగనుంది.
ఐసీసీ టీ-20 తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నంబర్ వన్ జట్టుగా ఉంటే..న్యూజిలాండ్ ఐదవ ర్యాంక్ జట్టుగా ఉంది.