Telugu Global
Sports

గ్రామీణ యువతకు కూడుపెడుతున్న కబడ్డీ!

దేశవాళీ క్రీడ కబడ్డీ దేశంలోని పలు రాష్ట్ర్లాలకు చెందిన గ్రామీణ యువత కడుపు నింపుతోంది. ప్రో-కబడ్డీలీగ్ తో రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా మార్చి దర్జాగా బతికేలా చేస్తోంది.

గ్రామీణ యువతకు కూడుపెడుతున్న కబడ్డీ!
X

దేశవాళీ క్రీడ కబడ్డీ దేశంలోని పలు రాష్ట్ర్లాలకు చెందిన గ్రామీణ యువత కడుపు నింపుతోంది. ప్రో-కబడ్డీలీగ్ తో రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా మార్చి దర్జాగా బతికేలా చేస్తోంది...

క్రీడలు కూటికా, గుడ్డకా అంటూ పిల్లల్ని ఆటలకు దూరంగా ఉంచే రోజులకు కాలం చెల్లింది. ఫుట్ బాల్, క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి గ్లోబల్ క్రీడలు మాత్రమే కాదు..

పక్కా దేశవాళీ క్రీడ కబడ్డీ సైతం హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర్ర లాంటి దేశంలోని పలు రాష్ట్ర్రాలకు చెందిన ప్రతిభావంతులైన గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాథి అవకాశాలను కల్పిస్తోంది. కడుపు నింపడమేకాదు..కబడ్డీనే నమ్ముకొన్న క్రీడాకారుల జీవితాలు రాత్రికి రాత్రే మారిపోయేలా చేస్తోంది.

పల్లెల నుంచి ప్రపంచ స్థాయికి...

భారత ఉపఖండ దేశాలలోని పల్లెల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన క్రీడ కబడ్డీ. గ్రామీణ ప్రాంతాలలోని యువజనుల జీవితంలో ఓ ప్రధానభాగంగా ఉన్న కబడ్డీ ఏమాత్రం ఖర్చులేని, అత్యంత నిరాడంబరమైన క్రీడ.

మహారాష్ట్ర్ర, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లాంటి రాష్ట్ర్రాల గ్రామీణ ప్రాంతాలలో కబడ్డీ ఓ ప్రధాన క్రీడగా వెలిగిపోతోంది. అపారప్రతిభ కలిగిన గ్రామీణ క్రీడాకారులకు కబడ్డీ అమ్మఒడిలా మారిపోయింది. అక్కున చేర్చుకొని కోట్లరూపాయలకు పడగలెత్తేలా చేస్తోంది.

మహారాష్ట్ర్రలో కబడ్డీ విప్లవం.....

గ్రామీణ క్రీడ కబడ్డీకి, మహారాష్ట్ర్రకు అవినాభావ సంబంధమే ఉంది. నిరుద్యోగంతో అల్లాడుతున్న మరాఠీ యువతకు కబడ్డీ క్రీడే కూడుపెడుతోంది. కబడ్డీ మరాఠీ గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితంలో ఓ ప్రధానభాగం మారిపోయింది. ఎనిమిది దశాబ్దాల క్రితమే మహారాష్ట్ర్రలో కబడ్డీ విప్లవానికి తెరలేచింది. శంకర్ రావ్ సాల్వేని మరాఠీ కబడ్డీ పితామహుడిగా చెబుతారు. కబడ్డీనే ఊపిరిగా భావించిన శంకర్ రావ్ సాల్వేకి కబడ్డీ మహర్షి అన్నబిరుదు సైతం ఉంది.

1970లోనే మహారాష్ట్ర్ర కబడ్డీ జట్టు.. నేపాల్, జపాన్ దేశాలలో ఎగ్జిబిషన్ మ్యాచ్ లు ఆడటం ద్వారా ఈ గ్రామీణ క్రీడకు ఖ్యాతి తీసుకువచ్చింది. మహారాష్ట్ర్ర నుంచే

అభిలాష్ మాత్రే, మాయా కాశీనాథ్, శాంతారామ్ జాదవ్, రాజు భవసార్ లాంటి పలువురు ప్రపంచ మేటి క్రీడాకారులు దూసుకు వచ్చారు.

సినీ హీరోల స్థాయిలో ఆదరణ....

మరాఠా పండుగలు, ఉత్సవాలలో కబడ్డీ ఓ ప్రధాన అంశంగా ఉంటూ వస్తోంది. కబడ్డీ ఆటగాళ్లకు లోకల్ హీరోలుగా గుర్తింపు, ఆదరణ ఉన్నాయి. కబడ్డీ పోటీలలో అసాధారణంగా రాణించిన ఆటగాళ్లకు ఇంటి నుంచి కార్ల వరకూ కానుకలుగా ఉవ్వటం రివాజుగా వస్తోంది.24 కారెట్ల బంగారు ఉంగరాలు, గొలుసులు కానుకలుగా ఇవ్వటం సర్వసాధారణం.

ఒక్క ముంబై మహానగరంలోనే 300కు పైగా కబడ్డీ క్లబ్ లు ఉన్నాయి. థానే జిల్లాలో 200 కబడ్డీ క్లబ్ లు ఉన్నాయి.మరాఠీ గ్రామీణయువతకు కబడ్డీనే ఆలంబనగా, జీవనాధారంగా మారింది. వృత్తిగా, ఓ ఉద్యోగంగా, ఆదాయవనరుగా కబడ్డీని ఎంచుకొటున్నారు.

