రికార్డుల రారాజు లయనల్ మెస్సీ!
ఈరోజు జరిగే టైటిల్ సమరంలో అర్జెంటీనా విజేతగా నిలిస్తే..మెస్సీ మరిన్ని కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయమని చెప్పాల్సిన పనిలేదు.
అర్జెంటీనా సాకర్ మాంత్రికుడు లయనల్ మెస్సీని జంట రికార్డులు ఊరిస్తున్నాయి. ఈరోజు జరిగే ప్రపంచకప్ ఫుట్ బాల్ ఫైనల్స్ మెస్సీ కెరియర్ లో ఆఖరి ప్రపంచకప్ కావడంతో అభిమానులు ఎక్కడలేని ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.....
ప్రపంచ ఫుట్ బాల్ అనగానే అర్జెంటీనా మాంత్రికుడు లయనల్ మెస్సీ, పోర్చుగల్ థండర్ క్రిస్టియానో రొనాల్డో మాత్రమే గుర్తుకు వస్తారు. అయితే..రొనాల్డోతో పోల్చిచూస్తే..ప్రపంచకప్ లో మెస్సీ పేరుతోనే పలు అరుదైన రికార్డులున్నాయి.
16 ఏళ్ల వయసు నుంచే...
16 సంవత్సరాల చిరుప్రాయంలోనే ప్రపంచకప్ బరిలో నిలిచిన లయనల్ మెస్సీ ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో చివరిసారిగా పోటీకి దిగడమే కాదు..నాయకుడిగా తనజట్టును ఫైనల్స్ కు చేర్చాడు.
గ్రూప్ లీగ్ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ వరకూ కేవలం తన ప్రతిభతోనే...అర్జెంటీనాను టైటిల్ సమరం వరకూ తీసుకొచ్చిన మెస్సీ వ్యక్తిగతంగానే 5 గోల్స్ సాధించడం ద్వారా గోల్డెన్ బూట్ రేస్ లో నిలిచాడు.
ఫైనల్లో పవర్ ఫుల్ ఫ్రాన్స్ ను అధిగమించగలిగితే..అర్జెంటీనా మూడోసారి విశ్వవిజేతగా నిలువగలిగితే ఫుట్ బాల్ ఆటగాడిగా మెస్సీ జీవితం చరితార్థమవుతుంది.
ఫైనల్లో మెస్సీ గోల్స్ సాధించడంతో పాటు తనజట్టును విశ్వవిజేతగా నిలుపగలిగితే..సాకర్ గ్రేట్లు పీలే, మారడోనాల సరసన నిలువగలుగుతాడు.
5 ప్రపంచకప్ లు- 11 గోల్స్...
గత రెండుదశాబ్దాలుగా జరుగుతూ వస్తున్న ఐదు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్న మెస్సీ..16 ఏళ్ల చిరుప్రాయంలో తొలి ప్రపంచకప్ ఆడితే..ప్రస్తుత 35 సంవత్సరాల వయసులో ఐదో ప్రపంచకప్ లో పోటీపడుతున్నాడు.
గత ఐదు ప్రపంచకప్ టోర్నీలలో 25 మ్యాచ్ లు ఆడటం ద్వారా మెస్సీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత టో్ర్నీ సెమీస్ వరకూ 11 గోల్స్ సాధించిన మొనగాడు మెస్సీ మాత్రమే.
ప్రస్తుత ప్రపంచకప్ ప్రారంభానికి ముందే రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ..తనజట్టును విజేతగా నిలిపితే అపూర్వంగా నిష్క్ర్రమించినట్లవుతుంది.
ఆరుగురి సరసన మెస్సీ...
ప్రపంచకప్ చరిత్రలో ఐదు వేర్వేరు టోర్నీలలో పాల్గొన్న 7వ ఆటగాడిగా మెస్సీ రికార్డుల్లో చేరాడు. మెస్సీతో పాటు క్రిస్టియానో రొనాల్డో సైతం ఐదోసారి ప్రపంచకప్ బరిలో నిలిచాడు. ఈ ఇద్దరు సూపర్ స్టార్లకు ముందే ఐదు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్న దిగ్గజాలలో ఆంటోనియో కార్బజాల్, లోథార్ మతయాస్, రఫా మార్కెజ్, యాండ్రెస్ గురుడాడో ఉన్నారు.
అయితే..ప్రపంచకప్ లో అత్యధికమ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన రికార్డు మెస్సీ పేరుతోనే ఉంది. ప్రస్తుత ప్రపంచకప్ సెమీస్ వరకూ మెస్సీ మొత్తం 18మ్యాచ్ ల్లో అర్జెంటీనాకు నాయకత్వం వహించాడు. 17 మ్యాచ్ లతో రఫా మార్కెజ్, 16 మ్యాచ్ లతో డియాగో మారడోనా ఆ తర్వాతి స్థానాలలో నిలిచారు.
ఆటగాడంటే మెస్సీనే...
ఫుట్ బాల్ క్రీడలో గోల్స్ చేయటమే కాదు..సహ ఆటగాళ్లు గోల్స్ సాధించడంలో ప్రధానపాత్ర వహించడంలో మెస్సీ తర్వాతే ఎవరైనా. ప్రపంచకప్ ఐదు టోర్నీలలోనూ
తన డ్రిబ్లింగ్ మ్యాజిక్ తో సహఆటగాళ్లు గోల్స్ చేయడంలో మెస్సీ సహకరించాడు.
మెస్సీ తర్వాతి స్థానాలలో పీలే, గ్రిగోర్ లాటో, మారడోనా, డేవిడ్ బెకామ్ నిలిచారు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ ల్లో మెస్సీ, పీలే చెరో ఆరుసార్లు సహఆటగాళ్లు గోల్స్ చేయటానికి సహకారం అందించారు.
పాలో మాల్డినీ తర్వాతి స్థానంలో మెస్సీ..
ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడుతూ ఎక్కువ సమయం మైదానంలో గడిపిన ఆటగాళ్లలో మెస్సీ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. పాలో మాల్డినీ మొత్తం 2వేల 217 నిముషాలపాటు ఫీల్డ్ లో ఉంటే..మెస్సీ 2వేల 194 నిముషాలతో ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు. ప్రస్తుత ప్రపంచకప్ ఫైనల్స్ లో పాల్గొనడం ద్వారా మాల్డినీ రికార్డును మెస్సీ అధిగమించే అవకాశం లేకపోలేదు.
ప్రపంచకప్ చరిత్రలో 20 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో గోల్స్ సాధించిన ఏకైక ఆటగాడు లయనల్ మెస్సీ మాత్రమ. ప్రపంచకప్ లో మెస్సీ తన తొలిగోల్ ను 16 సంవత్సరాల 180 రోజుల వయసులోనూ, 11వ గోల్ ను 35 సంవత్సరాల వయసులోనూ సాధించడం విశేషం.
ఈరోజు జరిగే టైటిల్ సమరంలో అర్జెంటీనా విజేతగా నిలిస్తే..మెస్సీ మరిన్ని కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయమని చెప్పాల్సిన పనిలేదు.