Telugu Global
Sports

అర్జున్ ను స్వేచ్ఛగా ఆడనివ్వండి-సచిన్ వేడుకోలు!

రంజీట్రోఫీ అరంగేట్రం మ్యాచ్ లోనే తన కుమారుడు అర్జున్ టెండుల్కర్ శతకం బాదడంతో మాస్టర్ సచిన్ మురిసిపోతున్నాడు. అర్జున్ పైన ఒత్తిడి పెంచవద్దని, తన మానాన తనను ఆడుకోనివ్వండంటూ మీడియాను అర్ధించాడు.

అర్జున్ టెండుల్కర్
X

అర్జున్ టెండుల్కర్

రంజీట్రోఫీ అరంగేట్రం మ్యాచ్ లోనే తన కుమారుడు అర్జున్ టెండుల్కర్ శతకం బాదడంతో మాస్టర్ సచిన్ మురిసిపోతున్నాడు. అర్జున్ పైన ఒత్తిడి పెంచవద్దని, తన మానాన తనను ఆడుకోనివ్వండంటూ మీడియాను అర్ధించాడు....

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాడు. ముంబై నుంచి గోవా క్రికెట్ సంఘానికి వలస రావడంతోనే అర్జున్ దశ తిరిగిపోయింది.

గోవాజట్టులో కీలక సభ్యుడిగా మారిన అర్జున్..ప్రస్తుత సీజన్ విజయ్ హజారే టోర్నీలో బౌలర్ గా సత్తా చాటుకొన్నాడు. ఇక రంజీట్రోఫీలో తన అరంగేట్రం మ్యాచ్ లోనే అర్జున్ మెరుపు సెంచరీతో ఆకట్టుకొన్నాడు.

రాజస్థాన్ తో జరిగిన రంజీమ్యాచ్ లో 7వ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన అర్జున్ టెండుల్కర్ 207 బంతులు ఎదుర్కొని 120 పరుగుల స్కోరు సాధించాడు. అర్జున్ శతకంలో 16 బౌండ్రీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. అర్జున్ బాధ్యతాయుత శతకంతో గోవా తన తొలిఇన్నింగ్స్ లో 547 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.

1988లో సచిన్- 2022లో అర్జున్...

1988లో సచిన్ టెండుల్కర్ తన తొలిరంజీమ్యాచ్ లోనే గుజరాత్ ప్రత్యర్థిగా సెంచరీ బాదడం ద్వారా చరిత్ర సృష్టిస్తే...34 సంవత్సరాల అనంతరం సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ సైతం 2022-23 రంజీ లీగ్ లో భాగంగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గోవాజట్టులో సభ్యుడిగా తన తొలి శతకం సాధించగలిగాడు. రంజీ అరంగేట్రం మ్యాచ్ లోనే

సెంచరీ సాధించడం ద్వారా..తన తండ్రి సరసన నిలువగలిగాడు. సచిన్ 16 సంవత్సరాల చిరుప్రాయంలో రంజీ తొలిశతకం బాదితే..అర్జున్ మాత్రం 23 సంవత్సరాల వయసులో సెంచరీ చేయగలిగాడు.

మీడియాకు సచిన్ విన్నపం...

దేశవాళీ రంజీట్రోఫీ టోర్నీలో అర్జున్ తన తొలి శ‌త‌కం సాధించడం పట్ల స‌చిన్ ఆనందం వ్య‌క్తం చేశాడు. మ్యాచ్ తొలి రోజున తనకు, అర్జున్‌కు మధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ను మీడియాతో పంచుకొన్నాడు. 'సెంచ‌రీ కోసం ప్ర‌య‌త్నించు. నువ్వు శ‌త‌కం సాధించ‌గ‌ల‌న‌ని నమ్మితే ఆ లక్ష్యాన్ని చేరుకో' అని అర్జున్‌తో అన్నాడ‌ట‌. అంతేకాదు అర్జున్ చిన్న‌నాటి రోజుల‌ను సైతం స‌చిన్ గుర్తు చేసుకున్నాడు.

'అర్జున్ అంద‌రిలా బాల్యాన్ని ఆస్వాదించలేకపోయాడని, దానికి కారణం తానేనని వాపోయాడు. ఓ సెలబ్రిటీ క్రికెట‌ర్ కుమారుడు కావ‌డంతో అర్జున్ బాల్యంలో చాలా సరదాలు, స్వేచ్ఛకు దూరం కావాల్సి వచ్చిందని, చిన్న‌వ‌య‌సులో అది నిజంగా చాలా కష్టమని, 2013లో తన రిటైర్మెంట్ తర్వాత ముంబైలో మీడియాతో అర్జున్‌ను క్రికెట్‌తో ప్రేమ‌లో ప‌డ‌నివ్వండి, తన మానాన తనను ఆడుకోనివ్వండంటూ అభ్యర్థించానని గుర్తు చేసుకొన్నాడు.

హేమాహేమీలున్న ముంబై జ‌ట్టు త‌ర‌ఫున రంజీల్లో ఆడే అవ‌కాశం రాక‌పోడంతో అర్జున్ ఈ ఏడాది మొద‌ట్లోనే గోవాకు వలస వ‌చ్చాడు. బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్‌గా తుది జ‌ట్టులో చోటు సంపాదించాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆడాల‌నే క‌ల‌ను నెర‌వేర్చ‌కున్నాడు. అరంగ్రేట్రం మ్యాచ్ లోనే రంజీ సెంచరీ సాధించగలిగాడు.

పదే పదే తనతో అర్జున్ ను పోల్చి..ఒత్తిడికి గురి చేయవద్దంటూ మీడియాకు సచిన్ మొరపెట్టుకొన్నాడు.

First Published:  16 Dec 2022 12:18 PM IST
Next Story