ఉనద్కత్ జెర్సీల మురిపెం!
కొందరు స్టార్ క్రికెటర్లు వందకుపైగా టెస్టులు ఆడినా పొందలేని తృప్తిని భారత్ కమ్ సౌరాష్ట్ర్ర పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కేవలం రెండుటెస్టులు ఆడటం ద్వారానే సంపాదించాడు. టెస్టుమ్యాచ్ లు ఆడుతూ తాను ధరించిన భారతజట్టు జెర్సీలను చూసుకొంటూ మురిసిపోతున్నాడు....
కొందరు స్టార్ క్రికెటర్లు వందకుపైగా టెస్టులు ఆడినా పొందలేని తృప్తిని భారత్ కమ్ సౌరాష్ట్ర్ర పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కేవలం రెండుటెస్టులు ఆడటం ద్వారానే సంపాదించాడు. టెస్టుమ్యాచ్ లు ఆడుతూ తాను ధరించిన భారతజట్టు జెర్సీలను చూసుకొంటూ మురిసిపోతున్నాడు....
జయదేవ్ ఉనద్కత్...19 సంవత్సరాల వయసులో తొలిటెస్టు, 31 సంవత్సరాల వయసులో తన రెండో టెస్టుమ్యాచ్ ఆడిన అతిఅరుదైన క్రికెటర్. ఆటనే నమ్ముకొని అంకితభావంతో శ్రమిస్తే ఆలస్యంగానైనా అవకాశం వెతుక్కొంటూ వస్తుందనటానికి ఉనద్కత్ ను మించిన నిదర్శనం మరొకటి ఉండదు.
సౌరాష్ట్ర్ర నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు....
సౌరాష్ట్ర్ర నుంచి అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగిన జయదేవ్ ఉనద్కత్ కు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ గా, లోయర్ మిడిలార్డర్ లో నమ్మదగిన బ్యాటర్ గా పేరు, గుర్తింపు మాత్రమే కాదు...చక్కటి రికార్డు సైతం ఉంది.
దేశవాళీ రంజీ క్రికెట్ తో పాటు మిగిలిన ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తూ వచ్చినా ఉనద్కత్ కు అవకాశాలు తక్కువగానే వచ్చాయి. 19 సంవత్సరాల వయసులోనే భారత్ తరపున...అదీ దక్షిణాఫ్రికా పేస్, బౌన్సీ పిచ్ పైన టెస్టు మ్యాచ్ ఆడే అరుదైన అవకాశం దక్కింది.
2010 దక్షిణాఫ్రికా సిరీస్ లో భాగంగా సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ ద్వారా టెస్టు అరంగేట్రం చేసిన సమయంలో ఉనద్కత్ కు అనుభవం కొరవడింది. కనీసం ఒక వికెట్టు పడగొట్టలేకపోయాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత..మరో టెస్టు అవకాశం కోసం పుష్కరకాలంపాటు ఎదురుచూడాల్సి వచ్చింది.
దేశవాళీ క్రికెట్లో తిరుగులేని ఉనద్కత్...
జాతీయజట్టులో తనకు చోటు దక్కకపోడంతో ఉనద్కత్ ఏమాత్రం నిరాశకు గురికాలేదు. ఆట పైన ప్రేమను పెంచుకొని నిరంతరం శ్రమిస్తూ ఏళ్ల తరబడి నిలకడగా రాణిస్తూ వచ్చాడు.
తన తొలిటెస్టు ఆడిన తర్వాత నుంచి గత ఆరు సీజన్లలో 224 వికెట్లు పడగొట్టాడు. 2019-20 రంజీ సీజన్లో మొత్తం 10 మ్యాచ్ లు ఆడి 67 వికెట్లు సాధించడం ద్వారా భారత నంబర్ వన్ దేశవాళీ బౌలర్ గా నిలిచాడు. దులీప్ ట్రోఫీ మ్యాచ్ ల్లో సైతం వెస్ట్ జోన్ తరపున 13 వికెట్లు సాధించాడు.
12 సంవత్సరాల క్రితమే భారత టెస్ట్ క్యాప్ అందుకొన్న ఉనద్కత్ కు 7 వన్డేలు, 10 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 96 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 353 వికెట్లు పడగొట్టిన ఘనత సైతం ఉంది.
12 ఏళ్ళ 2 రోజులకు చాన్స్...
2010 డిసెంబర్ 10న దక్షిణాఫ్రికా పై తన తొలిటెస్టుమ్యాచ్ ఆడిన ఉనద్కత్ తిరిగి..12 సంవత్సరాల 2 రోజుల విరామం తర్వాత మరో అవకాశం దక్కించుకోగలిగాడు. 2022 డిసెంబర్ 22న కానీ తన రెండోటెస్టు మ్యాచ్ ను ఆడలేకపోయాడు.
మీర్పూర్ నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన కీలక రెండోటెస్టు తుదిజట్టులో ఉనద్కత్ కు చోటు దక్కింది. రెండుఇన్నింగ్స్ లోనూ 3 ప్రధాన వికెట్లు పడగొట్టాడు.
టెస్టు క్రికెట్లో తన వికెట్ ను అరంగేట్రం చేసిన 12 ఏళ్ల 2 రోజులకు కానీ పడగొట్టలేకపోయాడు. అంతేకాదు...
డియర్ రెడ్ బాల్..నాకు మరో టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వు, నీ పేరు నిలబెడతా అంటూ ట్విట్ చేయడం ద్వారా జయదేవ్ ఉనద్కత్ తన ఆనందాన్ని , టెస్టు క్రికెట్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పాడు.
భారతజట్టు జెర్సీలంటే తగని ప్రేమ...
ఉనద్కత్ కు భారతజట్టు జెర్సీలంటే తగని మక్కువ.భారతజట్టులో సభ్యుడిగా టీమ్ షర్టు ( జెర్సీ ) ధరించిన సమయంలో తనకు ఎనలేని అనుభూతి ఉంటుందని ప్రకటించాడు.
తాను ధరించిన జెర్సీలను అపురూపంగా చూసుకొంటూ ఉంటాయి. 2010లో తాను అరంగేట్రం టెస్టుమ్యాచ్ ఆడిన సమయంలో భారతజట్టులోని సహఆటగాళ్లు సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ తో సహా అందరి ఆటోగ్రాఫులను తాను ధరించిన టీమ్ జెర్సీపైన భద్రపరచుకొన్నాడు.
అంతేకాదు...బంగ్లాదేశ్ తో ముగిసిన 2022 సిరీస్ లో సైతం తాను ధరించిన టెస్టు జెర్సీపైన ప్రస్తుత జట్టులోని సభ్యుల సంతకాలను సైతం సేకరించాడు. 2010, 2022 సిరీస్ ల్లో తాను ధరించిన జెర్సీలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొని మరీ 31 సంవత్సరాల ఉనద్కత్ తెగమురిసిపోతున్నాడు.
ఐపీఎల్ నడమంత్రపు సిరితో కోట్లు వెనుకేసుకొంటూ, ఖరీదైన కార్లు, వజ్రవైఢ్యూర్యాలు పొదిగిన వాచీలు కొంటూ కొందరు క్రికెటర్లు గాల్లో తేలిపోతుంటే..క్రికెట్టే శ్వాసగా భావించే జయదేవ్ ఉనద్కత్ మాత్రం...తాను ధరించిన భారత జెర్సీలను చూస్తూ పొంగిపోడం, మురిసిపోడం అపురూపమే మరి.!
అందుబాటులో ఉన్నా..అనుభవజ్ఞుడైన జయదేవ్ ఉనద్కత్ వైపే భారత టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గు చూపింది.