2014లో ప్రారంభమైన ప్రో-కబడ్డీ లీగ్ ద్వారా రిషాంక్ దేవడిగ తొలి మరాఠా కబడ్డీ సూపర్ స్టార్ గా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత పంకజ్ మోహితే, సంకేత్ సావంత్, నీలేష్ షిండే, అస్లాం ఇనామ్ దార్, విశాల్ మానే, ఆకాశ్ షిండే, బాజీరావ్ హెగ్డే, కాశీలింగ్ అడ్కే, నితిన్ మద్నే, గిరీశ్ మారుతీ ఎర్నాక్ లాంటి ప్లేయర్లు మరాఠీ కబడ్డీకి వెలుగురేఖలుగా ఉంటూ వస్తున్నారు.

మహారాష్ట్ర్రలోని మారుమూల గ్రామానికి చెందిన సిద్ధార్ధ దేశాయ్ తన అన్న సూరజ్ తో కలసి కబడ్డీ ఆడుతూ ఉండేవాడు. ప్రో-కబడ్డీలీగ్ పుణ్యమా అంటూ

సిద్ధార్థ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. 7వ సీజన్ వేలంలో రికార్డు స్థాయిలో కోటీ 45 లక్షల రూపాయల ధర పలికింది.

2022 సీజన్లో జరిగిన ప్రోకబడ్డీ లీగ్ 8వ సీజన్ ఫైనల్స్ కు పూణే నగరం వేదిక నిలిచింది.

కబడ్డీ కేవలం మహారాష్ట్ర్రకే పరిమితం కాలేదు. హర్యానా, పంజాబ్ రాష్ట్ర్రాల నుంచి సైతం డజన్లు కొద్ది గొప్పగొప్ప క్రీడాకారులు ప్రో-కబడ్డీ లీగ్ ద్వారా అభిమానులను ఓలలాడిస్తున్నారు.

ప్రో-కబడ్డీలీగ్ తో దశ తిరిగిన కబడ్డీ...

2014 లో ప్రో-కబడ్డీ లీగ్ తో కబడ్డీకి కొత్త కళ వచ్చింది. క్రీడాకారులకు కాంట్రాక్టు విధానం తో స్టార్ ప్లేయర్లు, ప్రధాన రైడర్లు, డిఫెండర్ల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి.

ప్రారంభ కబడ్డీ లీగ్ తొలిసీజన్ లో 96 మందిగా ఉన్న ఆటగాళ్ల సంఖ్య 8వ సీజన్ నాటికి 300 దాటిపోయింది. రైడింగ్, బ్లాకింగ్ తో సాగే కబడ్డీలో స్పెషలిస్ట్ రైడర్లు, డిఫెండర్లతో పాటు...ఆల్ రౌండర్లకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఆటగాళ్ల ప్రతిభను బట్టి వేలంలో తగిన ధర పలుకుతోంది.

మూడు నుంచి నాలుగు మాసాలపాటు సాగే లీగ్ లో పాల్గొనే ఆటగాళ్లకు కనీస వేతనం 6 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. అత్యధికంగా తెలుగు టైటాన్స్ రైడర్

సిద్ధార్థ దేశాయ్ కు వేలంలో కోటీ 45 లక్షల రూపాయల ధర పలికింది.

ఒకే ఒక్కడు ప్రదీప్ నర్వాల్...

హర్యానాలోని మారుమూల గ్రామంలో జన్మించిన ప్రదీప్ నర్వాల్...ప్రో-కబడ్డీలీగ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. తన రైడింగ్ ప్రతిభతో డబ్బుకు డబ్బు, గుర్తింపుకు గుర్తింపు సంపాదించుకొన్నాడు.

ప్రో-కబడ్డీలీగ్ రెండో సీజన్ ద్వారా అడుగుపెట్టిన ప్రదీప్ నర్వాల్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ కు కెప్టెన్ కమ్ స్టార్ రైడర్ గా సేవలు అందిస్తున్న ప్రదీప్ నర్వాల్ కేవలం కబడ్డీ లీగ్ ద్వారానే ఏడాదికి 70 లక్షల నుంచి 90 లక్షల రూపాయల వరకూ ఆర్జిస్తున్నాడు.

కబడ్డీ లీగ్ చరిత్రలోనే ఫాజిల్ అట్రాచెలీ, మంజీత్ చిల్లర్, సందీప్ నర్వాల్, మోహిత్ చిల్లర్, మనిందర్ సింగ్, ప్రదీప్ నర్వాల్, పవన్ షెరావత్ అత్యుత్తమ క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకొన్నారు.

ఐపీఎల్ తర్వాతి స్థానంలో కబడ్డీ లీగ్..

భారత్ లో అత్యంత జనాదరణ పొందుతున్న మొదటి నాలుగు ప్రొఫెషనల్ లీగ్ లలో ప్రోకబడ్డీలీగ్ సైతం నిలవడం విశేషం. ప్రో- కబడ్డీలీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం..

బహుళజాతి వీవో సంస్థ 42 మిలియన్ డాలర్ల భారీమొత్తం చెల్లించిందంటే..కబడ్డీ లీగ్ కు ఉన్న ఆదరణ ఏపాటిదో మరి చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ తర్వాత అత్యధికమంది అభిమానులున్న, టీవీ ప్రసారాల ద్వారా వీక్షిస్తున్న క్రీడ ప్రో-కబడ్డీ లీగ్ మాత్రమే.

ప్రపంచీకరణతో భారత క్రీడారంగానికి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం స్టార్ స్పోర్ట్స్ ప్రాయోజిత ప్రో-కబడ్డీ లీగ్ మాత్రమే. గ్రామీణ క్రీడాకారులకు ఉపాథితో పాటు..కబడ్డీ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాలలో గుర్తింపు లభించడం విశేషం.

First Published:  23 March 2023 6:11 AM IST
Next Story