Telugu Global
Sports

కిట్ లేకుండానే గ్రౌండ్‌కు కేఎల్ రాహుల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌కు ఐదు నిమిషాల ముందు కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకున్నారు.

కిట్ లేకుండానే గ్రౌండ్‌కు కేఎల్ రాహుల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
X

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోని క్రికెట్ అభిమానులకు పండగే. ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా జరగలేదు. ఇక సూపర్ 4లో ఇరు జట్లు తలపడినా.. వర్షం కారణంగా రిజర్వ్ డేకు మారింది. కాగా, ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌కు అనూహ్యంగా చోటు దక్కింది. వాస్తవానికి కేఎల్ రాహుల్ హోటల్ నుంచి ఖాళీ చేతులతోనే స్టేడియంకు చేరుకున్నాడు. ఎలాగో ఈ మ్యాచ్‌లో డ్రింక్స్ అందించడమే నా పని కదా.. ఇక కిట్ ఎందుకు అని బ్యాగ్‌ను హోటల్‌లోనే ఉంచేసి వచ్చినట్లు కేఎల్ రాహుల్ చెప్పాడు.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌కు ఐదు నిమిషాల ముందు కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకున్నారు. తొలుత శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవాలని భావించినా.. ఫిట్‌నెస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న అయ్యర్‌ను పక్కన పెట్టి.. అప్పటికప్పుడు రాహుల్‌కు జట్టులో చోటు కల్పించారు. ఈ విషయాన్ని కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ ఐదు నిమిషాల ముందే రాహుల్‌కు చెప్పారు. దీంతో రాహుల్ ఒక్కసారిగా ఆందోళన చెందినట్లు చెప్పాడు. టీమ్ మేనేజర్‌ను వెంటనే హోటల్ రూమ్‌కు వెళ్లి కిట్ తీసుకొని రావాలని పురమాయించాడు.

మ్యాచ్ స్టార్ అయిన తర్వాత కూడా కేఎల్ రాహుల్ కిట్ రాలేదు. ఓపెనర్లు రోహిల్, గిల్ భారీ భాగస్వామ్యం అందించడంతో వెంటనే రాహుల్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక మేనేజర్ ఎలాగో అలా కష్టపడి రాహుల్ కిట్ బ్యాగ్‌ను గ్రౌండ్‌కు తీసుకొని వచ్చాడు. దీంతో రాహుల్ కాస్త ఊరట చెందినట్లు చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ ఏకంగా సెంచరీ బాదడం విశేషం. అయితే మరో ఎండ్‌లో కోహ్లీ కూడా సెంచరీతో చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ చేసినా.. మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం కోహ్లీకి దక్కింది. మొత్తానికి కేఎల్ రాహుల్ కిట్ వ్యవహారం అలా ముగిసింది.

కిట్ త్వరగా రాలేదనే ఆందోళన, పాకిస్తాన్‌తో మ్యాచ్ అనే ఉత్కంఠతో క్రీజ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత కాసేపు ఒత్తిడికి గురయ్యానని కేఎల్ రాహుల్ చెప్పాడు. అయితే నన్ను నేను శాంతపరుచుకొని, నిలదొక్కుకోవడానికి 10 నుంచి 15 బాల్స్ అవసరమయ్యాయని అన్నాడు. ఒకటి రెండు బౌండరీలు బాదిన తర్వాత కుదుటపడ్డానని.. ఆ తర్వాత ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఆడానని కేఎల్ రాహుల్ చెప్పాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆడిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేయడం తనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అన్నాడు.

First Published:  13 Sept 2023 7:09 AM IST
Next Story