Telugu Global
Sports

రోహిత్ శర్మకు హోంగ్రౌండ్లో 'నాకౌట్ టెన్షన్'!

వన్డే ప్రపంచకప్ లీగ్ దశలో జట్టును ముందుండి నడిపించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు హోంగ్రౌండ్ ముంబై వాంఖడే స్టేడియంలో సెమీఫైనల్ నాకౌట్ టెన్షన్ మొదలయ్యింది....

రోహిత్ శర్మకు హోంగ్రౌండ్లో నాకౌట్ టెన్షన్!
X

వన్డే ప్రపంచకప్ లీగ్ దశలో జట్టును ముందుండి నడిపించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు హోంగ్రౌండ్ ముంబై వాంఖడే స్టేడియంలో సెమీఫైనల్ నాకౌట్ టెన్షన్ మొదలయ్యింది....

భారతజట్టును మూడోసారి విశ్వవిజేతగా నిలపాలని కలలుకంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ హోంగ్రౌండ్ ముంబై వాంఖడే స్టేడియంలో అసలు సిసలు పరీక్ష ఎదుర్కొన బోతున్నాడు.

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ కు సారధిగా తొమ్మిదికి తొమ్మిది విజయాలు అందించిన రోహిత్ ఇటు డాషింగ్ ఓపెనర్ గాను ..అటు కెప్టెన్ గానూ సత్తా చాటుకొన్నాడు.

పవర్ ప్లేలో 'పవర్ హిట్టింగ్ 'తో....

ప్రస్తుత ప్రపంచకప్ పవర్ ప్లే ( మొదటి 10 ) ఓవర్లలో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాటర్ గా రికార్డుల మోత మోగించిన రోహిత్ మొత్తం 9 రౌండ్ల లీగ్ మ్యాచ్ ల్లో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో సహా 503 పరుగులు సాధించాడు. సహఓపెనర్ శుభ్ మన్ గిల్ తో కలసి నాలుగు సెంచరీ భాగస్వామ్యాల రికార్డు నమోదు చేశాడు.

లీగ్ దశలో తన హోంగ్రౌండ్ ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కేవలం 4 పరుగుల స్కోరుకే వెనుదిరిగిన రోహిత్..న్యూజిలాండ్ తో ఈ రోజు జరిగే సెమీఫైనల్స్ నాకౌట్ పోరులో భారీస్కోరు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

భారత్ ఇప్పటికే మూడుసార్లు 350కి పైగా స్కోర్లు సాధించడంలో ప్రధానపాత్ర వహించిన రోహిత్..నాకౌట్ రౌండ్లోనూ అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు.

2011 నుంచి 2023 వరకూ....

భారతజట్టు రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన 2011 వన్డే ప్రపంచకప్ తుదిజట్టులో చోటు దక్కని రోహిత్..ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్ టోర్నీలలో నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. 2019 ప్రపంచకప్ టోర్నీలో వరుసగా ఐదు సెంచరీలు సాధించడం ద్వారా ప్రపంచ రికార్డే నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో

భారతజట్టుకు తిరుగులేని నాయకుడుగా నిలిచాడు.

తాను పుట్టి, పెరిగిన, క్రికెటర్ గా ఎదిగిన హోంగ్రౌండ్ ముంబై వాంఖడే స్టేడియంలో ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రపంచకప్ సెమీఫైనల్లో తనజట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

వ్యక్తిగత రికార్డులు కాదు..ట్రోఫీనే ప్రధానం....

రోహిత్ శర్మ వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యమిస్తూ తనజట్టును రికార్డు విజయాలతో సెమీస్ కు చేర్చడంలో ప్రధానపాత్ర వహించాడు.

తన హోంగ్రౌండ్ వేదికగా ఆడిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో విఫలమైన రోహిత్..న్యూజిలాండ్ తో జరిగే సెమీఫైనల్స్ నాకౌట్ పోరులో మాత్రం పూర్తిస్థాయిలో చెలరేగిపోవాలన్న కసితో ఉన్నాడు.

తన కెరియర్ లో ముంబై వేదికగా టెస్టు శతకం మాత్రమే సాధించిన రోహిత్ కు వన్డే మ్యాచ్ ల్లో మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్లు దక్కలేదు.

2006 నుంచి రోహిత్ దూకుడు...

