Telugu Global
Sports

88 ఏళ్ళ రంజీ చరిత్రలో అరుదైన రికార్డు!

రాజ్ కోట్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రంజీ మాజీ చాంపియన్ ఢిల్లీతో ప్రారంభమైన రంజీట్రోఫీ తొలిరౌండ్ పోటీ తొలిరోజుఆటలోనే సౌరాష్ట్ర్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ చెలరేగిపోయాడు.

Jaydev Unadkat
X

జయదేవ్ ఉనద్కత్

దేశవాళీ క్రికెట్ రంజీట్రోఫీ 2023 సీజన్ తొలిరౌండ్ మ్యాచ్ లోనే ఓ అరుదైన రికార్డు నమోదయ్యింది. సౌరాష్ట్ర్ర కెప్టెన్, భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ తొలి ఓవర్ హ్యాట్రిక్ తో సరికొత్త చరిత్ర సృష్టించాడు....

88 సంవత్సరాల రంజీట్రోఫీ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పిన మొనగాడిగా సౌరాష్ట్ర్ర కెప్టెన్, భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ నిలిచాడు.

12 సంవత్సరాల తర్వాత భారత టెస్టుజట్టులో చోటు సంపాదించడంతో పాటు తన తొలి టెస్టు వికెట్ పడగొట్టిన 31 సంవత్సరాల జయదేవ్ ఉనద్కత్ ..2023 సీజన్ రంజీ తొలిరౌండ్ మ్యాచ్ లోనే విశ్వరూపం ప్రదర్శించాడు.

ఉనద్కత్ పేస్ కి ఢిల్లీ క్లోజ్...

రాజ్ కోట్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రంజీ మాజీ చాంపియన్ ఢిల్లీతో ప్రారంభమైన రంజీట్రోఫీ తొలిరౌండ్ పోటీ తొలిరోజుఆటలోనే సౌరాష్ట్ర్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ చెలరేగిపోయాడు.

టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఢిల్లీజట్టు ప్రత్యర్థి సౌరాష్ట్ర్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ విశ్వరూపాన్ని చూడాల్సి వచ్చింది.

మ్యాచ్ తొలి ఓవర్ 3, 4, 5 బంతుల్లో వరుస వికెట్లు పడగొట్టడం ద్వారా ఉనద్కత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. రంజీ చరిత్రలోనే తొలి ఓవర్ హ్యాట్రిక్ నమోదు చేసిన ఏకైక బౌలర్ గా నిలిచాడు.

తన తొలి ఓవర్ నాలుగో బంతికి ధృవ్ షోరే, 5వ బంతికి వైభవ్ రావల్, 6వ బంతికి కెప్టెన్ యాష్ ధుల్ ల వికెట్లను ఉనద్కత్ పడగొట్టాడు. తన రెండో ఓవర్ లో సైతం ఉనద్కత్ మరో రెండు వికెట్లు సాధించాడు. లలిత్ యాదవ్, లక్ష్యా థరేజాలను సైతం పెవీలియన్ దారి పట్టించాడు. ఉనద్కత్ తన మొదటి రెండు ఓవర్లలో 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో ఢిల్లీ 53 పరుగులకే 8 టాపార్డర్ వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

రంజీ క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో ఐదుకు పైగా వికెట్లు సాధించడం జయదేవ్ ఉనద్కత్ కెరియర్ లో ఇది 21వసారి. కేవలం తన బౌలింగ్ ప్రతిభతోనే 2022 సీజన్ రంజీ టైటిల్ ను సౌరాష్ట్ర్ర జట్టుకు అందించాడు.

రంజీ క్రికెట్లో రెండో హ్యాట్రిక్...

2017-18 రంజీ సీజన్లో ముంబైతో జరిగిన పోరులో కర్నాటక కెప్టెన్ వినయ్ కుమార్ తన తొలి ఓవర్ , మూడో ఓవర్లలో కలిపి మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అయితే...ఇన్నింగ్స్ తొలిఓవర్లోనే మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టిన ఘనత మాత్రం ఉనద్కత్ కు మాత్రమే దక్కుతుంది.

టెస్టు క్రికెట్లో మాత్రం భారత మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించిన బౌలర్ గా ఇర్ఫాన్ పఠాన్ నిలిచాడు.

గత నెలలో ముగిసిన విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఉనద్కత్ అత్యధికంగా 19 వికెట్లు పడగొట్టడం ద్వారా సౌరాష్ట్ర్రను జాతీయ చాంపియన్ గా నిలిపాడు.

2010లో తన తొలిటెస్టు మ్యాచ్ ఆడిన ఉనద్కత్ రెండోటెస్టు ఆడటానికి 2022 వరకూ వేచిచూడాల్సి వచ్చింది. మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన రెండోటెస్టు తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ పడగొట్టాడు.

జయదేవ్ ఉనద్కత్ ప్రస్తుత మ్యాచ్ వరకూ తన కెరియర్ లో 97 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడటం విశేషం.

First Published:  3 Jan 2023 3:12 PM IST
Next Story