సాకర్ దిగ్గజానికి ఇదే ఆఖరి ప్రపంచకప్!
అర్జెంటీనా సాకర్ గ్రేట్, మిడ్ ఫీల్డ్ మాంత్రికుడు లయనల్ మెస్సీ తన మనసులో మాట బయటపెట్టాడు. దోహా వేదికగా వచ్చేనెలలో జరిగే 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీనే తన కెరియర్ లో ఆఖరి ప్రపంచకప్ అని ప్రకటించాడు.

అర్జెంటీనా సాకర్ గ్రేట్, మిడ్ ఫీల్డ్ మాంత్రికుడు లయనల్ మెస్సీ తన మనసులో మాట బయటపెట్టాడు. దోహా వేదికగా వచ్చేనెలలో జరిగే 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీనే తన కెరియర్ లో ఆఖరి ప్రపంచకప్ అని ప్రకటించాడు. తన దేశానికి ప్రపంచకప్ అందించటమే తన లక్ష్యమని చెప్పకనే చెప్పాడు....
ఆధునిక సాకర్ గ్రేట్, అర్జెంటీనా మిడ్ ఫీల్డ్ జనరల్ లయనల్ మెస్సీ..మరో కొద్దివారాల్లో ఖతర్ వేదికగా ప్రారంభంకానున్న 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీకి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు. తన కెరియర్ లో ఇదే ఆఖరి ప్రపంచకప్ టోర్నీగా ఉంటుందని ప్రకటించాడు.
సమకాలీన ప్రపంచ ఫుట్ బాల్ ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందిన మెస్సీ ఇప్పటికే నాలుగు ప్రపంచకప్ టోర్నీలలో తన దేశానికి ప్రాతినిథ్యం వహించినా...కనీసం ఒక్కసారీ అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలుపలేకపోయాడు.
2014లో చేజారిన టైటిల్..
తన కెరియర్ లో ఇప్పటికే నాలుగు వేర్వేరు ( 2006, 2010, 2014, 2018 ) ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్నాడు. 2014 టోర్నీలో మాత్రమే అర్జెంటీనాను ఫైనల్స్ కు చేర్చినా...టైటిల్ సమరంలో విజేతగా నిలుపలేకపోయాడు.
అర్జెంటీనా జట్టులో మెస్సీ ఒక్కడే ప్రపంచ మేటి ఆటగాడు కావడంతో ఆ జట్టు ప్రపంచస్థాయిలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. 2021లో అర్జెంటీనాను కోపా అమెరికాకప్ విజేతగా నిలిపిన మెస్సీ..ప్రస్తుత 2022 ప్రపంచకప్ టోర్నీలో సైతం తనజట్టుకు ట్రోఫీ అందించాలని కలలు కంటున్నాడు.
అర్జెంటీనాను మరోసారి విశ్వవిజేతగా నిలపడమే తన జీవితలక్ష్యమని భావిస్తున్న మెస్సీ..గత నాలుగు ప్రపంచకప్ టోర్నీలలో తనవంతుగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయాడు.
19 మ్యాచ్ ల్లో ఆరుగోల్స్...
2006 నుంచి 2018 ప్రపంచకప్ వరకూ నాలుగుటోర్నీలలో భాగంగా 19 మ్యాచ్ ల్లో పాల్గొన్న మెస్సీ కేవలం ఆరు గోల్స్ మాత్రమే సాధించాడు. తన సహఆటగాళ్లు గోల్స్ చేయటంలో కీలకపోత్ర పోషించే మెస్సీకి..మిడ్ ఫీల్డ్ జనరల్ గా పేరుంది. తనవంతుగా మాత్రం అర్జెంటీనాకు ఆరంటే ఆరు ప్రపంచకప్ గోల్స్ మాత్రమే అందిచిన రికార్డు మెస్సీకి ఉంది.2014 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో అర్జెంటీనా ను జర్మనీ కంగు తినిపించడంతో ప్రపంచకప్ ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి.
గాయం నుంచి పూర్తిగా కోలుకొన్న తాను ప్రస్తుతం అత్యుత్తమ ఫిట్ నెస్ తో ఉన్నానని, ప్రపంచకప్ కోసం ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు మెస్సీ తెలిపాడు.
మధ్యాసియా దేశం ఖతర్ వేదికగా నవంబర్ లో ప్రారంభంకానున్న 2022 ప్రపంచకప్ కోసం అర్జెంటీనా ఎదురుచూస్తోంది. నవంబర్ 22న సౌదీ అరేబియాతో జరిగే తన గ్రూప్ ప్రారంభపోటీతో టైటిల్ వేటను ప్రారంభించనుంది.
నవంబర్ 21 నుంచి డిసెంబర్ 8 వరకూ జరిగే ప్రపంచకప్ మహాసంగ్రామంలో మొత్తం 32 దేశాలజట్లు ఎనిమిది గ్రూపులుగా తలపడబోతున్నాయి. లాటిన్ అమెరికా దిగ్గజాలుగా పేరుపొందిన రెండుజట్లలో బ్రెజిల్ కు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన రికార్డు ఉంటే..అర్జెంటీనా రెండుసార్లు మాత్రమే ప్రపంచ చాంపియన్ కాగలిగింది.
రెండుసార్లు ( 1978, 1986 ) విన్నర్ గాను , మరోమూడుసార్లు రన్నరప్ గాను నిలిచిన ఘనత అర్జెంటీనాకు ఉంది.