కుంబ్లేను మించిన కుల్దీప్!
వైట్ బాల్ క్రికెట్లో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ జోరు కొనసాగుతోంది. ఆసియాకప్ సూపర్ -4 రౌండ్ మొదటి రెండుమ్యాచ్ ల్లోనే 9 వికెట్లు పడగొట్టడం ద్వారా..ఆల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్ అనీల్ కుంబ్లేను అధిగమించాడు.
వైట్ బాల్ క్రికెట్లో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ జోరు కొనసాగుతోంది. ఆసియాకప్ సూపర్ -4 రౌండ్ మొదటి రెండుమ్యాచ్ ల్లోనే 9 వికెట్లు పడగొట్టడం ద్వారా..ఆల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్ అనీల్ కుంబ్లేను అధిగమించాడు.
వైట్ బాల్ ( టీ-20, వన్డే) క్రికెట్లో భారత తురుపుముక్క కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ కొనసాగుతోంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా జరుగుతున్న 2023 ఆసియాకప్ టోర్నీలో కుల్దీప్ యాదవ్ సూపర్ -4 రౌండ్ రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.
పాకిస్థాన్ పై 25 పరుగులకే 5 వికెట్లు...
కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఏకపక్షంగా సాగిన సూపర్-4 తొలిమ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ విశ్వరూపమే ప్రదర్శించాడు.
పాకిస్థాన్ ప్రత్యర్థిగా 5 వికెట్లు పడగొట్టిన భారత 5వ బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.
పాక్ టాపార్డర్ ఆటగాళ్లు ఫకర్ జమాన్, అగా సల్మాన్, ఇఫ్తీకార్ అహ్మద్, షదాబ్ ఖాన్. ఫహీం అష్రాఫ్ లు కుల్దీప్ మాయాజాలంలో గల్లంతయ్యారు. కుల్దీప్ 8 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
గతంలో పాకిస్థాన్ ప్రత్యర్థిగా 5 వికెట్లు పడగొట్టిన సౌరవ్ గంగూలీ, అర్షద్ అయూబ్, వెంకటేశ్ ప్రసాద్, సచిన్ టెండుల్కర్ ల సరసన కుల్దీప్ నిలిచాడు.
అంతేకాదు..ఆసియాకప్ లో 5 వికెట్లు పడగొట్టిన అకిబ్ జావేద్, అర్షద్ అయూబ్ ల సరసన కుల్దీప్ చోటు సంపాదించాడు.
శ్రీలంకపైన 4 వికెట్లు...
సూపర్ -4 రెండోరౌండ్లో శ్రీలంకతో జరిగిన పోరులో సైతం కుల్దీప్ చెలరేగిపోయాడు. 43 పరుగులకే 4 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత్ కు 41 పరుగుల కీలక విజయం అందించడంతో పాటు ఫైనల్స్ చేరడంలో తనవంతుపాత్ర నిర్వర్తించాడు.
తన వన్డే కెరియర్ లో ప్రస్తుత శ్రీలంక మ్యాచ్ వరకూ 88 ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసిన కుల్దీప్ అత్యంత వేగంగా 150 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు.
అత్యంత వేగంగా 150 వికెట్లు పడగొట్టిన భారత రెండోబౌలర్ గా నిలిచాడు.
షమీ తర్వాతి స్థానంలో కుల్దీప్...
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కేవలం 80 వన్డేలలోనే 150 వికెట్లు సాధించిన ఫాస్టెస్ట్ బౌలర్ గా ఉన్నాడు. కుల్దీప్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
పాక్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ 78 వన్డేలలోనే 150 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఇప్పటి వరకూ స్పిన్ దిగ్గజం అనీల్ కుంబ్లే పేరుతో ఉన్న అత్యంతవేగంగా 150 వికెట్ల భారత స్పిన్నర్ రికార్డును కుల్దీప్ దక్కించుకొన్నాడు. కుంబ్లే 106 వన్డేలలో 150 వికెట్ల మైలురాయిని చేరితే...కుల్దీప్ మాత్రం 88 వన్డేలలోనే ఈ ఘనతను సాధించగలిగాడు.
అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన భారత దిగ్గజ బౌలర్లలో షమీ, కుల్దీప్ తర్వాతి స్థానాలలో పలువురు భారత బౌలర్లు ఉన్నారు.
అజిత్ అగార్కర్ 97 వన్డేలలోనూ, జహీర్ ఖాన్ 103, కుంబ్లే, ఇర్ఫాన్ పఠాన్ 106 వన్డేలలోనూ, రవిచంద్రన్ అశ్విన్ 111, అశీశ్ నెహ్రా 113, జవగళ్ శ్రీనాథ్ 115, హర్భజన్ సింగ్ 122, మనోజ్ ప్రభాకర్ 123, వెంకటేశ్ ప్రసాద్ 126, కపిల్ దేవ్ 128, రవీంద్ర జడేజా 129 వన్డేలలోనూ 150 వికెట్లు సాధించగలిగారు.
ప్రస్తుత ఆసియాకప్ ఫైనల్ తో పాటు..2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో సైతం భారత కీలక స్పిన్నర్ ఎవరంటే కుల్దీప్ యాదవ్ మాత్రమే.