రాహుల్ ఫిట్...శ్రేయస్ అయ్యర్ డౌట్!
గాయాలతో భారతజట్టుకు దూరమైన కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరే కోలుకొని గాడిలో పడుతున్నారు. ఐర్లాండ్ సిరీస్ కు బుమ్రా సిద్ధమయ్యితే,ఆసియాకప్ కు తాను రెడీ అని వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ప్రకటించాడు.
గాయాలతో భారతజట్టుకు దూరమైన కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరే కోలుకొని గాడిలో పడుతున్నారు. ఐర్లాండ్ సిరీస్ కు బుమ్రా సిద్ధమయ్యితే,ఆసియాకప్ కు తాను రెడీ అని వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ప్రకటించాడు....
గాయాలు ఆటలో భాగం. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ సిరీస్ వెంట సిరీస్ ఆడుతూ, ఆరునూరైనా ఐపీఎల్ లో ఆడేస్తూ వస్తున్న భారత ప్రధాన క్రికెటర్లు గాయాలబారిన పడి కీలక సమయాలలో జట్టుకు అందుబాటులో లేకుండా పోతున్నారు.
బుమ్రా నుంచి రాహుల్ వరకూ....
భారత అమ్ములపొదిలో ప్రధాన అస్త్రం , యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయంతో టీ-20 ప్రపంచకప్ నుంచి ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్ పోరు వరకూ జట్టుకు అందుబాటులో లేకుండా పోడంతో భారత్ భారీమూల్యమే చెల్లించాల్సి వచ్చింది.
గత ఐదుమాసాలుగా పూర్తి విశ్రాంతితో తిరిగి ఫిట్ నెస్ సాధించిన బుమ్రాను ఐర్లాండ్ తో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ కు కెప్టెన్ గా భారత టీమ్ మేనేజ్ మెంట్ ఎంపిక చేసింది.
కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సైతం పలు శస్త్ర్రచికిత్సల అనంతరం కోలుకొని బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపింగ్ లోనూ సాధన మొదలు పెట్టినట్లు బీసీసీఐ ప్రకటించింది.
మరోవైపు..వన్డేలలో భారత ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ సైతం పూర్తిగా కోలుకొని సాధన చేస్తున్నట్లు ప్రకటించారు. 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా త్వరలో జరిగే ఆసియాకప్ టోర్నీలో పాల్గొనే భారతజట్టులో తిరిగి రాహుల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ -16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా వ్యవహరిస్తూ కాలిమడం గాయంతో ఐపీఎల్ తో పాటు భారతజట్టుకూ దూరమైన రాహుల్ ఆపరేషన్ అనంతరం కోలుకొని నూటికి నూరుశాతం ఫిట్ నెస్ సాధించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
తాను బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపింగ్ చేస్తున్న చిత్రాలను అభిమానులతో పంచుకొన్నాడు.
రాహుల్ రాకతో.....
ఆగస్టు 30 నుంచి శ్రీలంక, పాక్ దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న ఆసియాకప్ టోర్నీలో పాల్గొనే భారత వన్డేజట్టుకు రాహుల్ అందుబాటులోకి వచ్చాడు.
రాహుల్ రాకతో స్టాప్ గ్యాప్ వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లకు చోటు లేకుండా పోయే ప్రమాదం వచ్చి పడింది.
అయితే..మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మాత్రం ఆసియాకప్ కు అందుబాటులో ఉండే అవకాశంలేదని బోర్డు భావిస్తోంది. గాయాల నుంచి తేరుకొంటున్న ఆటగాళ్ళందరూ బెంగళూరులోని భారత క్రికెట్ అకాడమీ నిపుణుల పర్యవేక్షణలో స్ట్రెంత్ అండ్ ఫిట్ నెస్ కార్యక్రమాలతో పాటు క్రికెట్ ప్రాక్టీసులో సైతం పాల్గొంటున్నట్లు జులై 21న బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్ తో ఐర్లాండ్ గడ్డపై జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ ద్వారా బుమ్రా రీఎంట్రీ చేయనున్నాడు. ఆసియాకప్ ద్వారా కెఎల్ రాహుల్, అక్టోబర్ లో జరిగే వన్డే ప్రపంచకప్ ద్వారా శ్రేయస్ అయ్యర్ పూర్తిస్థాయిలో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.
భారతజట్టుకు కీలకం కెఎల్ రాహుల్...
రిషభ్ పంత్, కెఎల్ రాహుల్ లాంటి ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు గాయాలతో జట్టుకు దూరమవడంతో క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారత్ ఎంతో నష్టపోయింది. 50 ఓవర్ల వన్డే ఫార్మాట్లో 5వ డౌన్ లో బ్యాటింగ్ చేస్తూ భారత బ్యాటింగ్ ఆర్డర్ కే రాహుల్ సమతౌల్యాన్ని తీసుకు వచ్చాడు.
రాహుల్ 5వ డౌన్ లో ఆడిన 18 వన్డేలలో 742 పరుగులతో 53.00 సగటు నమోదు చేశాడు. 99.33 స్ట్ర్రయిక్ రేట్ తో ఓ సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలు సాధించిన ఘనమైన రికార్డు కూడా రాహుల్ కు ఉంది.
ప్రస్తుత 2023 సీజన్లో రాహుల్ రెండు టెస్టులు ఆడి మూడు ఇన్నింగ్స్ లో 38 పరుగులు మాత్రమే చేసి తీవ్రవిమర్శలు ఎదుర్కొన్నాడు. వన్డేలలో మాత్రం 6 ఇన్నింగ్స్ లో 226 పరుగులు, 56.50 సగటుతో పర్వాలేదని పించాడు. 75 నాటౌట్ స్కోరుతో రెండు హాఫ్ సెంచరీలు సైతం నమోదు చేశాడు.
2022 క్రికెట్ సీజన్లో రాహుల్ మొత్తం 30 మ్యాచ్ లు ఆడి 822 పరుగులు సాధించాడు. 33 ఇన్నింగ్స్ లో 9 హాఫ్ సెంచరీలతో 25.68 సగటు నమోదు చేశాడు.
ఆడిన నాలుగు టెస్టుల్లో 8 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన రాహుల్ 137 పరుగులతో 17.12 సగటు నమోదు చేశాడు.
వన్డేలలో 251 పరుగులతో 28.03 సగటుతో అరడజను హాఫ్ సెంచరీలు సాధించాడు. మిడిలార్డర్ కు వెన్నెముక లాంటి రాహుల్, శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోడంతో భారత్ గత కొద్దిమాసాలుగా తీవ్రఇబ్బందులు ఎదుర్కొంది.
ప్రపంచకప్ నాటికి గాయాలబారిన పడిన ప్రధాన ఆటగాళ్లంతా అందుబాటులోకి వస్తే..మూడోసారి వన్డే విశ్వవిజేతగా భారత్ నిలవడం ఏమంత కష్టం కాబోదు.