Telugu Global
Sports

ఐపీఎల్ వేలంలో ఉనద్కత్ కు ఘోరం!

కొచ్చీలో ముగిసిన ఐపీఎల్ మినీవేలం కొందరికి మోదాన్ని కలిగిస్తే...మరికొందరికి ఖేదాన్ని మిగిల్చింది. సౌరాష్ట్ర్ర కెప్టెన్, భారత టెస్ట్ బౌలర్ గ్రాఫ్ 11 కోట్ల 50 లక్షల నుంచి 50 లక్షల రూపాయల ధరకు పడిపోయింది.

ఐపీఎల్ వేలంలో ఉనద్కత్ కు ఘోరం!
X

ఐపీఎల్ వేలంలో ఉనద్కత్ కు ఘోరం!

కొచ్చీలో ముగిసిన ఐపీఎల్ మినీవేలం కొందరికి మోదాన్ని కలిగిస్తే...మరికొందరికి ఖేదాన్ని మిగిల్చింది. సౌరాష్ట్ర్ర కెప్టెన్, భారత టెస్ట్ బౌలర్ గ్రాఫ్ 11 కోట్ల 50 లక్షల నుంచి 50 లక్షల రూపాయల ధరకు పడిపోయింది...

భారత క్రికెట్ బోర్డు గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ వేలం ఓ లాటరీలా తయారయ్యింది. ఏ సీజన్లో ఏ ఆటగాడికి ఎందుకు కళ్లు చెదిరే ధర పలుకుతుందో? ప్రతిభ ఉన్నా, నిలకడగా రాణిస్తున్నా కొందరికి నామమాత్రపు ధర ఎందుకు వస్తుందో? అంతు పట్టని మిస్టరీలా తయారయ్యింది.

పాపం! ఉనద్కత్...

సౌరాష్ట్ర్ర కెప్టెన్, భారత టెస్టు బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు 2023 ఐపీఎల్ వేలం చేదుఅనుభవాన్ని మిగిల్చింది. భారత టెస్టుజట్టులో 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత చోటు దక్కడం, బంగ్లాతో ఆఖరి టెస్టులో 2 వికెట్లు పడగొట్టిన ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది. గత ఏడాది కాలంగా అద్భుతంగా రాణించడంతో పాటు

అసాధారణ నైపుణ్యం ప్రదర్శించిన 31 సంవత్సరాల జయదేవ్ ఉనద్కత్ కు వేలంలో దక్కిన ధర కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే.

ఆకాశం నుంచి పాతాళానికి...

2018 సీజన్లో ఉనద్కత్ కు ఐపీఎల్ వేలంలో దక్కిన ధర 11 కోట్ల 50 లక్షలు. అదే ..2023 సీజన్ వేలంలో దక్కిన ధర 50 లక్షలు మాత్రమే. ఎక్కడి 11 కోట్ల 50 లక్షలు...ఎక్కడి 50 లక్షలు అంటూ ఉనద్కత్ మాత్రమే కాదు..క్రికెట్ పండితులు సైతం ముక్కుమీద వేలేసుకోవాల్సి వచ్చింది.

2023 సీజన్ కోసం నిర్వహించిన మినీ వేలంలో కెఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కనీస ధర 50 లక్షల రూపాయలకే ఉనద్కత్ ను సొంతం చేసుకోగలిగింది.

గొప్పగా రాణించినా....

దేశ‌వాళీ క్రికెట్‌లో స్టార్ బౌల‌ర్ గా , అత్యంత నిలకడగా రాణిస్తున్న,నమ్మదగిన బౌలర్ గా పేరున్న ఉనద్క‌త్ కు 2018 త‌ర్వాత ఇంత త‌క్కువ ధ‌ర‌ పలకడం విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేసింది.

2018లో ఉనద్కత్ కు జైపూర్ ఫ్రాంచైజీ చెల్లించిన ధర రూ.11.5 కోట్ల‌ు. అయితే, ఆ సీజ‌న్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో దారుణంగా విఫలమయ్యాడు.

అయినా ఉనద్కత్ ప్రతిభ పైన విశ్వాసం ఉంచి 2019 సీజన్లో 8.4 కోట్లకు మ‌ళ్లీ కొనుగోలు చేసింది.

ఐపీఎల్ 2020, 21 సీజన్లలో రూ. 3 కోట్లకు ఉనద్క‌త్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అట్టిపెట్ట‌కుంది. గత సీజ‌న్ వేలంలో ఉనద్క‌త్‌ను ముంబై ఫ్రాంచైజీ కోటీ 30 లక్షల ధరకు సొంతం చేసుకుంది.

12 ఏళ్ళలో పైకి..కిందకీ...

ఐపీఎల్ లో ఉనద్క‌త్ ప్రస్థానం 2010లో ప్రారంభమయ్యింది. కోల్ కతా ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేశాడు. అయితే.. ఉనద్కత్ ఐపీఎల్‌ కెరీర్ మ‌లుపు తిరిగింది మాత్రం 2017లోనే. ఆ సీజ‌న్‌లో పూణె సూప‌ర్ జెయింట్స్‌కు ఆడిన ఉనాద్క‌త్ 12 మ్యాచుల్లోనే 24 వికెట్లు పడగొట్టాడు.. దాంతో ఆ మరుసటి సీజ‌న్‌లో అతని వేలం మొత్తం అమాంతం పెరిగిపోయింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఏకంగా రూ.11 కోట్ల 50 లక్షలు చెల్లించింది.

మొత్తానికి..ఉనద్కత్ ఐపీఎల్ గ్రాఫ్..భారత షేర్ మార్కెట్ గ్రాఫ్ లా పడుతూ ..లేస్తూ వచ్చి..చివరకు 2023 సీజన్ వేలంలో పాతాళానికి పడిపోయింది.

First Published:  24 Dec 2022 5:15 AM GMT
Next Story