2006 రంజీట్రోఫీ సూపర్ లీగ్ మ్యాచ్ లో గుజరాత్ ప్రత్యర్థిగా 267 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్లతో 205 పరుగులు సాధించడం ద్వారా భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన రోహిత్ ఆ తర్వాత మరివెనుదిరిగి చూసింది లేదు.

2007 సీజన్లో ముంబై టీ-20 జట్టులో సభ్యుడిగా అరంగేట్రం చేసిన రోహిత్ 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో పాటు 37 బంతుల్లో 40 పరుగుల స్కోరు సాధించాడు.

ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ జట్టుకు ఆడిన రోహిత్ 2011 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై 87, రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల స్కోర్లను వాంఖడే స్టేడియం వేదికగానే సాధించాడు.

2012లో తొలి అంతర్జాతీయ మ్యాచ్..

2012లో ఇంగ్లండ్ తో టీ-20 సిరీస్ ద్వారా..రోహిత్ తన హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియంలో తొలిఅంతర్జాతీయ మ్యాచ్ ఆడి 24 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగాడు.

2013 సీజన్లో వాంఖడే స్టేడియం వేదికగానే ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా తొలి ఐపీఎల్ ట్రోఫీ అందించిన రోహత్..మాస్టర్ సచిన్ టెండుల్కర్ వీడ్కోలు టెస్టులో వెస్డిండీస్ పై భారత శతకం సాధించాడు. 11 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 111 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.

2016 టీ-20 ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్ తో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో31 బంతుల్లో రోహిత్ 43 పరుగులు సాధించినా భారతజట్టుకు ఓటమి తప్పలేదు.

ఆ తర్వాత మూడేళ్లకు వెస్టిండీస్ జట్టు ప్రత్యర్థిగానే వాంఖడే స్టేడియంలో ఆడిన టీ-20 సిరీస్ మ్యాచ్ లో 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు సాధించడం ద్వారా భారత్ ను సిరీస్ విజేతగా నిలిపాడు.

2017లో ముంబై వేదికగానే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సైతం తనజట్టును విజేతగా నిలిపాడు.

వాంఖడేలో 34 విజయాలు, 19 పరాజయాలు..

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా రోహిత్ శర్మ ముంబై, భారత జట్లకు నాయకత్వం వహించిన 54 మ్యాచ్ ల్లో 34 విజయాలు, 19 పరాజయాల రికార్డు సాధించాడు.

హోంగ్రౌండ్లో ఆడిన ఒకే ఒక్క టెస్టులో 111 నాటౌట్ స్కోరు సాధించిన రోహిత్, మూడు వన్డేలలో 20 అత్యధిక స్కోరుతో 46 సగటు మాత్రమే నమోదు చేయగలిగాడు.

ఆడిన నాలుగు టీ-20 మ్యాచ్ ల్లో 71 పరుగుల అత్యధిక స్కోరుతో 41.25 సగటు సాధించాడు. ఐపీఎల్ లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆడిన 73 మ్యాచ్ ల్లో 2020 పరుగులతో 33.11 సగటు నమోదు చేశాడు. 94 పరుగుల అత్యధిక స్కోరు మాత్రమే సాధించగలిగాడు.

అంతర్జాతీయ వన్డేలలో 20 పరుగులే అత్యధిక స్కోరు...

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆడిన అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ల్లో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోరు 20 పరుగులకే పరిమితమయ్యింది. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 16 పరుగులు, 2017లో న్యూజిలాండ్ పై 20 పరుగులు, 2020 సిరీస్ లో భాగంగా ఆస్ట్ర్రేలియాతో ఆడిన మ్యాచ్ లో 10 పరుగుల స్కోర్లకు అవుటయ్యాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కేవలం 4 పరుగుల స్కోరుకే పేస్ బౌలర్ మధుశంక బౌలింగ్ లో రోహిత్ అవుటయ్యాడు. న్యూజిలాండ్ తో ఈరోజు జరిగే సెమీఫైనల్స్ నాకౌట్ పోరులో రోహిత్ స్థాయికి తగ్గట్టుగా ఆడి హోంగ్రౌండ్లో భారీస్కోరు లేని లోటును పూడ్చుకోవాలని కోరుకొందాం.

First Published:  15 Nov 2023 9:26 AM IST
Next Story